ప్రశ్న: బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద తెల్లగా ఉంటుంది. ఎందువల్ల?
🔷 జవాబు: బొగ్గులో కార్బన్ కణాలుంటాయి. వాటి రంగు నలుపు. బొగ్గును కాల్చినపుడు ఆ కార్బన్ గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి కార్బన్ డై ఆక్సైడ్‌గా మారుతుంది. అలా అయితే, బొగ్గు పూర్తిగా కాలిపోతే ఆ ప్రదేశంలో మరేమీ మిగిలి ఉండకూడదని, ఒకవేళ పూర్తిగా కాలకపోతే కొన్ని నల్లని కార్బన్ కణాలు మాత్రమే ఉండాలని అనుకుంటాం. కానీ అలా జరగడంలేదు. ఎందువల్లనంటే, బొగ్గులో నల్లని రంగులో ఉండే కార్బన్ కణాలే కాకుండా కార్బన్, హైడ్రోజన్ కలిసి ఉండే హైడ్రోకార్బన్ సమ్మేళనాలు, పొటాషియం, కాల్షియం అల్యూమినియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.
బొగ్గును కాల్చినపుడు కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడడంతోపాటు అందులోని హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్, కార్బన్‌లుగా విడివడతాయి. కార్బనేమో ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌డై ఆక్సైడ్ వాయువుగా మారితే, హైడ్రోజనేమో ఆక్సిజన్‌తో కలిసి నీటి ఆవిరిగా మారుతుంది. ఇక ఖనిజ లవణాలలోని ఖనిజాలు ఆక్సిజన్‌తో కలిసి ఖనిజ ఆక్సైడ్లుగా మారుతాయి. ఈ ఆక్సైడ్‌లు ఉష్ణం వల్ల సులభంగా విడివడకపోవడంతో తెల్లని పొడి (బూడిద) రూపంలో మిగిలిపోతాయి. ఒక్కోసారి కాలకుండా మిగిలిన కార్బన్ కణాలు, ఖనిజ ఆక్సైడ్‌లతో ఏర్పడిన తెల్లని బూడిదతో కలవడం వల్ల ఈ పొడి బూడిదరంగులో కూడా ఉంటుంది.
ప్రశ్న: భూమి నుంచి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకేవైపు కనిపిస్తాడు ఎందుకు?
జవాబు: చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే కాలం, అలా తిరుగుతూనే దాని అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరగడానికి పట్టే పరిభ్రమణ కాలం సమానంగా ఉండడం వల్ల ఎల్లప్పుడూ చంద్రుని ఒక వైపు ఉపరితలమే మనకు కనిపిస్తుంది. చంద్రుని కక్ష్యకు ఉండే ఈ ధర్మాన్ని ఏక కాలిక భ్రమణం (Synchronous Rotation) అంటారు. చంద్రుడు ఇలా తిరగడానికి కారణం చంద్రునిపై భూమి ప్రయోగించే ఆటుపోట్ల ప్రభావం. చంద్రునిపై ఎలాంటి సముద్రాలు లేకపోవడంతో అక్కడ ఆటుపోట్లకు గురై పొంగిపొరలే నీరు లేనందున, భూమి గురుత్వాకర్షణ బలం చంద్రుని తలంపైనే పనిచేస్తుంది. ఆ ప్రభావం చంద్రుని తలాన్ని పైకి కిందకీ ఊగేటట్లు చేస్తుంది. అందువల్ల చంద్రుడు తన చుట్టూ తాను తిరిగే పరిభ్రమణ వేగం క్రమేపీ తగ్గుతూ, అది చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే ప్రదక్షిణ కాలానికి సమానమైంది. అందువల్లే మనం ఎల్లప్పుడూ చంద్రుని ఒకవైపు ఉండే గోతులను (Craters) ఎత్తు పల్లాలను చూస్తున్నాం. అదే కాకుండా చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉండడంతో చంద్రుడు ఉపరితలంలో సగం కన్నా ఎక్కువగా, 59 శాతం మేర చూడగలుగుతున్నాం. మానవుడు ప్రయోగించిన అంతరిక్ష నౌకలు చంద్రుని అవతలి వైపునకు వెళ్లి అక్కడి ఛాయాచిత్రాలను భూమికి పంపే వరకు అది ఎలా ఉంటుందనే సంగతి మనకు తెలియలేదు.
No comments:
Post a Comment