Pages

Thursday, September 21, 2017

అక్షర్తోత్పత్తి

అక్షర్తోత్పత్తి


ఇదం అంధతమః కృత్స్నం/ జాయతే భువనత్రయం
యది శబ్దాన్వయం జ్యోతి: ఆసంసారం న దీప్యతే
మూడు లోకాలలో శబ్దమనే జ్యోతి వెలిగి ఉండక పోతే, ఈ సమస్త జగత్తు అంధకారంలో మునిగి ఉండేది అని శ్లోక భావం.
నిజమేకదా! పశువులనుండి మనుషులనువేరు చెసేది, మది గదిలో నిదురించిన భావాలను వెలికితీసి, నలుగురితో పంచుకోనేలా చెసేది, సంఘజీవిగా మనిషి మనుగడ సాగించడానికి ఉపయోగ పడేది, గతాన్ని మనకు తెలిపి, వర్తమానంలో మన నడవడికి ఒరవడులు దిద్ది, భవిష్యత్తులోకినడిపించేది ఈ భాషేకదా! అట్టి *భాషకి మూలం అక్షరాలు.

#న క్షరః అక్షరః#* అనగా *క్షరము కానిది (నాశనములేనిది) అక్షరము.
#అక్షరాణామ్ అకారోస్మి#* అక్షరాలలో *అ*కారాన్ని నేను. అని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపి, అక్షరాల గొప్పతనాన్ని మనకి విశదీకరించెను.

 అందుకే అక్షరాలతో ఏర్పడే శబ్దాన్ని *శబ్ద బ్రహ్మ*గా *ఉపనిషత్తులు* ఎలా వివరించాయో చూడండి.
అనాది నిధనం బ్రహ్మ/ శబ్దతత్త్వం యదక్షరం‌ వివర్తతేర్థ భావేన ప్రక్రియా జగతో యతః

పూర్వకాలంనుండి శబ్ద బ్రహ్మ అక్షరరూపంలో ఈ జగత్తులో వ్యాపించి ఉందని, దానిని మనం సభక్తి పూర్వకంగా సేవించాలని పైశ్లోకం వివరిస్తుంది. అట్టి అక్షరాల ఉత్పత్తిని ఋషులు దర్శించి* మనకి అందించిన విధానాన్ని, ఈ వ్యాసం ద్వారా పెద్దలు తెలుసుకొని, పిల్లలకి భారతీయ ఋషుల గొప్పతనాన్ని, వారి ప్రతిభాపాటవాలని వివరించాలని కోరిక.

నేటి శాస్త్రజ్ఞులు లింగ్విస్టిక్ సైన్సు ద్వారా అక్షరాల అమరికలని, భాష ప్రదుర్భావాన్నిఆధునిక పద్ధతిలో వివరించటానికి పూర్వమే, *అరటిపండు వలచి చేతిలో పెట్టి* నట్లు అక్షరాల ఉత్పత్తిని, వాటిని పలికే విధానాన్ని, మన ఋషులు తేటతెల్లం చేసారు. అద్భుతమైన ఈ అక్షరోత్పత్తిని తెలుసుకొందాం.

పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు పర్యాయాలుమ్రోగించగా,ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి, పదునాలుగు వ్యాకరణ సూత్రాలుగ రచించెను. ఈ సూత్రాలే "మాహేశ్వర ప్రత్యాహారసూత్రాలు"గా పిలువబడుతున్నాయి, ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు.* పైన చెప్పిన విషయానికి ఈ క్రిందిశ్లోకం ప్రమాణం

నృత్యా వసానే నాటరాజ రాజో ననాద ఢక్కాం నవ పంచవారం* ( *నవ=*తొమ్మిది. *పంచ=*ఐదు కలిపితే =14)
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివ సూత్రజాలం

అక్షరాలని గ్రహించి సూత్రీకరించింది *పాణిని మహర్షి* ఐతే, వాటికి వార్తికం (సూత్రాదులను వివరించడం కోసం రచించిన వ్యాఖ్యాన గ్రంథం.) వ్రాసినది మాత్రం *వరరుచి*. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది *పతంజలి మహర్షి* అందుకనే
వాక్యాకారంవరరుచిం భాష్యాకారం పతంజలిం పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం

అని ముందుగా పైముగ్గురు మునులకి నమస్కరించి, పూర్వం వ్యాకరణాన్ని,తద్వారా భాషని అభ్యసించేవారు. ఇక అక్షరరూపంలోఉన్న పదునాలుగు సూత్రాలని తెలుసుకొందాం. ( ఇవి *ఢమరుక నాదాలని* మరచిపోవద్దు.)
1.‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు).
2.‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు).
3.‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు).
4.‘ ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము).
5.‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు)
6.‘ల ణ్’ (లకారం)
7.‘ఙ, మ, ఞ, ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు )
8.‘ఝ, భ య్’ ( ఝాకార, భకారాలు)
9.‘ఘ,ఢ,ధ ష్’
(ఘకారం, ఢ కారం, ధకారం)
10.‘జ, బ, గ, డ ద శ్’ ( ఐదు అక్షరాలు )
11.‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు)
12.‘క ప య్’ (క & ప)
13.‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు )
14.‘హల్’ ( హకారం)

“ఇతి మాహేశ్వరాణి చతుర్దశ ప్యత్యహార సూత్రాణి”

ఈ పదునాలుగూ  మహేశ్వరుని ద్వారా ప్రేరేపంపబడ్డ  సూత్రాలు. 
ప్రతి సూత్రం చివర ఉన్న పొల్లు హల్లులు సులభంగా పలకడానికి నిర్దేశించ బడినవి.#* అట్లే *#అచ్చులు, హల్లులు కూడ ప్రత్యాహార సంజ్ఞతో సులభంగ అర్థమయే రీతిలోనిర్దేశించబడినవి.#* అవి తొలి సూత్రము లోని మొదటి అక్షరం *అ* నాల్గవ సూత్రము లోని చివరి హల్లు *చ్* కలిపితే *అచ్* సంజ్ఞ ఏర్పడి, వాటిమధ్య ఉండే అక్షరాలని *అచ్చులు* అనివ్యవహరించెదరనియు, ఐదవ సూత్రము లోని మొదటి అక్షరం ‘హ’ని గ్రహించి పదునాల్గవ సూత్రములోని చివర ఉన్న ‘ల్’ అనే పొల్లుతో కలిపితే ‘హల్’అనే సంజ్ఞ ఏర్పడి వాటి మధ్య ఉండే అక్షరాలని ‘హల్’ అనే పేరుతో పిలుతురని పాణిని విపులముగా వివరించెను. ఇట్టి సూత్రములతో ఎనిమిది అధ్యాయాలలో *పాణినిచె రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథానికి “అష్టాధ్యాయి” అని పేరు.* ఈ సూత్రాలకే *వరరుచి* వార్తికాలని, *పతంజలి*భాష్యాన్ని విరచించి లోకానికి ప్రసాదించిరి. *#భాషాశాస్త్ర వేత్తలకి ఇప్పటికీ ఇదే గొప్ప ప్రామాణిక గ్రంథము.

ఇక అక్షరాలని ఎలాపలుకుతామో ఇప్పుడు తెలుసుకొందాం. ముందుగా సంస్కృత సూత్రాలని తెలిపి, వాటిని తెలుగులో వివరిస్తాను.
అకుహ విసర్జ నీయానాం కంఠ:#*
అ ఆ లు, కవర్గ, హకారమూ, విసర్గలు, అనే అక్షరాలు కంఠము నుండి వెలువడి పలుకబడతాయి.
ఇ చు యశానాం తాలు.#* ఇ ఈ లు, చవర్గ, యకారము, శకారము తాలువు అనగా నాలుకతో పలుకబడతాయి.
ఋ టు ర షాణామ్ మూర్ధా* ఋకారము, టవర్గ, రకారము, షకారము అనే అక్షరాలూ పలికేటప్పుడు శబ్దం శిరస్సునుండి వెలువడుతుంది. మూర్ధా అంటే శిరస్సు.
లు తు ల సనామ్ దంతాః* అచ్చులలోని అలూ అనే అక్షరం, తవర్గ, లకారము, సకారము దంతముల సహాయముతో పలుకుబడతాయి.
ఉ పూప పద్మానీయానాం ఓష్టౌ* ఉ,ఊలు, పవర్గ పెదవులతో పలుకబడతాయి.
ఙ మ ఞ ణ నానాం నాసికాచ* వర్గల యొక్క చివరి అక్షరములు ఐదు నాసిక అంటే ముక్కు. అవి ముక్కుతో పలుకబడతాయి.
ఏ దైతో: కంఠ తాలు* ఏకారము, ఐకారము కంఠము, నాలుక సాహాయముతో పుడతాయి.
ఓ దౌ తో: కంఠ, ఓష్ట్యం* ఓ మరియు,ఔ అనేఅచ్చులు కంఠము, పెదవుల కలయికతో పుడతాయి.
వ కారస్య దంతోష్ట్యం* వకారము దంతములు, పెదవుల సాహాయముతో ఉచ్ఛరించ బడుతుంది.

అక్షరాల పుట్టుకని, వాటిని పలకడానికి ఉపయోగపడే స్థానాలని ‘పాణిని మహర్షి’
ఎంత విపులంగా వివరించాడో! ఇంకా వీటికి *స్వరాలని,వ్యంజనాలని, ప్రాణులని, మహాప్రాణులని* ఇలా అక్షరాలకి రకరకాల పేర్లు పెట్టి అవి ఉచ్చారణలో ఎలా ఉపయోగ పడతాయోతెలియ జెప్పిన ఋషుల గొప్పతనాన్ని తెలుసుకొని వారిని నిత్యం స్మరించుకోవడం మరియు వారి అడుగుజాడల్లో నడుచుకోవడం మన విధి.

దేశ భాషలందు తెలుగు లెస్స

తెలుగు చదువుదాము
తెలుగు మాట్లాడుదాం
తెలుగు వ్రాద్దాం
సర్వేజనాఃసుఖినోభవంతు
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

1 comment:

  1. ఎంత బాగా అందించారో యీ అక్షారోత్పత్తి వ్యాసమును. మీకు శతకోటి ధన్యవాదములు. ఋషుల వైసిష్ట్యాన్ని వారి శ్రమను, వారి మేధస్సును కూడా చక్కగా వర్ణించారు. మహేశ్వరుని కి, ఋషులకు, మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete

.