Pages

Thursday, September 21, 2017

అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు

అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు

ముప్పు ముంచుకొచ్చే ముందు వరకూ తెలియదు. అలాంటిదే 'హైపర్‌టెన్షన్‌' కూడా! చాప కింద నీరులా పాకుతూ ఏకంగా గుండెకే చేటు చేసేంత ప్రమాదకరంగా పరిణమించే నిశ్శబ్ద రుగ్మత ఇది. అందుకే, లక్షణాలు బయపడేదాకా ఎదురు చూడకుండా, తరచుగా బీపీ పరీక్ష చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.

కుళాయిలో నీరు తగినంత ఫోర్స్‌తో వస్తేనే ధార చక్కగా పడుతుంది. నీటి వేగం ఎక్కువైనా, తక్కువైనా ధారలో తేడా వచ్చినట్టే, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు ఒత్తిడిలో హెచ్చుతగ్గులైనా రక్తపోటులో తేడా వస్తుంది. ప్రతి వ్యక్తి శరీరంలోని రక్తంలో కొంత ప్రెషర్‌ ఉంటుంది. ఆ ప్రెషర్‌ వల్లే గుండె నుంచి రక్తం శరీరంలోని ప్రతి ఒక్క రక్తనాళంకీ సక్రమంగా చేరుతుంది.

ఆ ప్రెషర్‌ అవసరానికి మించి ఎక్కువ ఉంటే ఆ పరిస్థితినే 'హైపర్‌టెన్షన్‌' అంటారు. 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువాళ్లకు బ్లడ్‌ ప్రెషర్‌ 140/90 వరకూ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. పసికందులు, స్కూలుకి వెళ్లే వయసు పిల్లలకు బీపీ ఇంకా తక్కువగా ఉంటుంది. అది సాధారణమే! ఇక 50 ఏళ్లు దాటిన వారికి వయసుతోపాటు బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది.

రక్తపోటు పెరిగిపోతే ఆ ప్రభావం ప్రధానంగా గుండె మీద పడుతుంది. వేగంగా గుండెకు రక్తం చేరుతూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో గుండె కండరాలు, కవాటాల్లో సమస్యలు మొదలవుతాయి. రక్తాన్ని వడగట్టే మూత్ర పిండాలు కూడా దెబ్బతింటాయి. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? అనే విషయాల్లోకి లోతుగా వెళ్తే కచ్చితమైన సమాధానం దొరకకపోవచ్చు. హైపర్‌టెన్షన్‌కు ఎన్నో కారణాలుంటాయి. వయసుతో పని లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా హైపర్‌టెన్షన్‌ రావొచ్చు.

అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు ప్రధానంగా కొన్ని ఉన్నాయి. అవేంటంటే.*...

అధిక బరువు:*అధిక బరువు వల్ల శరీరం లావవుతుంది. దాంతో చర్మం ఉపరితలం వరకూ రక్తసరఫరా జరపటం కోసం రక్తనాళాలు చెట్టు కొమ్మల్లా పెరుగుతూ పోతాయి. వాటి చివర్ల వరకూ రక్తం సరఫరా కావాలంటే రక్తం ఫోర్స్‌ పెరగాలి. ఇందుకోసం గుండె మరింత బలంగా రక్తాన్ని సరఫరా చేయాలి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే రక్తంలో ప్రెషర్‌ పెరిగిపోయి హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తుంది.

ఒత్తిడి:* మానసికం, శారీరకం...ఒత్తిడి ఎలాంటిదైనా దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఒత్తిడితో కూడిన జీవనవిధానాన్ని అవలంబించేవాళ్లు హైపర్‌టెన్షన్‌కి తేలికగా గురవుతారు.

అస్తవ్యస్త జీవనశైలి:* సమయానికి నిద్ర, ఆహారం తీసుకోకపోవటం, రోజుల తరబడి నిద్రకు దూరం కావటం, భోజనానికి నియమిత వేళలు పాటించకపోవటం...ఇలాంటి అస్తవ్యస్త జీవనశైలిని అనుసరించినా అధిక రక్తపోటు ఖాయమే!

అధిక ఉప్పు:*ఉప్పు (సోడియం క్లోరైడ్‌)లో ఉండే 'సోడియం' వల్లే ముప్పంతా! కాబట్టి సోడియం ఉండే పదార్థాలను ఎక్కువగా తినటం వల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది.

దురలవాట్లు:* హైపర్‌టెన్షన్‌కు మద్యపానం, ధూమపానం కూడా కారణమే! ధూమపానం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్త సరఫరా ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో గుండె రక్తాన్ని బలంగా పంప్‌ చేయాల్సి వస్తుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి పెరిగి హైపర్‌టెన్షన్‌ మొదలవుతుంది. మద్యపానం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. మద్యపానం వల్ల రక్తపోటు పెరుగుతుందనే విషయం మనలో చాలామందికి తెలియదు. మద్యపానం ప్రస్తుతం ఓ ఫ్యాషన్‌ కావటంతో వారాంతాల్లో మద్యం సేవించటం పరిపాటిగా మారింది. వీకెండ్స్‌లో మద్యం సేవించి సోమవారంనాడు హై బీపీతో వైద్యుల్ని కలిసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.

ఆధునిక జీవనశైలి:* గ్రామీణ జీవనశైలిని గడిపే వాళ్లలో రక్తపోటు సమంగా ఉండటం, పట్ణణీకరణ పెరిగిన తర్వాత బీపీ పెరగటం వైద్యపరమైన పరిశీలనల్లో కనిపించింది. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు గ్రామీణుల్లో కూడా అధిక రక్తపోటు సర్వసాధారణమైపోయింది. ఇందుకు కారణం గ్రామాల్లో పట్టణ వాతావరణం ఉండటమే!

మధుమేహం:* మధుమేహం ఉన్నా ఆ ప్రభావం బ్లడ్‌ ప్రెషర్‌ మీద పడుతుంది. దాంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే రక్తపోటు పెరుగుతుంది.

లక్షణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు!

రక్తపోటు ఉన్న వాళ్లలో చాలామందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు ్ల ఈ విషయం బయటపడితే తప్ప తమంతట తాముగా రక్తపోటు ఉన్న విషయాన్ని ఎక్కువశాతం మంది గ్రహించలేరు. అయితే ఇదే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతే మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

అవేంటంటే...

గుండె దడ,తలనొప్పి,          చమటలు పట్టడం,కళ్లు తిరగటం,ఆయాసం

చికిత్స తేలికే!*

రక్తపోటును మందులతో నియంత్రించవచ్చు. అయితే మందులు సక్రమంగా వాడుతున్నా, రక్తపోటు అదుపులో ఉండకపోవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా నెలకోసారి బీపీ పరీక్షించుకుంటూ ఉండాలి. దాన్నిబట్టి వైద్యులు మందుల పవర్‌ పెంచటం, తగ్గించటం చేస్తారు. కొన్నిసార్లు మందుల ప్రభావం ఎక్కువై బీపీ తగ్గిపోతుంది కూడా! అలాంటప్పుడు రక్తపోటును స్థిరంగా ఉంచే మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.

హైపర్‌టెన్షన్‌ని నిర్లక్ష్యం చేస్తే..*.

35 ఏళ్ల వయసు నుంచి నెలకొకసారి బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. అలాకాకుండా 'లక్షణాలు కనిపించలేదు కదా!' అని రక్తపోటు ఉండీ బీపీ పరీక్షించుకోవటం నిర్లక్ష్యం చేస్తే...అంతర్లీనంగా జరగరాని నష్టం జరిగిపోతుంది. రక్తపోటును సరిచేయకుండా వదిలేస్తే ఒత్తిడి పెరిగి, గుండె పెద్దదవుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే హార్ట్‌ ఫెయిల్‌ అవ్వొచ్చు. ఇదేకాకుండా మూత్రపిండాలు కూడా ఫెయిల్‌ అవ్వొచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ప్రెషర్‌ పెరిగిపోవచ్చు లేదా రక్తనాళాలు చిట్లిపోయి పెరాలటిక్‌ స్ట్రోక్‌ రావొచ్చు.

*హైవర్‌టెన్షన్‌ అదుపులో ఉండాలంటే.*..

రక్తపోటు అదుపులో ఉంచుకోవటం మన చేతుల్లో పనే! ఇందుకోసం అనుసరించవలసిన నియమాలు...మందులు సక్రమంగా వాడాలి. రక్తపోటుకు చికిత్స దీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి వైద్యులు సూచించినంత కాలం క్రమం తప్పకుండా మందులు వాడాలి.ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, సోడా ఉప్పు వేసి చేసిన వడలు, గారెలు, బజ్జీలు, బ్రెడ్‌, బిస్కెట్లు, కేక్‌ల లాంటివి తినకూడదు. అలాగే సాల్టెడ్‌ చిప్స్‌, బిస్కెట్లు కూడా మానేయాలి.వ్యాయామం చేయటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ కనీసం అరగంటపాటైనా నడక లేదా జాగింగ్‌ చేయాలి. రోజూ చేయడానికి సమయం లేకపోయినా వారంలో నాలుగు రోజుల పాటు వీటిని తప్పనిసరిగా చేయాలి.

 *ఉప్పు...పెద్ద తప్పు!*

మనం తినే ప్రతి కూరగాయలో, పళ్లల్లో, ఆకు కూరల్లో సహజసిద్ధంగానే కొంత ఉప్పు ఉంటుంది. వీటితో శరీరానికి సరిపడా సోడియం అందుతుంది. అయినా మనం రుచి కోసం వండేటప్పుడు ఉప్పును జోడిస్తుంటాం. నిజానికి ఉప్పు ఎక్కువ వాడకుండా ఆహారం తినగలిగితే రక్తపోటు రాదు. ఉప్పు వాడే సంప్రదాయం లేని జాతులు కొన్ని ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. వాళ్లలో రక్తపోటు కనిపించకపోవటాన్ని వైద్యులు గమనించారు. దీన్నిబట్టి ఉప్పు నియంత్రిస్తే రక్తపోటు అదుపులో ఉంటుందని రుజువైంది. కాబట్టి ఆహారంలో ఉప్పు వాడకం సాధ్యమైనంత తగ్గించాలి. కొంతమంది భోజనం చేస్తున్నప్పుడు కూరలో ఉప్పు తక్కువైందని కలిపేసుకుంటుంటారు. అలాగే పెరుగన్నం కూడా ఉప్పు లేనిదే తినరు. ఈ అలవాట్లు మానుకోవాలి. ఇంట్లో బిపి పేషెంట్లు ఉన్నప్పుడు వంటల్లో ఉప్పు సాధ్యమైనంత తక్కువ వాడాలి.

 *యోగా, ధ్యానంతో చెక్‌!*

యోగా వల్ల ఒరిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల్లో రక్తపోటు అదుపులో ఉండటం ఒకటి. యోగా వల్ల సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 140 ఒక పది మిల్లీమీటర్లు, డయాస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 90 ఒక ఐదు మిల్లీమీటర్ల దాకా తగ్గుతుంది. రక్తపోటును తగ్గించే వ్యాయామంగా యోగా అంతర్జాతీయంగా ఆమోదం పొందింది. యోగాతోపాటు ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

 *బీపీ తగ్గించే...'డ్యాష్‌' డైట్‌*

'డైటరీ అప్రోచెస్‌ టు స్టాప్‌ హైపర్‌టెన్షన్‌' అనే 'డ్యాష్‌ డైట్‌'ను అమెరికాకు చెందిన డాక్టర్‌ మార్లా హెల్లర్‌ కనిపెట్టింది. రకరకాల ఆహారపదార్థాల ద్వారా శరీరానికి తగినన్ని పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగు పరచటంతోపాటు రక్తపోటును తగ్గించటంలో ఈ 'డ్యాష్‌ డైట్‌' దిట్ట. రక్తపోటు రాకుండా ఉండాలన్నా, నియంత్రణలో ఉండాలన్నా ఈ డైట్‌ను అనుసరించటం మేలని వైద్యులు అంటున్నారు. ఈ డైట్‌ను అనుసరిస్తే రెండు వారాల్లోనే సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ 8 నుంచి 14 పాయింట్లు తగ్గినట్టు ప్రయోగాత్మకంగా రుజువైంది. సోడియంను తగ్గించటంతోపాటు రక్తపోటును నియంత్రణలో ఉంచే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియమ్‌లను పెంచటం డ్యాష్‌ డైట్‌ ప్రత్యేకత. ఈ డైట్‌లో భాగంగా తృణధాన్యాలు, పళ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. చేపలు, చికెన్‌, చిక్కుళ్లతోపాటు వారంలో ఒకటి రెండు రోజులు నట్స్‌, సీడ్స్‌ తినాలి. తక్కువ పరిమాణాల్లో మాంసం, స్వీట్లు, కొవ్వులు కూడా తీసుకోవచ్చు.

 *డ్యాష్‌ డైట్‌లో రోజుకి.*..

తృణధాన్యాల్లో భాగంగా రోజుకి ఒక హోల్‌ వీట్‌ బ్రెడ్‌ స్లయిస్‌ లేదా అర కప్పు బ్రౌన్‌ రైస్‌ లేదా పాస్తా తినొచ్చు.టొమాటో, క్యారెట్‌, బ్రొకోలీ, చిలకడ దుంపలు, ఆకుకూరల్లో పీచు పదార్థాలు బాగా ఉంటాయి. విటమిన్లతోపాటు పొటాషియం, మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని రోజూ తినటం మేలు.పుల్లగా ఉండే నారింజ, బత్తాయిలాంటి నిమ్మజాతి పండ్లు తినాలి.పాలు, పెరుగు, జున్నులలో కాల్షియం, విటమిన్‌-డిలు ఎక్కువ ఉంటాయి.. వీటిని తినటం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది.బాదం, కిడ్నీబీన్స్‌, బఠాణీ, పప్పుల్లోనూ మెగ్నీషియం, పొటాషియంలు ఉంటాయి.

డాక్టర్.కె.శరత్ చంద్ర,

కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్,

ఇండో యుఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.