నగదుతో పనేముంది? ధనం మూలం ఇదం జగత్!
ఉదయం లేచిన దగ్గర్నుంచి ఏది కావాలన్నా డబ్బుతోనే కదా.. పాల ప్యాకెట్లు, కిరాణా సామగ్రి, పెట్రోలు, మందులు, పనివాళ్ల జీతాలు, ఇలా ఏది కావాలన్నా డబ్బు అవసరమే. అయితే, వీటన్నింటికీ నోట్ల రూపంలోనే డబ్బు కావాలా? భారతదేశం నగదు రహిత లావాదేవీల దిశగా త్వరితంగా అడుగులు వేస్తున్న ప్రస్తుత తరుణంలో, నోట్ల వాడుకకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అంటే బోలెడు సులభ ప్రత్యామ్నాయాలే ఉన్నాయని చెప్పుకోవాలి.
అయితే, వాటిని ఇంతకాలం మనం విస్మరించాం..అంతే!
♦డబ్బు తీసుకోవడమేనా?
అత్యధిక శాతం మంది ఖాతాదారులు ఏటీఎం/డెబిట్ కార్డులను కేవలం ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి మాత్రమే వినియోగిస్తారు. వేరే ఖాతాలకు నగదు బదిలీ, క్రెడిట్ కార్డు వినియోగించి నగదు పొందడం, క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీఛార్జిలు, రైల్వే, విమాన టికెట్ల బుకింగ్, టెలిఫోన్/కరెంట్/గ్యాస్/నీటి బిల్లుల చెల్లింపు, ఆదాయపు పన్ను చెల్లింపు, ఆన్లైన్ కొనుగోలు చెల్లింపులు వంటి సేవల్ని నగదు రహితంగా ఏటీఎం డెబిట్ కార్డులు ఉపయోగించి పొందవచ్చు. డెబిట్ కార్డుల వినియోగంలో కొన్ని బ్యాంకులు అందిస్తున్న రివార్డు పాయింట్ల ద్వారా ప్రోత్సాహకాల్ని కూడా పొందవచ్చు.
క్రెడిట్ కార్డులతో..
ఆదాయ ప్రాతిపదికగా ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తాయి. ప్రాథమిక కార్డుకు అనుబంధ కార్డులు తీసుకొని, కుటుంబ సభ్యులు వినియోగించుకోవచ్చు. కొనుగోళ్లకు సంబంధించి గరిష్ఠంగా 50రోజుల వరకూ సున్నా శాతం వడ్డీతో బిల్లు చెల్లింపే వెసులుబాటు ఉంటుంది. వినియోగించిన మొత్తాన్ని నెలసరి వాయిదాలుగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. దాదాపు అన్ని బ్యాంకులూ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.
ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో..
వ్యక్తులు, సంస్థలు తమ లావాదేవీలు సులభతరంగా నిర్వహించుకోవడానికి అన్ని బ్యాంకులూ కల్పిస్తున్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా బ్యాంకు శాఖలకు వెళ్లనవసరం లేకుండా, నగదు రహితంగా 24గంటలూ అనేక రకాల సేవలు పొందవచ్చు. వివిధ బ్యాంకు ఖాతాలకు తక్షణ నగదు బదిలీ, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఖాతాలు తెరవడం, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల రద్దు, విద్యుత్, గ్యాస్, మొబైల్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ వంటి వినియోగ బిల్లుల చెల్లింపు, ఆదాయపు పన్ను చెల్లింపు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు, వివిధ రకాల పన్నుల చెల్లింపు, గిఫ్ట్‌కార్డులు, మ్యూచువల్ ఫండ్ల కొనుగోలు, బీమా ప్రీమియాల చెల్లింపు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, నిర్ధారిత చెల్లింపు ఆదేశాల వంటి సేవలు పొందవచ్చు. ఆయా బ్యాంకుల నిబంధనలను అనుసరించి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్, ట్రాన్సాక్షన్ పాస్‌వర్డ్‌లను ఖాతాదారులే ఎంపిక చేసుకోవచ్చు
.
అరచేతిలోనే...
స్మార్ట్ ఫోన్ లేని బ్యాంకు ఖాతాదారులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా పొందగలిగే బ్యాంకింగ్ సేవలు పొందడం మొబైల్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యమవుతోంది. మీ ఖాతా ఉన్న బ్యాంకుకు సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసుకునేందుకు వీలవుతుంది. కొన్ని బ్యాంకుల యాప్‌లతో మీ రుణ ఖాతా, రుణ చెల్లింపు వివరాలు, గిఫ్ట్ వోచర్ల కొనుగోలు వంటి ప్రత్యేక సేవలు కూడా పొందవచ్చు.
క్షణాల్లో నగదు బదిలీ...
వ్యక్తులు, సంస్థల మధ్య నగదు బదిలీకి ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ ఎంతో సౌకర్యవంతమైన సేవలు. బ్యాంకు అన్ని పనిదినాలలోనూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకూ రోజుకు 12సార్లు గంటకోసారి పరిష్కరించే బాచ్‌ల ద్వారా ఎన్‌ఈఎఫ్‌టీ సేవలు వినియోగించుకొని, నగదు బదిలీ చేయవచ్చు. బ్యాంకు శాఖల ద్వారా అయితే వ్యాపార పనివేళల్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. సాయంత్రం 7గంటల అయితే, మీరు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ఎన్‌ఈఎఫ్‌టీ లేదా ఆర్‌టీజీఎస్ ద్వారా నమోదు చేస్తే.. మరుసటి పని దినాన నగదు బదిలీ జరుగుతుంది. ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా నగదు బదిలీకి కనిష్ఠ, గరిష్ఠ పరిమితి లేదు. ఆర్‌టీజీఎస్ ద్వారా కనీసం రూ.2లక్షల బదిలీ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి లేదు.
*99#సేవలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బ్యాంకులు, టెలికాం సంస్థలు సంయుక్తంగా అందిస్తున్న సేవ *99#. బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నెంబరు నుంచి *99# డయల్ చేసి 7 రకాల ఆర్థిక/ఆర్థికేతర సేవలు పొందవచ్చు. లబ్దిదారునికి మొబైల్ నెంబరు, ఎంఎంఐడి లేదా ఖాతా నెంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ సహాయంతో తక్షణ నగదు బదిలీ చేయవచ్చు. బ్యాంకు సెలవులతో నిమిత్తం లేకుండా అన్ని రోజులపాటు 24గంటలూ ఈ సేవలు పొందవచ్చు. సాధారణ ఫోన్ వినియోగదారులు *99# అని డయల్ చేసి, స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి *99# యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఈ సౌకర్యాలు వినియోగించుకోవచ్చు. ఈ సేవల నిమిత్తం బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవచ్చు. టెలికాం సంస్థలు ఒక్కో సేవకు గరిష్ఠంగా రూ.1.50 వసూలు చేస్తాయి. మొబైల్‌కు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా నగదు రహిత సేవలు పొందడం దీని ప్రత్యేకత.
యూపీఐతో...
ఇటీవల అందుబాటులోకి వచ్చిన యూపీఐ యాప్ ద్వారా, నగదు పొందేవారి బ్యాంకు ఖాతా నెంబరు, ఎంఎంఐడీ (మొబైల్ మనీ ఐడెంటిఫయర్), ఐఎఫ్‌ఎస్‌సీ వంటి వివరాలు అవసరం అక్కర్లేకుండానే.. కేవలం ఖాతాదారుని వర్చువల్ ఐడీ సహాయంతో తక్షణమే వ్యక్తుల నుంచి వ్యక్తులకు, వ్యక్తుల నుంచి సంస్థలు లేదా వ్యాపారులకు నగదు బదిలీ చేయవచ్చు. అలాగే నగదు పొందవవచ్చు. ఒక వ్యక్తికి వేర్వేరు ఖాతాలు ఉన్నా, అన్ని బ్యాంకులకు కలిపి ఒకే యూపీఐ యాప్ ద్వారా లావాదేవీలు చేయవచ్చు.
గిఫ్ట్ కార్డులు🎁
స్నేహితులకు వివాహాది శుభకార్యాలయాల్లో బహుమతిగా ఇచ్చేందుకు ప్రీపెయిడ్ గిఫ్ట్‌కార్డులు చాలా సౌకర్యవంతం. ఒక సంవత్సరం పాటు అమలులో ఉండే విధంగా జారీ చేయబడే ఈ ప్రీ పెయిడ్ గిఫ్ట్ కార్డులను షాపింగ్ మాల్స్‌లోనూ, ఆన్‌లైన్ కొనుగోలుకు వినియోగించవచ్చు. 100 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకూ లభ్యమయ్యే ఈ ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు భారతదేశ వ్యాప్తంగా చెల్లుతాయి. సంస్థలు వారి ఉద్యోగులకు, ఖాతాదారులకు బహుమతిగా ఇచ్చేందుకు కూడా ఈ గిఫ్ట్‌కార్డులు వినియోగించుకోవచ్చు
No comments:
Post a Comment