మొక్కల్లో మెడికల్ షాప్
- మన చుట్టూరానే ఎన్నో ఔషధాలు
- చిన్న స్థాయి అనారోగ్యం నుంచి దీర్ఘకాలిక వ్యాధులకూ ఉపశమనం
- దశాబ్ద కాలంగా పెరుగుతున్న వినియోగం
- వినాయకుడి పూజలో అన్ని ఔషధాలే..!
- రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు నివేదిక
సాధారణంగా ఏదైనా అనారోగ్యం తలెత్తితే.. ఏ అల్లోపతి వైద్యుడి దగ్గరికో వెళ్లి మందు బిళ్లలు వేసుకుంటాం. చికిత్స తీసుకుంటాం. కానీ మన చుట్టూ ఉన్న మొక్కలు, చెట్లలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న అనారోగ్యం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఉపశమనం కలిగించే వేలాది రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. అసలు మన చుట్టూ ఉన్న మొక్కలు, చెట్లలో చాలా వరకు ఏదో ఒకరకమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఇప్పటివరకు దేశంలోని మొత్తం 18 వేల రకాల వృక్షజాతుల్లో ఏడు వేల జాతుల వరకు ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియోపతి తదితర వైద్య విధానాల్లో వాటిని వినియోగిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్
ఔషధ’ సంప్రదాయం;-
మన దేశ సంస్కృతిలోనే సంప్రదాయ వైద్య విధానం ఇమిడి ఉంది. అనాది నుంచి ప్రతి మొక్కలోని లక్షణాలను పరిశీలించి.. వాటిల్లోని ఔషధ గుణాలను గుర్తించారు. వైద్యం కోసం వినియోగించారు. కానీ అనంతరం అల్లోపతి వైద్యం బాగా విస్తరించింది. తిరిగి ఇటీవలి కాలంలో ఔషధ మొక్కల వినియోగంపై పరిశోధనలు, వినియోగం పెరుగుతున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో వినియోగించే మొక్కలు, వాటి ఉత్పత్తుల్లో ఎన్నో ఔషధ లక్షణాలు ఉంటున్నట్లు పరిశోధనల్లో తేలింది.
ముఖ్యంగా వినాయక చవితిలో వినియోగించే మొక్కలు, వాటి ఉత్పత్తులను పరిశీలిస్తే... ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని గుర్తించారు. భారత ఔషధ మొక్కల మండలి ఈ అంశాలను ధ్రువీకరించింది కూడా. వినాయక చవితిలో ఉపయోగించే 21 రకాల మొక్కలు, వాటి ఆకులు, ఉత్పత్తుల్లో ఉన్న ఔషధ లక్షణాలపై తెలంగాణ ఔషధ మొక్కల మండలి అవగాహన కల్పిస్తోంది. తాజాగా వీటిపై ఒక నివేదికను కూడా రూపొందించింది.
జీవనోపాధి కూడా.
ఔషధ మొక్కలు ఆరోగ్యపరంగా తోడ్పడడమే కాదు.. వాటి పెంపకం ఎంతో మందికి జీవనోపాధి కూడా కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఔషధ మొక్కల ఉత్పత్తులు మన దేశంలోనే ఉన్నాయి. దేశంలో 1,178 ఔషధ మొక్కలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిలో దాదాపు 242 రకాల మొక్కల ఉత్పత్తులు ఏటా వందల టన్నుల్లో వినియోగమవుతున్నాయి. ఇక ఏటా 1.95 లక్షల టన్నుల మేర ఔషధ మొక్కల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటి విలువ సుమారు రూ. 5,000 కోట్ల వరకు ఉండడం గమనార్హం.
మన చుట్టూ ఉన్న Ayurveda medicines ఔషధాలివే.;-
- మాచీ పత్రం (మాచిపత్రి):* దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ల సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- బృహతీ పత్రం (వాకుడాకు):* దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులు, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంత ధావనానికి పనికివస్తుంది.
- బిల్వ పత్రం (మారేడు):* జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- దూర్వాయుగ్మం (గరిక):* గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, అర్శమొలల నివారణకు వినియోగిస్తారు.
- దత్తూర పత్రం (ఉమ్మెత్త):* సెగ గడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, రుతు సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితం కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది.
- బదరీ పత్రం (రేగు):* జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు, రోగ నిరోధక శక్తి పెంపుదలకు తోడ్పడుతుంది.
- అపామార్గ పత్రం (ఉత్తరేణి):* దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవిపోటు, రక్తం కారటం, అర్శమొలలు, ఆణెలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాల్లో రాళ్లు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- తులసీ పత్రం (తులసి):* దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్నునొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది.
- చూత పత్రం (మామిడాకు):* రక్త విరేచనాలు, చర్మ వ్యాధులు, ఇంట్లో క్రిమికీటకాల నివారణకు పనికివస్తుంది.
- కరవీర పత్రం (గన్నేరు):* కణతులు, తేలుకాటు, ఇతర విష కీటకాల కాట్లు, దురద, కళ్ల సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధుల వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- విష్ణుకాంత పత్రం (విష్ణుకాంత):* జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది.
- దాడిమీ పత్రం (దానిమ్మ):* విరేచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, అర్శమొలలు, ముక్కు నుంచి రక్తం కారడం, కళ్ల కలక, గొంతునొప్పి, చర్మవ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- దేవదారు పత్రం (దేవదారు):* అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి సంబంధ వ్యాధులు తగ్గించడానికి వినియోగిస్తారు.
- మరువక పత్రం (మరువం):* జీర్ణశక్తి, ఆకలి పెంపొందించేందుకు, జుట్టు రాలడాన్ని, చర్మవ్యాధులను తగ్గించేందుకు పనికి వస్తుంది. దీనిని సువాసన కోసం కూడా ఉపయోగిస్తారు.
- సింధువార పత్రం (వావిలి):* జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, గాయాలు, చెవిపోటు, చర్మ వ్యాధులు, మూర్చ వ్యాధి, ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- జాజి పత్రం (జాజి ఆకు):* వాత నొప్పులు, జీర్ణాశయం వ్యాధులు, పెద్దపేగు వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మవ్యాధులు తగ్గించడానికి తోడ్పడుతుంది.
- గండకీ పత్రం (దేవకాంచనం):* మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు, నులి పురుగుల నివారణకు పనికివస్తుంది. ఈ ఆకులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.
- శమీ పత్రం (జమ్మి):* కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధుల నివారణకు వినియోగిస్తారు.
- అశ్వత్థ పత్రం (రావి ఆకు):* మలబద్ధకం, కామెర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు, నోటిపూత, చర్మవ్యాధుల నివారణకు... జీర్ణశక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది.
- అర్జున పత్రం (తెల్లమద్ది):* చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, జీర్ణాశయ, పెద్దపేగు సమస్యలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.
- అర్క పత్రం (జిల్లేడు):* చర్మ వ్యాధులు, సెగ గడ్డలు, కీళ్ల నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోదకాలు వంటివాటిని తగ్గించడానికి తోడ్పడుతుంది. (తెలంగాణ ఔషధ మొక్కల మండలి వివరాల ప్రకారం..)
మన సంస్కృతిలోనే వైద్యం
‘‘భారతదేశ సంస్కృతిలోనే సంప్రదాయ వైద్యం ఇమిడి ఉంది. మన పరిసరాల్లోనే మనకు ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఔషధాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా వినాయక చవితి పూజల సందర్భంగా ఉపయోగించే మొక్కలు, ఆకులు, ఉత్పత్తులలో.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను నివారించే ఎన్నో ఔషధాలు ఉండడం గమనార్హం.’’
– ఎ.వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర ఔషధ మొక్కల మండలి.