Pages

Sunday, August 13, 2017

ఎ.పి.జె. అబ్దుల్ కలాం.

ఎ.పి.జె. అబ్దుల్ కలాం. 

APJ ABDUL KALAM HISTORY IN TELUGU

APJ ABDUL KALAM BIOGRAPHY IN TELUGU

Dare to dream but care to achieve*_
 ఆయన పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన 1931, అక్టోబర్ 15 న రామేశ్వరంలో జన్మించారు. అప్పటికే వారి కుటుంబం పేదరికంలో ఉంది. వారి పూర్వీకుల నాటి పెంకుటిల్లు తప్ప వారికేమీ లేదు. ఆ రామేశ్వరంలోనే, ఆ చిన్నతనం లోనే బహుశా ఈనాటి కలాంకు బీజాలు పడ్డాయి.*

 ఆయనలోని మత సామరస్యానికి, మానవత్వానికీ చిన్నతనంలో రామేశ్వరం ప్రధాన ఆలయ పూజారి కొడుకుతో స్నేహమే కారణమేమో.*

 అలాగే కలాంను చిన్నతనంలో ఆకర్షించి, ఒక స్పేస్ సైంటిస్ట్ కావడానికి కారణం – రామేశ్వరం సముద్రపు ఒడ్డున నడుస్తూ పైకి చూసిన చిన్ని కలాంకు ఆకాశంలో ఎగురుతూ కనిపించిన పక్షులే. వాటి నుంచి స్ఫూర్తి పొందిన కలాం ఒక ఫైటర్ పైలట్ కావాలనుకున్నారు.*

 అలాగే చిన్న నాటి నుండి తాను మరణించే వరకూ ఆయన స్నేహం చేసింది పుస్తకాలతోనే. రామేశ్వరంలోని గ్రంధాలయానికి వెళ్లి తాను కొనలేని ఎన్నో పుస్తకాలను అక్కడే చదివేవారు ఆయన. అలాగే కుటుంబ పోషణకు, అన్నలకు సహాయం చేయాలని పేపర్ బాయ్ గా కూడా పని చేయడానికి సిగ్గు పడలేదు ఆయన.*

 అలాగే చదువు విషయానికి వస్తే తాను యావరేజ్ స్టూడెంట్ నని ఆయనే తన ఆత్మ కధలో రాసుకున్నారు. అయితే చదువు మీద ఆసక్తితో కష్టపడి చదివేవారు. అలా ఆయన తిరుచ్చిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల లో 1954 లో ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేసారు. దాని తరువాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 1955 లో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేశారు.*

 చదువు తరువాత IAF లో చేరాలన్న తన పైలట్ కల తృటిలో తప్పిపోయింది. ఆయన పరీక్షలో 9వ స్థానంలో నిలిచారు. కానీ అప్పటికి భారత వాయుదళంలో ఎనిమిది స్థానాలే ఖాళీగా ఉండటంతో పైలట్ కావాలన్న ఆయన కల తృటిలో తప్పిపోయింది.*

ఇక అక్కడి నుంచి ఆయన సాగించిన పయనం, గగనతలంలో భారతీయ జెండా ను రెపరెపలాడేలా చేసింది. ఆయన DRDO లో సైంటిస్ట్ గా చేరారు. అక్కడి నుంచి ఆయన ISRO లో చేరారు. అక్కడ ప్రొ. విక్రం సారాభాయ్, సతీష్ ధావన్ ల నుంచి స్ఫూర్తిని పొందారు. అక్కడ ఆయన దేశానికి అనన్యసామాన్యమైన సేవలందించారు.*

 ఆయన పి ఎన్ ఎల్ వి, ఎస్ ఎల్ వి – III, అగ్ని, పృథ్వి, వంటి క్షిపణులను తయారు చేశారు. అలాగే పోక్రాన్ న్యూక్లియర్ పరీక్షలను సైతం విజయవంతం చేశారు. తన సేవలకు గాను ఆయన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరొందారు.*

 అలాగే ఆయన ప్రధానికి చీఫ్ సైంటిస్ట్ అడ్వైజర్ గా కూడా పని చేశారు. ఈ సేవలే ఆయనకి 2002 – 2007 కాలానికి భారత దేశ పదకొండవ రాష్ట్రపతిగా పని చేసేలా చేశాయి. ఈ సమయంలో ఎంతో మంది ఉరి శిక్ష పడ్డ ఖైదీలకు ప్రాణ భిక్ష పెట్టారు. అంత పెద్ద రాష్ట్రపతి భవన్ లో సైతం ఆయన ఒక్క గదిలో, గది నిండా పుస్తాకాలతో మాత్రమే జీవించారు. రాష్ట్రపతి భవన్ లో ఇచ్చే విలాస విందులను తిరస్కరించారు. ఏమైనా వండి పెట్ట గల వంట వాళ్ళతో కేవలం ఇడ్లి సాంబారు మాత్రమే వండించుకున్న ఆయన నిరాడంబరత మనందరికీ ఆదర్శం.*

 తాను మరిణించిన రోజును సెలవు దినంగా ప్రకటించ వద్దని కోరిన మహనీయుడు. ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో కూడా ఎన్నో విద్యాలయాలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు బోధించేవారు. మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్న ప్రశ్న కు – ఆ ఆలోచనే రాలేదు, అన్న ఆయన నుంచి వృత్తి పట్ల అంకిత భావం నేర్చుకోవచ్చు.*

 ఆయన పదవీ కాలం పూర్తయ్యాక అదే పనిగా ఎన్నో విద్యాలయాలకు వెళ్లి ఎంతో మంది విద్యార్థులకి బోధించారు. పిల్లలకు, విద్యార్థులకు బోధించడం ఆయనకెంతో ఇష్టమైన పని.*

 భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న 1997 లో ఆయన్ని వరించింది. అంతకు ముందే పద్మ భూషణ్ ను 1981 లో, పద్మ విభూషణ్ ను 1990 లో అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 40 విశ్వ విద్యాలయాలు ఆయన్ని డాక్టరేట్ తో సత్కరించాయి.*

 ఇంతే కాక ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలను కూడా చేపట్టారు. కార్డియాలజిస్ట్ సోమరాజుతో కలిసి ఆయన సామాన్యులకు అందుబాటు ధరలో ఒక స్టంట్ ను తయారు చేశారు. దానికి రాజు కలాం స్టంట్ అని పేరు వచ్చింది*

 ఆయన మరణించే సమయానికి తన పేరు మీద ఆస్తులేమీ లేవంటే, ఆయన నిరాడంబరతకీ, వ్యక్తిత్వానికీ ఇది పరాకాష్ట.*

 ఆయన ఎన్నో కవితలూ, పుస్తకాలూ రాశారు. Wings of Fire, Ignited Minds, India 2020 వంటి పుస్తకాలతో ఆయన ఆలోచనలనూ, భావాలనూ మనతో పంచుకున్నారు.*

 విశ్వశాంతికి మనిషి సత్ప్రవర్తనే మూలమని కలాం చెప్పిన వ్యాఖ్యలకు యూరోపియన్ పార్లమెంట్‌ కరతాళ ధ్వనులతో మారుమోగింది..! యూరోపియన్ పార్లమెంట్‌లో కలాం చేసిన ఈ ప్రసంగం ప్రపంచలోనే వన్ ఆఫ్‌ ది బెస్ట్ స్పీచ్‌గా పేరుగాంచింది..!*

 సృజనాత్మకత, సత్ప్రవర్తన, ధైర్యం మూడింటి మేళవింపును నిజమైన జ్ఞానంగా కలాం ఉద్బోధించారు..! మార్కుల కొలమానమే జ్ఞానంగా మారిన మన విద్యా వ్యవస్థ మారాలని అబ్దుల్ కలాం బలంగా ఆకాంక్షించారు..! విలువలతో కూడిన విద్యను అందించినవే పరిపూర్ణ విశ్వవిద్యాలయాలని తెలిపారు..!*

 ఏ మనిషీ సాధించని విజయం సాధించాలంటే గతంలో ఎవ్వరూ చేయని యుద్ధం చేయమని యువతకు ఉద్బోధించారు కలాం..!  కలలంటే నిద్రలో వచ్చేవని అందరికీ తెలుసు… కానీ మనిషిని నిద్ర పోనీయకుండా చేసేవే కలలని కలాం కొత్త అర్థం చెప్పారు..! సూర్యుడిలా ప్రకాశించాలంటే సూర్యుడిలా పేదరికం లేని దేశం..! ఆకలి చావులు లేని రాజ్యం..! పట్టణ, పల్లె ప్రాంతాలకు వ్యత్యాసం లేని దేశం..! వ్యవసాయ, పారిశ్రామక, సేవా రంగాలు కలగలిసి ప్రగతి దిశగా సాగే దేశం..! అవినీతి రహిత, పక్షపాత రహిత పాలన గల దేశం..!… మహిళలు, పిల్లల హక్కులకు సంపూర్ణ రక్షణ గల దేశం..! ఇదీ 1998లో అబ్దుల్ కలాం కలలుగన్న భారత దేశం..! మిషన్‌2020 పేరుతో భారతావనికి నిజమైన అభివృద్ధి పథాన్ని చూపించిన దార్శనికుడు అబ్దుల్ కలాం..!*

 మీ లక్ష్యసాధనలో అవరోధాలు ఎదురైనాయా ? గమ్యాన్ని చేరడం కష్టమనిపిస్తుందా ..? నీరసం, నిస్సత్తువ ఆవహించిందా..? ఏం ఫర్వాలేదు… ఒక్కసారి కలాం ప్రసంగం వినండి… రెట్టించిన ఉత్సాహం నిండుకుంటుంది..! లక్ష్యసాధన దిశగా మిమ్మల్ని పరుగులు పెట్టిస్తుంది..!*

ప్రస్తుత సామాజిక రాజకీయ సమాజంలో ఉన్నప్పటికీ, ఎన్ని కీలకమైన పదవులు అలంకరించినప్పటికి తామరాకు మీద నీటి బొట్టు లాగా వాటికి అతీతంగా ఉండడం బహుశా ఆయనకే సాధ్యమేమో.*

 ఇక కలాం జీవితం గురించి చెప్పుకున్నట్టె ఆయన మరణం గురించి కూడా చెప్పుకోవాలి. చివరి శ్వాస వరకు కూడా ఆయన విద్యా బోధనకే అంకితం అయిన మహా మనీషి ఆయన. షిల్లాంగ్ లో IIM విద్యార్ధులకు బోధిస్తూ కుప్పకూలి పోయారు. హాస్పిటల్ కు తీసుకువెళ్ళి చికిత్స చేస్తున్నప్పుడే కన్ను మూశారు. అసలు అటువంటి మరణం చరిత్రలో ఇంత వరకూ ఎవరికీ రాలేదనే చెప్పాలి.*

 వయసు మీద పడుతున్న సరే, విద్యా బోధనే లక్ష్యంగా సాగిపోయిన ఆయనను అపర భీష్ముడు అన్నా అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే 83 ఏళ్ల వయసులో జీవితం తుది శ్వాస వరకూ తనమేధస్సునూ, శక్తి సామర్ధ్యాలనూ ఈ జాతికి అంకితం చేసి, తనకు ఎంత అధికారం వున్నా తనకోసం ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా జీవితాన్ని గడిపిన ఆయన వెళ్ళిపోయిన లోటు ఈ దేశానికి తీరనిది.*

 ఆయన మేధస్సుకు కొలమానం లేదు, ఆయన వ్యక్తిత్వానికి సాటి లేదు. వినయశీలి, నిగర్వి, సమయపాలన, సేవా నిరతి, శ్రమ జీవి, నిరాడంబరత ఇలా ఎన్నో సుగుణాలు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాలి.   ఆయన నుంచి స్ఫూర్తి పొందిన మరో కలాం మళ్ళీ ఎప్పటికి పుడతాడో ....*

No comments:

Post a Comment

.