ఇవి మీకు తెలుసా?
ప్రశ్న: నిర్జీవ తోకచుక్క అంటే ఏమిటి?
జవాబు: తోకచుక్కలు సూర్యకుటుంబంలో ఉండే చిరు సభ్యులు. వాటి వ్యాసం కొన్ని మీటర్లు మాత్రమే ఉంటుంది. తోకచుక్కలు దుమ్ము, తారు, మంచుగడ్డల (నీరు, అమోనియా, మీథేన్, కార్బన్‌డైఆక్సైడ్) సమ్మేళనం. వాటి కేంద్రం మాత్రం రాతిమయం.
తోకచుక్క సూర్యుని దగ్గరకు వచ్చిన ప్రతిసారీ దానిలోని మంచుగడ్డ నేరుగా వాయురూపంలోకి మారి మంచుపొగలా ఏర్పడుతుంది. అలా ఏర్పడిన వాయువు, తోకచుక్కలో అంతకు ముందున్న దుమ్ము కణాలు సూర్యుని నుంచి దూరంగా ప్రవహించడంతో వాటికి ‘తోక’ ఏర్పడుతుంది. గురుగ్రహం కన్నా సూర్యునికి దగ్గరగా వచ్చిన తోకచుక్క చురుకైన జీవితకాలం పదివేల సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత అది నిర్జీవమైనట్లే. ఆ దశలో దానికి తోక లేక పోవడంతో దానిని ‘ఆస్టరాయిడ్’గా అనుకొనే ప్రమాదం ఉంది. ఆ దశలో తోకచుక్కలకు, ఆస్టరాయిడ్లకు మధ్య ఉండే తేడా అంత స్పష్టంగా శాస్త్రజ్ఞులకు తప్ప అందరికీ తెలియదు. దానికి కారణం ఆస్టరాయిడ్లు కూడా తోక చుక్కల్లాగే తమలో ఉండే మంచుగడ్డలను భాష్పీకరణం చెందించడం ద్వారా ఒక రకమైన దుమ్మును వెదజల్లడమే.
తోకచుక్క సూర్యుని దగ్గరకు వచ్చిన ప్రతిసారీ దానిలోని మంచుగడ్డ నేరుగా వాయురూపంలోకి మారి మంచుపొగలా ఏర్పడుతుంది. అలా ఏర్పడిన వాయువు, తోకచుక్కలో అంతకు ముందున్న దుమ్ము కణాలు సూర్యుని నుంచి దూరంగా ప్రవహించడంతో వాటికి ‘తోక’ ఏర్పడుతుంది. గురుగ్రహం కన్నా సూర్యునికి దగ్గరగా వచ్చిన తోకచుక్క చురుకైన జీవితకాలం పదివేల సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత అది నిర్జీవమైనట్లే. ఆ దశలో దానికి తోక లేక పోవడంతో దానిని ‘ఆస్టరాయిడ్’గా అనుకొనే ప్రమాదం ఉంది. ఆ దశలో తోకచుక్కలకు, ఆస్టరాయిడ్లకు మధ్య ఉండే తేడా అంత స్పష్టంగా శాస్త్రజ్ఞులకు తప్ప అందరికీ తెలియదు. దానికి కారణం ఆస్టరాయిడ్లు కూడా తోక చుక్కల్లాగే తమలో ఉండే మంచుగడ్డలను భాష్పీకరణం చెందించడం ద్వారా ఒక రకమైన దుమ్మును వెదజల్లడమే.
ప్రశ్న: వెండి పట్టీలు పెట్టుకొంటే శరీరంలోని వేడి తగ్గుతుందంటారు. నిజమేనా?
జవాబు: వెండి, రాగి, బంగారం వంటి లోహాలకు చాలా ఘన పదార్థాలకన్నా అధిక ఉష్ణ వాహక లక్షణం ఉంది. కానీ ఇలాంటి ఆభరణాలను ధరించడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుందనుకోవడంలో శాస్త్రీయత లేదు. అలా అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. మనం ఎండాకాలం బస్సులో సీటు పట్టుకొన్నప్పటి కన్నా పైన ఉన్న లోహ కడ్డీని పట్టుకొంటే వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే లోహ కడ్డీ కన్నా సీటు తక్కువ ఉష్ణోగ్రతతో ఉందని అర్థం చేసుకోకూడదు. ఆ రెండు భాగాలకు ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది. కేవలం ఉష్ణోగ్రత వ్యత్యాసాలు బాగా ఉంటేనే వేడి అధిక ఉష్ణోగ్రతా ప్రాంతాల నుంచి అల్ప ఉష్ణోగ్రతా ప్రాంతాలకు ప్రవహిస్తుంది. ఎండాకాలం శరీర ఉష్ణోగ్రత కన్నా బయటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితి శరీరానికి మంచిది కాబట్టి ఉష్ణోగ్రత పెరగకుండా ఉండడానికి చెమట పట్టే యంత్రాంగం మన శరీరానికి ఉంది. వెండి పట్టీలు మంచి ఉష్ణవాహకాలు కాబట్టి ఒకవేళ అవి పెట్టుకొంటే అనవసరంగా అధిక ఉష్ణం బయటి నుంచి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. అది నష్టదాయకం.చలికాలంలో శరీర ఉష్ణోగ్రత కన్నా బయటి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. శరీరం చల్లబడకుండా ఉండేందుకే మనం స్వెటర్లు వేసుకుంటాం. ఒక వేళ వెండి పట్టీలు వేసుకొంటే అనవసరంగా శరరీంలోని వేడి బయటి పోయే ప్రమాదం ఉంది. ఇది కూడా లాభదాయకం కాదు. ఎటు చూసినా వెండి పట్టీలకున్న అధిక ఉష్ణవాహక లక్షణం మనకు లాభదాయకం కాకపోగా నష్టాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి బంగారు, వెండి నగలు అలంకారప్రాయానికే గానీ వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు ఏ మాత్రం లేదు. కొద్దో గొప్పో సంబంధం ఉన్నా అదీ అవాంఛనీయ ప్రభావమే.
ప్రశ్న: కొన్నిసార్లు అప్పుడే పుట్టిన బిడ్డను ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. ఎందుకు?
జవాబు: నెలలు నిండక ముందే పుట్టిన శిశువులు కొందరు ఒక కిలోగ్రాము కన్నా తక్కువ బరువుతో ఉండటమే కాకుండా, శారీరకంగా చాలా బలహీనంగా, అనారోగ్యంతో ఉంటారు. అలాంటి వారికి హాని కలగకుండా వైద్యులు ఆరోగ్యకరమైన పరిసరాలను ప్రసాదించే ‘ఇంక్యుబేటర్’లో ఉంచుతారు. ఎయిర్ కండిషన్ గది లాంటి ఈ చిన్న గదిలో పరిసరాల్లో ఉండే వ్యాధికారకాలైన సూక్ష్మక్రిముల నుంచి రక్షణ లభిస్తుంది. అందులో ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గానూ, ఆక్సిజన్ 40శాతం మేర ఉంటుంది. ఈ ఆక్సిజన్ పరిమాణం వెలుపలి వాతావరణంలోని ఆక్సిజన్ కన్నా రెండింతలు ఉంటుంది. ఇంక్యుబేటర్ తనకై తాను వాతావరణాన్ని నియంత్రించుకొనే ఒక ప్రత్యేకమైన ఎయిర్ కండిషన్డ్ వ్యవస్థ కలిగి ఉండే గది. దానిలో అమర్చి ఉండే ఒక చిన్న మోటారు పరిసర వాతావరణం నుంచి ఒక ఫిల్టర్ ద్వారా బ్యాక్టీరియాలేని పరిశుద్ధమైన గాలిని ఆ గదిలోకి తీసుకురావడమే కాకుండా అక్కడి ఉష్ణోగ్రతను గాలిలోని తేమను కూడా నియంత్రిస్తుంది. అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇంక్యుబేటర్‌లోకి నిమిషానికి ఆరు లీటర్ల పరిశుభ్రమైన గాలి నిరంతరం సరఫరా కావడంతో అందులోని పీడనం పరిసరాల్లోని వాతావరణ పీడనం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అందులోని వాయు ప్రవాహం ఎప్పుడూ వెలుపలి వైపుకే ఉంటుంది. దాంతో శిశువు శ్వాస నుంచి వెలువడిన కార్బన్ డై ఆక్సైడ్ ఆ గది నుంచి వెలుపలకు వస్తుంది. నెలలు నిండక ముందే పుట్టిన శిశువును మొదట కొన్ని వారాలు ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. శిశువుకు ఆహారం అందించడం, బరువును తూచడం(బరువును కనుగొనే ప్రత్యేక ఏర్పాటు అందులోనే ఉంటుంది) ఎప్పటికప్పుడు శిశువును పరిశుభ్రంగా ఉంచడం, మైనర్ ఆపరేషన్స్, ఎక్స్-రే ఫొటోగ్రాఫులను తీయడం లాంటివి శిశువును ఇంక్యుబేటర్‌లో నుంచి వెలుపలకు తీయకుండానే డాక్టర్లు, నర్సులు అందుకు అమర్చి ఉండే ప్రత్యేకమైన రంధ్రాల ద్వారా చేస్తారు. ఇంక్యుబేటర్‌లో విద్యుత్ సరఫరా ఆగిపోవడం, నీరు, ఆక్సిజన్ సరఫరాల అంతరాయం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను, ఆక్సిజన్ సరఫరా ఎక్కువయ్యే ప్రమాదాలనూ అందులో ఉండే ప్రత్యేకమైన అమరికలు వెంటనే తెలియజేయడమే కాకుండా సరిచేస్తాయి.
ప్రశ్న: కారు, బస్సు వేగంగా వెళ్తునప్పుడు చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఎందుకు?
జవాబు: ఇలాంటి దృశ్యాలు ప్రత్యక్షంగా కనిపించవు. కేవలం సినిమాలు, టీవీలలో మాత్రమే కనిపిస్తాయి. ట్యూబులైట్ వెలుతురు ఉన్న గదిలో తిరిగే సీలింగ్ ఫ్యాను రెక్కలు కూడా వెనక్కి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఇలాంటి స్థితిని ‘దృష్టిభ్రమ’ (ఆప్టికల్ ఇల్యూషన్) అనే అంశంగా సూత్రీకరించారు. గుండ్రంగా ఉన్న వస్తువు తిరుగుతున్నప్పుడు దాని అక్షం నుంచి అంచుల వైపునకు వెళ్లే సెక్టార్లు వాటిని విభజించే గోడలు అన్నీ ఒకే తీరుగా ఉన్న సందర్భాల్లో ఇలాంటి ‘దృష్టిభ్రమ’ అనుభవంలోకి వస్తుంది. సినిమా లేదా టీవీలో బొమ్మల కదలికలు ఫ్రేముల మార్పిడి ద్వారా సంభవిస్తాయి. ఒక ఫ్రేములో ఉన్న బొమ్మను కన్ను గుర్తించాక ఆ దృశ్యం మన మెదడులో సెకనులో సుమారు 16వ వంతు కాలం వరకు అలాగే ఉంటుంది. ఈలోగా ఆ తదుపరి ఫ్రేములోని బొమ్మలోకి సాధారణ కదలికలో ఉన్న సెక్టారు లేదా సెక్టారు గోడ వచ్చినా, అది మెదడులో ఇంకా చెరిగిపోని గత ఫ్రేములోని దృశ్యానికి ముందు వైపున ఉన్నట్లయితే చక్రం ముందుకే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. కానీ అదే రెండో ఫ్రేములోని దృశ్యం, మెదడులో ఇంకా చెరిగిపోని దృశ్యానికి వెనుక వైపున ఉన్నట్లయితే మన మెదడు రెండో బొమ్మను మొదటి బొమ్మను సరిపోల్చుకుని చక్రం వెనక్కి తిరుగుతున్నట్లు భ్రమ పడుతుంది.
పిట్టచూపు తగిలితే చిన్నపిల్లలు సన్నగా అయిపోతారంటారు నిజమేనా?
జవాబు: ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అని విన్నాంగానీ ‘పిట్ట చూపు పిల్లలకు చిన్నరూపు’ అని ఎక్కడా వినలేదు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య వింత వింత వార్తలు, నిరాధార ప్రకటనలు కనిపిస్తున్నాయి. మనం శాస్త్రీయ దృక్పథంతో ఉండాలని భారత రాజ్యాంగంలోనే ఉంది. పిట్టచూపు పిల్లలపై పడితే ఆ చూపునకు, పిల్లల రూపు రేఖలకు, పెరుగుదలకు ఏ విధమైన అవినాభావ సంబంధమూ లేదు. పిట్టచూపు పెద్దలు, చెట్లు, పురుగుల మీద కూడా ఉంటుంది కదా. మరి తగ్గుదల చిన్న పిల్లలకు మాత్రమే ఎందుకుంటుంది. పిట్టచూపు తగులుతుందనుకోవడం కేవలం అశాస్త్రీయమైన మూఢనమ్మకం.
ప్రశ్న: గుడ్లగూబలు రాత్రివేళల్లోనే ఎందుకు తిరుగుతాయి?
జవాబు: పక్షులు మామూలుగా రాత్రి వేళకన్నా పగటి పూటే బాగా చూడగలుగుతాయి. కానీ పక్షి జాతికి సంబంధించిన గుడ్లగూబ చూసే శక్తి మిగతా పక్షుల కన్నా చాలా తక్కువ. గుడ్లగూబల కంటి నిర్మాణం మిగతా పక్షులలాగా ఉండకపోవడంతో అవి పగటివేళ సూర్యరశ్మిలో సరిగా చూడలేవు. రాత్రివేళల్లో అంత స్పష్టంగా కాకపోయినా చాలామటుకు చూడగలవు. అందువల్ల అవి పగటి వేళ బయటకు రాకుండా చెట్లపైనే కునికిపాట్లు పడుతూ ఉంటాయి. రాత్రివేళల్లో కూడా చూసే శక్తి తక్కువ కాబట్టి అవి ఆహారం కోసం రాత్రిళ్లు మిగతా ప్రాణులను వేటాడేటపుడు కంటి చూపు వల్ల శక్తితో పాటు చెవుల ద్వారా వినే శక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. వాటి వినేశక్తి ఎంత తీక్షణంగా ఉంటుందంటే మన చెవులు వినలేని వేర్వేరు పౌనఃపున్యాలు ఉండే శబ్దాలను అవి ప్రస్ఫుటంగా వినగలవు. తాము వేటాడే ప్రాణులకు ఏమాత్రం తెలియకుండానే వాటి చిన్న చిన్న కదలికల వల్ల ఉత్పన్నమయే శబ్దాలను కూడా గుడ్లగూబలు గ్రహించి వాటిని తటాలున పట్టుకుంటాయి. పంటలకు నష్టం కల్గించే పురుగులు, మిడతలు, ఎలుకలు రాత్రివేళల్లో పొలాల్లో విశ్రాంతి తీసుకుంటుంటాయి. రాత్రిపూట సంచరించే గుడ్లగూబలు వాటిని వేటాడుతూ రైతులకు ఎంతో మేలు చేస్తాయి. రాత్రి వేళల్లో సంచరించే గుడ్లగూబల కళ్లు తీక్షణంగా మెరుస్తూ ఎదుటి వారికి భయం కలిగించడమే కాకుండా వాటి అరుపులు కూడా కర్ణకఠోరంగా ఉంటాయి.
కప్పలు ఎందుకు అరుస్తాయి?
కప్ప శరీరానికి పాముచే కరవబడి దెబ్బతిన్నప్పుడు అరిచే శబ్దము మూలుగుతూ ఉన్నట్లు ఉంది ... ఆ అరుపు ఆడ మగ రెండూ చేస్తాయి. వానజల్లు రావడముతో ఒక్క మగకప్పలే అరుస్తాయి. గొంతుభాగములో మగకప్పలకుండే గాలితిత్తులలోకి గాలిని తీసుకొని ఒత్తిడితో బయటకు పంపడము వల్ల ఆ అరుపులు వస్తాయి. ఈ అరుపులు ఆడ కప్పలను ఆకట్తుకునేందుకు చేసే శబ్దాలు . అందుకే ఒక్కొక కప్పజాతి అరుపు ఒక్కోలా ఉంటుంది . ఆడకప్ప ఆకర్షింపబడి దగ్గరకు వచ్చేసరికి ఆ అరుపు తీరు మారుతుంది.ప్రశ్న: శీతకాలంలో నోటి ద్వారా గాలి వదిలితే తెల్లగా, పొగలాగా వస్తుంది. ఎందుకు?
జవాబు: శీతకాలంలో మనం శ్వాస క్రియలో భాగంగా ముక్కు ద్వారా గాలి వదిలినా, మాట్లాడుతున్నప్పుడు గాలి బయటికి వస్తున్నా అది పొగ రూపంలో రాదు. పొగలాగా, ఆవిరిగా అది మారడానికి కారణం బయట ఉన్న గాలి మాత్రమే. మనం వదిలిన గాలి మన శరీర ఉష్ణోగ్రత (సుమారు 37 డిగ్రీలు సెంటిగ్రేడ్) వద్ద ఉంటుంది. కానీ శీతకాలంలో బయటి గాలి ఉష్ణోగ్రత సుమారుగా 10 డిగ్రీలు నుంచి 15 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. మనం మాట్లాడు తున్నప్పుడు ముక్కు ద్వారా నిశ్వాస క్రియలో బయట పడే గాలి మాత్రం శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉంటుంది. ఒక్కసారిగా అది బయటికి వచ్చి, బయట ఉన్న చల్లని గాలితో సంపర్కం చెందినపుడు ఉష్ణోగ్రతను కోల్పోతుంది. అలా మనం వదిలిన గాలిలో ఉన్న నీటి ఆవిరి చిన్నపాటి నీటి బిందువులు (తుంపరలు)గా మారుతుంది. ఈ బిందువులకు కొల్లాయిడల్ లక్షణాలు ఉంటాయి. అంటే అవి కాంతిని పరిక్షేపణం (స్కాటరింగ్) చేస్తాయి. ఈ దృగ్విషయాన్ని ‘టిండాల్’ ఫలితం అంటారు. అలా కాంతి పరిక్షేపణం చెందడం వల్ల నీటి ఆవిరి పొగలాగా కనిపిస్తుంది.ప్రశ్న: మొక్కలకు కదలిక ఉంటుందా?
జవాబు: మొక్కలకు కదలిక ఉంటుంది. అలాగని అవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్లవు. మొక్కలు పెరిగే కొలదీ వాటి కాడలు, చిరు కొమ్మలు, సూర్యరశ్మి తగిలే వైపు వూగుతూ, గుండ్రంగా తిరుగుతూ, గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తూ, పైవైపుకు కదులుతూ పెరుగుతాయి. రాత్రి వేళల్లో మొక్కలకుండే ఆకులు, పూలు ముడుచుకునే కదలికలను శాస్త్రజ్ఞులు మొక్కలు నిద్రపోతున్నాయని అభివర్ణిస్తారు.
రాత్రివేళల్లో వాటి ఆకుల దొప్పలు కాండం వైపు ముడుచుకునేటట్లు కదులుతాయి. ఇలా ముడుచుకోవడానికి అవసరమయ్యే కదలికలను సులువుగా కల్పించడానికి ఆ మొక్కల ప్రతి ఆకు కింది భాగం కాండాన్ని కలుపుతూ ఒక చిన్న ‘జాయింట్’ కణుపు రూపంలో ఉంటుంది. ఈ జాయింట్ ద్వారా కాండంలో ఉండే ద్రవ సంబంధిత పీడనం ఆకును కదిలిస్తుంది. ఇలా ఆకులు ముడుచుకోవడం వల్ల రాత్రి వేళల్లో వాటికి చలి నుంచి రక్షణ లభిస్తుంది. ప్రఖ్యాత భారతీయ శాస్త్రజ్ఞుడు సర్ జగదీశ్‌చంద్రబోస్ శాస్త్రీయ పరికరాల సాయంతో మొక్కలలోని కదలికలను పరిమాణాత్మక విశ్లేషణ (Quantitative analysis) రూపంలో విశ్లేషించి, మొక్కలకు ప్రాణం ఉందని నిర్ధరించారు.
ప్రశ్న: బోరు బావుల నుంచి బయటికి వచ్చే నీరు శీతకాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటాయి. ఎందువల్ల?
జవాబు: పగలు సూర్య కాంతి ఎక్కువగా ఉండటం వల్ల భూమి పైపొర వేడెక్కుతుంది. రాత్రిపూట సూర్యకాంతి లేకపోవడం వల్ల భూమి చల్లబడుతుంది. కానీ పై పొరలో ఉన్న పగటి వేడి బోరు బావిలోని నీరున్న కింది పొరలోకి వెళ్లడానికి సమయం పడుతుంది. అందువల్ల పగలు ఇంట్లో ఉన్న బిందెలోని నీరు ఎండ వల్ల వెచ్చగా ఉన్నా బోరు బావిలోని నీరు అదే వెచ్చదనంతో ఉండదు. కానీ రాత్రి పూట మీరు ఎండాకాలంలో బోరు నీళ్లు కొట్టినట్లయితే అవి కాస్త వెచ్చగానే ఉంటాయి. అంటే ఆ పాటికి మాత్రమే పగటి వేడి లోపలి నీటికి చేరిందన్న మాట. అలాగే చలికాలంలో బయట పగలు చల్లగానే ఉన్నా కిందటి రోజు పగటి కాంతి వల్ల ఆలస్యంగా ఎంతో కొంత వేడెక్కిన నీరు బోరు బావిలో నుంచి బయటికొస్తుంది. బోరు నీళ్లు ఇలా పగలు వేసవికాలంలో చల్లగా, చలికాలంలో కాస్త వెచ్చగా అనిపించడానికి కారణం భూమి పొరలలో ఉష్ణ ప్రవాహం ఆలస్యం కావడమే!
ప్రశ్న: భూమిపై నీరు అంతరిక్షంలోని తోకచుక్కల నుంచి వచ్చిందా?
జవాబు: శాస్త్రజ్ఞులు చాలామంది విశ్వంలో తోకచుక్కల దాడి సౌరవ్యవస్థ ఏర్పడిన తొలిరోజుల నుంచే ఆరంభమైందని భావిస్తున్నారు. తోకచుక్కలు ఢీకొనడం వల్ల చెడు, మంచి రెండు ప్రభావాలూ ఉన్నాయని వారి వాదన. తోకచుక్కలు భూమిని ఢీకొనడం ద్వారా భూమిపైకి ప్రాణాధారమైన నీటితో పాటు, సంక్లిష్టమైన కార్బన్ పరమాణువులను భూమికి తీసుకు వచ్చాయి. అంతరిక్షం నుంచి ఇది భూమికి రావడం వల్లే భూమిపై అంత త్వరగా ‘జీవం’ అంటూ ఏర్పడింది.
మరికొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం ‘జీవం’ తోకచుక్కల్లోనే ఏర్పడిందని. వారి వాదన ప్రకారం జీవానికి అవసరమైన ఉష్ణశక్తి తోకచుక్కల్లో ఉండే రేడియోధార్మిక విచ్ఛిన్నం వల్ల ఉత్పన్నమైందనీ ఆ ఉష్ణం తోకచుక్కల్లో ఉండే మంచుగడ్డలను నీరుగా మార్చిందని ఈ వాదనలలోని నిజానిజాలను నిర్ధరించడానికి తోకచుక్కలలోని పదార్థాలను విశ్లేషించవలసి ఉంటుంది. అందుకోసమై ‘యూరోపియన్ స్పేస్ ప్రోబ్ రొసెట్టా’ను శాస్త్రజ్ఞులు 2014లో ప్రయోగించారు. దీనిలో ఉండే డ్రిల్(బరమా) తోకచుక్కల ఉపరితలంపై సన్నని రంధ్రం ఏర్పరచి వాటి అంతర్భాగాల్లోని పదార్థాపు నమూనాలను సేకరించి వాటిని ప్రోబ్‌కు అనుసంధానింపబడి ఉండే ప్రయోగ శాలకు అందిస్తుంది. అక్కడ ఆ పదార్థాల విశ్లేషణ జరుగుతుంది.
No comments:
Post a Comment