Pages

Thursday, May 12, 2016

Telugu Poetry for Students



……   నేల మీది నక్షత్రాలు.!
వీళ్ళు...
కార్పోరేట్ బందెల దొడ్డుల్లోని గొర్రెలు కాదు...
.సి. పంజరాలలో బందీలైన చిలకలూ కాదు...
మమ్మీల అంతులేని అత్యాశల్ని, 
డాడీల నిరర్ధక స్వప్నాల్ని నిజం చేసేందుకు...
డబ్బు గబ్బు కొట్టే కాన్వెంటు కొట్టాల్లో
నిద్దర లేకుండా తిరుగాడుతున్న
బొద్దింకలూ  కాదు...
లోకజ్ఞాన సౌరభం శూన్యం అయినా,
..టి. కాంక్రీట్ ఫౌండేషన్లో
ఏపుగా ఎదుగుతున్న
భవిష్యత్ డాలర్ పిచ్చిమొక్కలు కాదు...
పిజ్జాలతో బొజ్జల్ని,
బర్గర్లతో బుగ్గల్ని నింపేసి,
పుస్తకాల్ని పిప్పి చేసేసి, నమిలేసి...
రేంకుల రేసుల్లో దౌడు తీస్తున్న..
నవనాగరిక నగర విద్యాశ్వాలు 
అంతకన్నా కాదు...
***
వీళ్ళు....
అర్ధాకలితో పస్తులుంటున్నా...
చల్లని చదువులతోనే
కడుపులు నింపుకొనే వాళ్ళు...
అక్షరాన్ని తాకిన తొలితరం అయినా...
ఆరాధనగా మనసుకు హత్తుకోనేవాళ్ళు...
పరభాషలో బానిస బాణీలు పాడకున్నా..
అమ్మ భాషలో వినయంగా ప్రార్ధిస్తూ...
సరస్వతిని ఆవాహన చేసుకున్నవాళ్ళు...
***
వీళ్ళు...
అరకొర సౌకర్యాలు...
అంతంత మాత్రం ప్రోత్సాహకాలు..
నిరంతరం
నిరుత్సాహానికి గురి చేస్తున్నా...
వెన్ను తట్టి ప్రోత్సహించే,
వెన్నంటి ఉండి చదివించే...
గురువుల ఋణం తీర్చుకొనేందుకు
పట్టుదలతో కృషి చేసే
సాందీపని శిష్యులు...
విజయాల సాధనకోసం
బాధల భేతాళుల్ని
అలవోకగా భుజాలపై మోసే
విక్రమార్కులు,
అక్షరధనానికి నోచుకోని వంశాలను
జ్ఞానగంగతో పునీతం చేస్తున్న
భగీరధులు...
***
వీళ్ళు...
మీడియాల కవరేజులకు,
ప్రకటనల ప్రలోభాలకు,
చెవులు  చిల్లులుపడే
శబ్దకాలుష్యాలకు దూరంగా,,,
పదికి పది సాధించినా
పదిలంగా, వినయంగా, మౌనంగా...
చిరునవ్వులు చిందించే
ఋషి తుల్యులు...
ఉచిత విద్యతో ఉన్నతంగా ఎదిగిన
()సామాన్య సరస్వతులు...
సర్కారు బడుల ఆశాజ్యోతులు...
***
వీళ్ళు...
నిర్లక్ష్యం చిదిమేయకుండా ఉంటే...
ప్రోత్సాహం అడుగంటకుండా ఉంటే...
భవిష్యత్ భారతాన్ని వెలిగించే
బంగారు దివ్వెలు...
నేలమీది నక్షత్రాలు...!
.....

(ప్రతికూల పరిస్థితులలోను, పదవతరగతిలో అసామాన్య ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ విద్యార్ధులకు అభినందనలతో, వారివెన్నంటి ప్రోత్సహిస్తూ వారి విజయ సాధనలోనే తమ ఆనందాన్ని చూసుకొనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు హృదయపూర్వక  నమస్కారాలతో .....)

No comments:

Post a Comment

.