Pages

Friday, June 10, 2016

cyber crime

రివార్డుల వలలో పడొద్దు;;-
చేతిలో డబ్బు లేకున్నా.. ఏదైనా కొనే వెసులుబాటు కల్పిస్తుంది.. క్రెడిట్‌ కార్డు. పరిమితితో వాడితే దీనితో ప్రయోజనాలు ఎన్నో.. అందులో రివార్డు పాయింట్లూ ఒకటి. అయితే, వీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కార్డులు వాడితే మాత్రం అప్పుల వలలో చిక్కడం ఖాయం.

భారతీయులు స్వతహాగా పొదుపరులు.. వారు ఆర్జించే మొత్తంలో సగటున 30శాతం వరకూ పొదుపు చేస్తారు. అమెరికాలో ఇది దాదాపు 17శాతమే ఉంది. ఒకప్పుడు నగదు ఆధారిత ఖర్చులే ఉండేవి. మారుతున్న కాలంతోపాటు.. ఖర్చు పెట్టే తీరూ మారింది. ఇప్పుడు చాలామంది తమ చేతిలో డబ్బు లేకున్నా సులభంగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఆదాయానికీ ఖర్చులకూ పొంతన లేకుండా పోతోంది. చివరకు ఆర్థికంగా చిక్కుల్లో చిక్కుకునే స్థాయికి చేరుకుంటున్నారు. కొంతమేరకు ఇందుకు క్రెడిట్‌ కార్డులూ కారణమే అయినప్పటికీ.. వాటిని సరిగా వాడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే గరిష్ఠంగా 48శాతం వరకూ వడ్డీని చెల్లించాల్సి రావచ్చు. సేవా రుసుములు, పన్నులు కలిపితే ఇవి కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఏదో ఒక రోజు అప్పును ముగించకపోతే.. అది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. కేవలం క్రెడిట్‌ కార్డు ఇచ్చే రివార్డు పాయింట్ల కోసమే కొంతమంది కార్డును పూర్తి స్థాయిలో వాడేస్తుంటారు. తీరా చివరి తేదీనాడు పూర్తి బిల్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతుంటారు.
అవగాహన ఉంటే..
ప్రతి విషయంలోనూ మంచీ చెడులు ఉంటాయి. క్రెడిట్‌ కార్డు వాడకంలోనూ ఇది వర్తిస్తుంది. ప్రతి ఖర్చునూ పర్యవేక్షించుకుంటూ.. ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లించే వారికి క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్లు మంచి ప్రయోజనమే కల్పిస్తాయి. అయితే, వాస్తవంగా ఆలోచిస్తే.. కేవలం రివార్డు పాయింట్ల కోసమే ఖర్చు చేయడం అంత మంచిది కాదు. సరైన ఆర్థిక ప్రణాళిక అంటే.. మన దగ్గర ఉన్న మొత్తాన్ని పొదుపు చేస్తూ.. ఖర్చు చేయడమే. కానీ, వూహాజనిత ఆదాయాన్ని గణిస్తూ ఖర్చు చేయడం కాదు.

కొత్తగా కార్డు తీసుకున్న వారికి రివార్డు పాయింట్లు వూరిస్తుంటాయి. ఖర్చు పెట్టేలా ప్రోత్సహిస్తుంటాయి. అధికంగా ఖర్చు చేయండి.. అధిక పాయింట్లు పొందండి అనే ధోరణి వీటిది. ఉచిత విమాన ప్రయాణం, ఉచిత హోటల్‌ సదుపాయం, వోచర్లు, సినిమా టిక్కెట్లు, ఇంధనం ఇలా ఎన్నో సదుపాయాలను ఈ రివార్డు పాయింట్ల ద్వారా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ మంచివేగా? అనే సందేహం రావచ్చు. నిపుణులైన కార్డు వినియోగదారులు మాత్రమే ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు. కార్డు నియమ నిబంధనలను అర్థం చేసుకోని వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.

పాయింట్ల కోసమే కొనుగోలు: నిజంగా ఇలా చేస్తారా ఎవరైనా? అని వినడానికే ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, కొంతమంది కేవలం రివార్డు పాయింట్ల కోసమే తమ కొనుగోళ్లన్నీ క్రెడిట్‌ కార్డుల ద్వారానే నిర్వహిస్తుంటారు. ఇలాంటప్పుడు సరిగ్గా చెల్లింపులు చేయకపోతే.. ప్రతి నెలా కనీస చెల్లింపులతోనే కాలం వెళ్లదీస్తుంటే ఆర్థిక పరిస్థితి గాడి తప్పినట్లే.

పరిమితి దాటితేనే: చాలా వరకు క్రెడిట్‌ కార్డులు ముందుగా మీరు కొంత పరిమితిని మించి ఖర్చు చేసిన తర్వాతే.. పాయింట్లు రావడం ఆరంభం అవుతాయి. నిజానికి ఇవి అధికంగా ఖర్చు చేసే ఖాతాదారులకు లాభం. కానీ, తక్కువ మొత్తాల్లో ఖర్చు చేసే వారు ఈ పరిమితి దాటడం కోసమే ఖర్చు చేయడం శ్రేయస్కరం కాదు.

వ్యవధి లోపే: రివార్డు పాయింట్లు రావడమే ముఖ్యం కాదు. వాటిని కార్డు సంస్థ నిర్ణయించిన వ్యవధి లోపు వాడుకోవడం కూడా ముఖ్యమే. లేకపోతే పాత పాయింట్లు మురిగిపోతూ ఉంటాయి. కార్డు తీసుకునేప్పుడు ఈ నిబంధనలు తెలుసుకోకుంటే వచ్చే ఇబ్బందే ఇది. కార్డు తీసుకున్న కొత్తలో కాస్త అధికంగా రివార్డు పాయింట్లు ఇచ్చినా.. తర్వాత ఇవి తగ్గిపోతాయి.

అనవసరం అయినప్పటికీ: కార్డును మీకు అంటగట్టేందుకు కార్డు ప్రతినిధులు రకరకాల వాగ్దానాలు చేసేస్తుంటారు. అందులో కొన్ని మీకు అక్కరకే రావు. ఉదాహరణకు మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయరు అనుకుందాం. ఇలాంటప్పుడు విమాన టిక్కెట్లు కొంటే అధిక పాయింట్లు వస్తాయని చెప్పి మీరు కార్డు తీసుకోవడం వల్ల లాభమేమిటి? కాబట్టి, ఇలాంటి వాటికి కార్డు ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వకూడదు.

పాయింట్ల వినియోగం: ఒక పాయింటు అంటే ఒక రూపాయితో సమానం అని భావిస్తారు చాలామంది. ఇది అన్నిసార్లూ నిజం కాకపోవచ్చు. కొన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు, లేదా పాయింట్లను వెనక్కి ఇచ్చేప్పుడు ఇది ఒక పాయింటు 10పైసలతోనూ సమానం కావచ్చు.

మొత్తం వినియోగించుకోకుండా: కొన్ని కార్డు సంస్థలు మీ దగ్గర ఉన్న మొత్తం రివార్డు పాయింట్లను ఒకేసారి వినియోగించుకోకుండా ఆంక్షలు విధిస్తాయి. ఇన్ని పాయింట్లను మాత్రమే వాడి కొనుగోలు చేయాలని సూచిస్తుంటాయి. ఒక నిర్ణీత వ్యవధిలో కొన్ని పాయింట్లను వాడటానికి మాత్రమే అనుమతిస్తుంటాయి. ఇలాంటి నిబంధనల గురించి ముందే తెలుసుకొని ఉండటం వల్ల తర్వాత ఇబ్బందులు ఎదురవ్వవు.


యాప్‌ల మాటున నేర సామ్రాజ్యం;;-
సమాచారం తస్కరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో పని చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు నగరంలోని ఓ ప్రముఖ బ్యాంక్‌లో ఎన్‌.ఆర్‌.ఐ. ఖాతా తెరిచి కూడబెట్టుకున్న డబ్బంతా అందులో జమ చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా రూ.85 లక్షలు అయిన తర్వాత ఒకరోజు తన బంధువులకు కొంత డబ్బు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసేందుకు యత్నించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పాస్‌వర్డ్‌ తప్పనే రావడంతో ఫోన్లో బ్యాంక్‌ సిబ్బందిని సంప్రదించాడు. అప్పుడు వారు చెప్పిన మాట విని గుండె ఆగినంత పనయింది. కూడబెట్టిన మొత్తం మరో బ్యాంకుకు బదిలీ అయినట్లు తేలింది. దీనిపై హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో సదరు బాధితుడి ఫోన్‌లో ఉన్న యాప్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు సమాచారం తస్కరించి ఈ నేరానికి పాల్పడ్డట్లు తేలింది.

ఎలా జరిగింది..?: యాప్‌ ద్వారా సైబర్‌ నేరగాడు సదరు బాధితుడి బ్యాంకు యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌, ఈ-మెయిల్‌ఐడీ, పాస్‌వర్డ్‌ తెలుసుకున్నాడు. దాని ద్వారా బ్యాంకు వెబ్‌సైట్లోకి ప్రవేశించి ఫోన్‌నెంబరు మార్చి..సదరు ఖాతా ద్వారా జరిగే లావాదేవీల సమాచారం తన ఫోన్‌కు వచ్చేలా చేశాడు. ఆన్‌లైన్‌ ద్వారా ఒక వ్యక్తిని పరిచయం చేసుకుని, వివరాలు తస్కరించిన ఖాతాలో డబ్బును కొత్తవ్యక్తి ఖాతాలోకి మళ్లించాడు. తన ఖాతాకు కొన్ని సమస్యలు ఉన్నాయని, డబ్బు బదిలీ చేసుకున్నందుకు కొంత వాటా ఇస్తానని చెప్పాడు. తనకెలాంటి నష్టం లేదు కాబట్టి ఆ వ్యక్తి అందుకు ఒప్పుకున్నాడు. రెండుమూడు దఫాలుగా హైదరాబాద్‌ బ్యాంకు నుంచి చెన్నై బ్యాంకుకు డబ్బు బదిలీ అయిన తర్వాత చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నాడు. అప్పటికే ఫోన్‌ నెంబరు, ఈ-మెయిల్‌ చిరునామా మార్చాడు కాబట్టి అసలు ఖాతాదారుడికి ఈ వివరాలు ఏవీ తెలియలేదు. ఇదొక ఉదాహరణ మాత్రమే.

ఎందుకు జరిగింది?

ఇప్పుడంతా యాప్‌ల యుగం నడుస్తోంది. ప్రతి పనికీ ఒక యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఇదే సైబర్‌ నేరగాళ్లపాలిట వరమైంది. యాప్‌లో ట్రోజన్‌హార్స్‌ లాంటి సాప్ట్‌వేర్‌ జొప్పించి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఇలాంటి యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోగానే ఫోన్లో సమాచారం ప్రపంచంలో ఎక్కడ ఉండయినా తస్కరించడానికి వీలుంటుంది. సినిమా టిక్కెట్లు, రైలు టిక్కెట్లు మొదలు చివరకు బ్యాంకు లావాదేవీలు ఫోన్‌ ద్వారానే చేస్తున్నారు. కొంతమంది ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటున్నారు. ఇటువంటి విలువైన సమాచారాన్ని తస్కరించేందుకే నేర ముఠాలు ఆకర్షణీయమైన యాప్‌లు రూపొందించి మార్కెట్‌లోకి వదులుతున్నాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోగానే సదరు ఫోన్‌ ఆయా ముఠాల చేతుల్లోకి వెళ్లినట్లే. ఇక్కడ గమనించాల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి..

గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారానో, యాప్‌ల్యాబ్‌ ద్వారానో యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటామని, ఈ రెండూ ప్రముఖ సంస్థలకు చెందినవే కాబట్టి నష్టం ఉండకపోవచ్చని చాలా మంది నమ్ముతుంటారు.

ప్లేస్టోర్‌, యాప్‌ల్యాబ్‌ వంటివి నమ్మకమైన సంస్థలే. ఇవి తమకు అందిన యాప్‌ల పనితీరును గమనిస్తాయి తప్ప సమాచారం చౌర్యం చేసేలా వాటి వెనుక దాగి ఉన్న ‘బగ్స్‌’ గురించి పట్టించుకోవు.

ఈ యాప్‌లు ఎలా రూపొందిస్తున్నారంటే డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత వీటిని వాడకపోయినా ఫోన్లో జరుగుతున్న లావాదేవీలు అన్నింటినీ గమనించేలా తయారు చేస్తున్నారు.

దాంతో ఫోన్‌ ద్వారా బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తున్నప్పుడు వివరాలన్నీ యాప్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లకు చేరుతుంది.

యాప్‌ల సర్వర్లు నేరగాళ్ల నియంత్రణలో ఉంటాయి. కాబట్టి వాటిని తమ అవసరాలకు తగ్గట్టుగా నేరగాళ్లు మార్చుకోగలుగుతున్నారు.

జాగ్రత్తలు తప్పవు: సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే యాప్‌ల వల్ల ముప్పు తప్పదు. అన్ని యాప్‌లు తప్పని కాదు. అవసరమైన, బాగా తెలిసిన సంస్థలకు చెందిన యాప్‌లను మాత్రమే వాడాలి. అన్నింటికీ మించి బ్యాంకు వివరాలేవీ ఫోన్‌లో నిక్షిప్తం చేసుకోకూడదు. ఖాతాకు జత చేసిన ఫోన్‌ నెంబర్‌, ఈమెయిల్‌కు బ్యాంకు నుంచి నిరంతరం సందేశాలు వస్తున్నాయో, లేదో చూసుకుంటుండాలి.

-రామ్మోహన్‌, ఎస్పీ, (సైబర్‌ పోలీస్‌స్టేషన్‌)

No comments:

Post a Comment

.