Pages

Sunday, June 19, 2016

human ethics



మానవుడు_మనిషి...
సూర్యోదయం వేళ మనకు తెలుసు. వేపపూత కాలం మనమెరుగుదుము. ప్రతి ఏటా మామిడి కాయలు కాసే సమయం మనకు కరతలామలకం. ప్రకృతిలో ప్రతీదీ నియమానుసారం నడుస్తోంది. కాని, మనిషి ఒక్కడే ఎందుకో అడుగడుగునా తడబడుతుంటాడు!
మనం ప్రపంచాన్ని నమ్మాలి. అంటే, తోటి మనుషుల్ని నమ్మగలగాలి. మనకు వచ్చే సంపదలు ఎవరో తెచ్చివ్వాలని ఆశించకూడదు. మన ఆనందాన్ని మరెవరో కొనితేవాలని అనుకోకూడదు. మన మనసు ద్వారాలు ఎల్లవేళలా తెరిచి ఉంచితే ఆ ఆనందం, ఆ సంపద రావాల్సిన వేళకు అవే వస్తాయి! మనకోసం విధి రాసిపెట్టి ఉంటే వాటినెవరైనా ఆపగలరా! వాటికోసం సహనం వహించాల్సిన బాధ్యత మనకు లేదా!

ఒక తాబేలు కుటుంబమంతా కలిసి ఒకసారి దూరాన కొండల వెనకనున్న అడవిలోకి వనభోజనానికి వెళ్లింది. తీరా అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఆహారమంతా ఉంది కాని, వాటిలో ఉప్పు పొట్లం కనిపించలేదు. అందరిలోకీ అతివేగంగా వెళ్ళగలదని చిరుతాబేలును తొందరగా ఇంటికి వెళ్ళి ఉప్పు తీసుకురమ్మని తక్కిన తాబేళ్లు పురమాయించాయి. చిరుతాబేలు ఎప్పుడు తిరిగివస్తుందా, తెచ్చుకున్నది ఎప్పుడు తిందామా అని అవి ఎదురుచూడసాగాయి. చూస్తుండగా ఆరు వారాలు గడిచిపోయాయి. కాని, ఆ చిరు తాబేలు జాడ లేదు. 'ఇంక దీనికోసం ఎన్నాళ్లాగుతాం? ఇంట్లో ఏదోటి తింటూ అది హాయిగానే ఉండుంటుంది. మనకు ఆకలేస్తున్నది. ఇలాగే తినేద్దాం...' అని కూడబలుక్కుని మూటలు విప్పాయి అక్కడున్న తాబేళ్లు. అంతలో వెనకవైపు చెట్ల గుబుర్ల లోంచి ఆ చిరుతాబేలు ఒక్క గెంతులో వాళ్ల ముందుకు దూకింది. 'ఆరు వారాల్నించి మిమ్మల్ని అక్కడ్నించి కనిపెడుతూనే ఉన్నా! చివరికి నా అనుమానం నిజమే అయింది. నేను లేకుండా మీరంతా కలిసి తినటానికి సిద్ధమవుతారని నాకు ముందే తెలుసు' అంది.

మనలో కొందరు ఆ చిరుతాబేలు లాంటివారే! వాళ్లూ తోటివారిని నమ్మరు.
తమ పని తాము చేయరు. అంతా తామనుకున్నట్టు జరగాలనుకుంటారు. ఈ అపనమ్మకంవల్ల తాము చేయాల్సిన పని మానేసి తోటివాళ్లు శ్రమ పడాలనుకుంటారు. బాధ్యత తీసుకోవాలనుకుంటారు. దీనివల్ల తమకు మేలు జరగదు సరికదా- ఎవరికీ మంచి జరగదు. ఈ వివేకం వారికుండదు.

దీనికి కారణం తమకే అంతా తెలుసుననుకునే అహంకారం. తక్కిన వారికన్న తామే ముఖ్యులమనుకునే అహంభావం. ఇతరుల అభిప్రాయంకన్నా తాము నమ్మిందే నిజమనుకునే మూర్ఖత్వం. తాము చేసేదేదీ తప్పు కాదనుకుంటారు. అన్నిటికీ అతీతులమనుకుంటారు. కేవలం ఇదొక మొండితనమని వారికి తోచదు. ఈ అహంకారంతో స్వార్థం తలెత్తుతుంది. ఇది అనర్థదాయకమని ఎవరు చెప్పినా వారు వినరు, కనరు, గ్రహించుకోరు.

అలాకాక, కాస్త పట్టువిడుపులుంటే ఇతరుల అభిప్రాయాలకూ కొంచెం విలువనిస్తే ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. 'నేను' 'నాది' అన్న మాటలు విడిచిపెట్టి అంతా 'మనం', 'మనది' అని అనుకోవటంలో ఎంత సంతోషముందో, అందరికీ ఎంత లాభదాయకమో అవగతమవుతుంది.

ప్రకృతితో సహజీవనం చేసే జంతువులు, పక్షులనుంచి మనిషి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. భగవంతుడి సృష్టిలో ఐకమత్యంగా జీవించటం సహజ గుణం. విభేదించి ఒంటరిగా బతకటం విపరీత లక్షణం. వీటిలో ఏది కావాలో నిర్ణయించుకోవటం మనిషి చేతుల్లోనే ఉంది!...
మాయమైపోతున్న మనిషి..

No comments:

Post a Comment

.