Pages

Wednesday, August 17, 2016

స్నేహమేరా జీవితం

స్నేహమేరా జీవితం


చెమరించిన నయనాల్లో చెదిరిపోని జ్ఞాపకం స్నేహం...
ఒడిదుడుకులలో ఓదార్పునిచ్చి...
ఒడ్డున చేర్చే అభయహస్తం స్నేహం...
ప్రతిఫలం ఆశించకుండా తోడై నిలిచేది స్నేహం...
హృదయాన్ని స్విచ్ఆఫ్ చేయకుండా ఉంచితే...
జీవితాంతం పనిచేసే అద్భుత నెట్‌వర్క్ స్నేహం...!

స్నేహం... ఓ అద్భుత అనుబంధం...
అది అపూర్వం.. అపురూపం.. అద్వితీయం...
స్నేహం అంటే ఓ విశ్వాసం... వికాసం...
అది ఓ మార్గదర్శి.. ఓ మాధుర్యం...
నిట్టూర్పుల వేళ అది.. ఓ చక్కటి ఓదార్పు...
నేనున్నానంటూ ఆదుకునే ఆపన్న హస్తం  స్నేహం...!

సృష్టిలో ఏ జీవికి లేని రీతిలో...
మనిషికే దక్కిన వరం స్నేహం...
రక్త సంబంధం లేకున్నా అంతకంటే...
ఎక్కువగా పెనవేసుకునే అనుబంధం స్నేహం...
చుట్టరికం లేని ఆత్మీయ బంధువు స్నేహితుడు...
బెత్తం పట్టుకోని గురువు స్నేహితుడు...!

డబ్బుకే విలువనిచ్చే నేటి ఆధునిక కాలంలో...
కుటుంబ వ్యవస్థ కునారిల్లుతున్నప్పటికీ...
స్నేహబంధం మాత్రం ఇంకా పటిష్టంగానే ఉంటోంది...
ఉమ్మడి కుటుంబాలు నానాటికీ అదృశ్యమవుతూ...
రక్తసంబంధీకుల మధ్య మాటలు కరవై పోతున్న ప్రస్తుత రోజుల్లో...
అలసిన హృదయాలకు కాస్త సాంత్వన చేకూర్చేది స్నేహబంధమే...!

ఇంట్లోవారితో చెప్పుకోలేని బాధలు కావచ్చు..సమస్యలు కావచ్చు...
ఎలాంటి అరమరికలు లేకుండా స్నేహితులకు చెప్పుకొని సేదతీరుతాం...
అందుకే, శత్రువు ఒక్కడైనా ఎక్కువే...
మిత్రులు వంద వున్నా తక్కువే అంటాడు వివేకానందుడు...
విశ్వాసం లేకుండా స్నేహం వుండదు అంటాడు గౌతమబుద్ధుడు...
శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు తెచ్చిన అటుకుల్ని...
ప్రేమామృతంలా స్వీకరించడమంటే...
బాల్యస్నేహంలోని మాధుర్యాన్ని ఆస్వాదించడమే కదా...!

గున్నమామిడి కొమ్మమీద చిలుకా, కోయిలకు ఊయలకట్టి...
ముద్దుముద్దుగా ముచ్చటలాడించారు మనసుకవి ఆత్రేయ...
స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం...
అంటూ కవి సినారె సందేశాత్మకంగా పల్లవిస్తే...
స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా...
స్నేహమేరా బతుకుబాటకు నీడనిచ్చే మల్లెరా...
అని ప్రజాగాయకుడు జయరాజ్‌ సుమధురంగా పరిమళించారు...!

స్నేహం నిండుకుండలాంటిది...
కుండనిండుగా నీళ్లుంటే మనస్సు ఎంత నింపాదిగా వుంటుందో...
మంచి నేస్తంతో స్నేహబంధం సాగినకొద్దీ...
కొత్తకుండలో నీరులా తీయగా వుంటుంది...
మంచిమైత్రీ బంధం మీగడపెరుగులా కమ్మగా...
కలకాలం మనల్ని అంటిపెట్టుకొని...
ఆ మీగడ వెన్నలా...కరిగిన నెయ్యిలా...
అలా అలా ఆ మాధుర్యం...
మన అంతరంగంలో ఓ పెన్నిధిలా నిక్షిప్తమౌతుంది...!

ఒక హృదయం పొంగితే వురికేది కవిత...
రెండు హృదయాలు ఉప్పొంగితే విరిసేది స్నేహం...
రెండు మేఘమాలికలు కలిస్తే కురిసేది జల్లు...
స్నేహితుల అంతరంగాల్లో వూరేది సంతోషాల జల...
కుల మతాలు.. భాష, ప్రాంతాలు అనే సరిహద్దులను చెరిపేస్తూ... 
కొత్త పుంతలు తొక్కుతున్న బంధం స్నేహం...!


స్నేహమంటే.. నమ్మకం.. ఆసరా.. బాధ్యత... 
స్నేహమంటే.. అవగాహన.. అనురాగం...
ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేనిది...
ఎన్ని అర్థాలు చెప్పినా...
స్నేహాన్ని సరిగా నిర్వచించడం సాధ్యం కాదు... 
ఇంకా ఏదో మిగిలే ఉంటుంది...
అందుకే స్నేహానికి మించిన గొప్పది ఈ లోకంలో లేదు...
అలాంటి స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజే ఫ్రెండ్ షిప్ డే...!!

ముందస్తు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

No comments:

Post a Comment

.