Pages

Saturday, August 27, 2016

రాధాకృష్ణుల ప్రేమతత్వం



రాధాకృష్ణుల ప్రేమతత్వం

 జగమంతా మాయామయం. జీవితం నీటిబుడగ లాంటిది. అసలు ఈ బతుకే తోక తెగిన గాలిపటం. గాలిలో ఎగురుతూ,
మధ్యలో జారి ఎక్కడో ఏ పుట్టలోనో పడుతుంది. లేదా ఏ చెట్టుకొమ్మకో తగిలి తలకిందులుగా వేలాడుతుంది. ఇంతకంటే, అన్ని ప్రేమానుబంధాల్నీ తెంచుకొని ఏ అడవికో వెళ్లడం మంచిది. ఏ కొండపైనో ముక్కుమూసుకుని కూర్చోవడం అన్నింటికంటే ఉత్తమం’...- ప్రపంచంలో కొందరి ఆలోచనలు ఇలా ఉంటాయి. కొన్ని వర్గాలు ఇలాంటి వేదాంత సూత్రాలనే వల్లిస్తుంటాయి. ప్రపంచమంటూ ఉన్నదని, జీవించటం ప్రాణిధర్మమని చెప్పి వెన్నుతట్టి ముందుకు నడిపించే విధానాలు కొన్నే కనిపిస్తాయి. జీవన కురుక్షేత్రంలో అలా కదం తొక్కించే పద్ధతులు అల్పసంఖ్యలో ఉంటాయి. వీటన్నింటి మధ్య, అంతర్యామి పాదపద్మాల ముద్ర ఈ భూమిపైన పడిందన్న విషయం మరుగున పడుతోంది.
అర్ధనారీశ్వరుల అతిలోక దాంపత్యం ప్రపంచానికే ఆదర్శం. రాధాకృష్ణుల మధుర ప్రేమ విశ్వానికే తలమానికం. భక్తుల పట్ల భగవంతుడికి అంతులేని ప్రేమ ఉంటుందన్నది నిజమైతే, ఆ ప్రేమే ఈ ప్రపంచానికీ వర్తించాలి. పరిస్థితుల వల్లనో,
ఇతర ప్రభావాల కారణంగానో ఆ ప్రేమ మరుగున పడుతుందేమో కానీ- ఎన్నటికీ మాసిపోదు. ఆ ప్రేమే లోకానికి మూలాధారం. మనో మందిరంలో ప్రేమ అనే దివ్యదీపం ఏదో ఒక మూల రూపాంతరం చెంది వెలుగుతూనే ఉంటుంది.
రాధాకృష్ణుల ప్రేమ- శరీర ఇంద్రియాలకు అతీతమైన ఒక అపూర్వ అనుబంధం. ఆ అందమైన బంధం సారాంశాన్ని మానవ సమాజానికి అందజేయటమే మతానికి తుది గమ్యం కావాలి. అలాంటి యథార్థమైన, సహజమైన విధానమే సంత్‌మార్గం. అదే, దాతా దయాళ్‌ మహర్షి ప్రవచించిన రాధాస్వామి తత్వం. భగవంతుడు నీలోనే ఉన్నాడు. నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. నీ వూపిరిలో వూపిరిగా ఉంటాడు. సదా నిన్ను కనిపెట్టుకునే ఉంటాడుఅని ఈ తత్వ సారం. ఈ ప్రవచనంలోని సత్యత్వం తెలుసుకోవాలంటే, మానవ ప్రయత్నం చాలా అవసరం.నిశ్చలమైన కొలనులోని నీటి అడుగున
ఉన్నదేమిటో తెలుసుకోవచ్చు. అదే కోవలో- ఆలోచనల తరంగాలు శాంతించాక, అంతరంగంలో ఏముందో గ్రహించవచ్చు. తీవ్రమైన ఆకాంక్ష ఫలితంగా, ఆ పరమాత్మను కనులారా చూడవచ్చని పెద్దలు చెబుతారు.నామరూపాలకు అతీతమైనదే
రాధాకృష్ణుల ప్రేమతత్వం. అదే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తోంది. ప్రేమ అనేది భగవంతుడి స్వరూపం. ఆ ప్రేమ కోసం ఆయనకు సర్వస్వాన్నీ సమర్పించుకోవడమే- ఆరాధనం.మనసును భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక ఉన్నత శిఖరానికి చేర్చేదే మోక్షమని ఇతిహాసాలు చెబుతాయి. అలాంటి మోక్షసాధనకు, భక్తికి మించిన యుక్తి లేదని అవి చాటుతున్నాయి. నారదుడు, ప్రహ్లాదుడు, ద్రౌపది వంటివారిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. భక్తిరసంలో విలీనం కావాలంటే, మనసును బుద్ధిని ఆ భగవంతుడి వద్దకు చేర్చాలంటే ఏం చేయాలి? కేవలం భావన వల్లనే కాదు, సాధన ఫలితంగానూ ముక్తి సాధ్యమే అన్నది భగవాన్‌ ఉవాచ.ధ్యానానికి సమమైన దైవ ప్రార్థన ద్వారా భాగవతులు తరించారు. ప్రార్థన అంటే, తెలివిగా అర్థించటం. ఆర్తులు, జిజ్ఞాసువులు చేసే ప్రార్థనలకు తగినంత ఫలితమే లభిస్తుంది. ఏదీ అర్థించని జ్ఞాని,
మౌనంతోనే భగవంతుణ్ని ప్రార్థించి తరించగలడు. నోట హరినామం పలికిస్తూ, చెవులకు శివకీర్తనం వినిపిస్తూ, నాసికకు భక్తి పరిమళం అందజేస్తూ, కంటికి దివ్య రూపాలు చూపిస్తూ, పరమాత్మ పాదపద్మాలను స్పృశిస్తూ... భక్తుడు సదా భగవంతుడి సేవలోనే లీనమై ఉంటాడు. ఆ భక్తుడి బాధ్యతలన్నింటినీ భగవంతుడే వహిస్తాడని పురాణాలు
చెబుతున్నాయి. రాధాకృష్ణులు అటువంటి పరమ ప్రేమ స్వరూపులు. జీవాత్మ, పరమాత్మలకు వారే సజీవ ప్రతీకలు!
-ఉప్పు రాఘవేంద్రరావు.ఈనాడుసౌజన్యంతో  

No comments:

Post a Comment

.