పండితుడు
🌺శ్రీమద్రామాయణ కథా ఘట్టాల్లో అత్యంత ఆసక్తికర సందర్భం ఒకటుంది. శ్రీరాముడు తన సందేహం తీర్చుకోవడానికి వసిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి తలుపు తడతాడు. లోపల నుంచి ఆయన ‘ఎవరూ?’ అని ప్రశ్నిస్తాడు. ‘నేను’ అంటాడు రాముడు. ‘నేనంటే?’ అని మళ్ళీ ప్రశ్న. ‘అది తెలుసుకుందామనే వచ్చాను’ అని శ్రీరాముడు బదులిస్తాడు. ‘నేను అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలోనే నేనూ ఉన్నాను. నాకు తెలిసిన తరవాత నీకు తెలియజేస్తాను’ అంటాడు ఆ మహాముని!
🌺రామాయణంలోనే మరొక ఘట్టంలో- జనక మహారాజు ఆస్థానానికి అష్టావక్రుడు వెళ్తాడు. ద్వారపాలకుడు ‘ఎవరు వచ్చారని మహారాజుకు చెప్పమంటారు’ అని అడుగుతాడు. ‘నేను వచ్చానని చెప్పు’ అంటాడాయన. ద్వారపాలకుడు వెళ్ళి మహారాజుతో ‘మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు’ అంటాడు. ‘ఎవరు?’ అని జనకుడి ప్రశ్న. ‘నేను వచ్చానని చెప్పమన్నారు!’ అంటాడా సేవకుడు. దానికి మహారాజు- ‘నేను’ చచ్చాక రమ్మను’ అని చెప్పి పంపుతాడు. ఆ సమాధానాన్ని విని అష్టావక్రుడు అక్కడినుంచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్లు పోయిన తరవాత మళ్ళీ రాజును కలవడానికి వెళ్తాడు. ‘అష్టావక్రుడు’ వచ్చాడని చెప్పమంటాడు. బహుశా ఆయనకు ‘నేను’ అనే పదానికి సమాధానం కొంతవరకు దొరికిందన్న మాట!
🌺తనకేమీ తెలియదని మనిషి తెలుసుకోగలిగితే అది గొప్ప విషయమే! ఆ తరవాతైనా, తెలుసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ‘అన్నీ తెలుసు’ అనుకుంటే ఇంక తెలుసుకోవడానికి ఏమీ లేదు. ‘నాకే తెలుసు’ అనుకోవడమే అసలు సమస్య. ‘ఇతరులకేమీ రాదు’ అనడం వల్లనే గొడవ మొదలవుతుంది. సమస్త స్పర్ధలకూ అదే కారణం. ఇదే అంశం గురించి భర్తృహరి ఒక సుభాషితంలో ‘నేను కొద్దిగా తెలుసుకొని ఉన్న కాలంలో మదగజంలా వ్యవహరించాను. నేనే సర్వజ్ఞుడినని తలచాను. పెద్దల వల్ల కొద్దికొద్దిగా తెలుసుకున్నాక- నేను మూర్ఖుడినని, నాకేమీ తెలియదని గ్రహించాను. జ్వరం తగ్గిన తరవాత శరీరం ఎంత సుఖపడుతుందో, అలా నన్ను అప్పటివరకు పట్టుకుని ఉన్న గర్వాన్ని విడిచి సుఖపడ్డాను’ అంటాడు.
🌺‘పండితుడు’ అనే మాట చాలా బరువైంది. ఆత్మ సంబంధ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడే పండితుడు. అంటే, ముందు తనను తాను తెలుసుకొని ఉండాలి. నిజానికి అది చాలా కష్టమైన పని. అంత తేలికైంది కాదు. తెలుసుకోగలిగితే పండితుడు అవుతాడు.
🌺అహమేవ పండితః, అహం పండితః, నాహం పండితః అని సంస్కృతంలో మూడు వాక్యాలున్నాయి. నేను మాత్రమే పండితుణ్ని, నేను కూడా పండితుణ్ని, నేను పండితుణ్ని కాదు- అని ఆ మాటలకు అర్థం. ఇందులో- నాహం పండితః అనే మాట వినయంతో కూడినది. ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది, నేను పండితుణ్ని ఎలా అవుతానని అతడు ఇంకా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. అహం పండితః అనడంలో- తనకు తెలుసు అనుకుంటున్నదంతా చెబుతాడు. తాను మాత్రమే పండితుణ్ని అన్నప్పుడు ఆ వ్యక్తి మాట తీరు అంతే కాబోలునని సరిపెట్టుకోవచ్చు. తక్కినవారు పామరులని, పనికిమాలినవారని అదేపనిగా నిందించటంతోనే మనుషుల మధ్య గొడవలు మొదలవుతాయి. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం.
🌺మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం, మనకున్న సామర్థ్యాన్ని విధి నిర్వహణలో ప్రదర్శించటం ఒక్కటే- మనం చేయగలిగే పని. మనిషి తన అధికారం, ఆధిపత్యం, గర్వంతో తాను చాలా గొప్పవాడినని విర్రవీగితే; వాటి వల్ల ఇతరులకు కష్టనష్టాలు కలిగితే- అది అతడి లోపభూయిష్ఠ ప్రవర్తనే అవుతుంది. దీనికి పరిష్కారంగా మహాభారతం ‘ఇతరులు ఏం చేస్తే మన మనసుకు బాధ కలిగిందో, అది ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాల కన్నా గొప్పది’ అని ప్రబోధించింది. మన పనిలో మనం నిమగ్నమై మనశ్శాంతిగా ముందుకు సాగడమే జీవన భారతంలో శాంతిపర్వం. అది తెలుసుకున్నవాడే నిజమైన పండితుడు!
- డాక్టర్ తలారి వాసు
💐ఈనాడు సౌజన్యంతో
No comments:
Post a Comment