Pages

Saturday, August 27, 2016

మోసానికి మోసం

మోసానికి మోసం


ఆహారం దొరక్క నకనకలాడుతోంది ఓ నక్క.
దాంతో ఒక పథకాన్ని ఆలోచించింది.
ఒక కొలను ఒడ్డుకు పోయి తచ్చాడసాగింది.
 సూర్యకిరణాలు నడినెత్తికి రావడంతో చిన్న చిన్న జంతువులన్నీ ఆహార సంపాదనకు బయటకు వచ్చాయి.

'మిత్రులారా! బద్దకం భవిష్యత్తును నాశనం చేస్తుంది. వేకువనే మేల్కొని పనులు చేసుకోవడం మంచి పని'
 అంటూ అటుగా పోతున్న కుందేళ్ల గుంపును ఉద్దేశించి హితవాక్యాలు చెప్పింది నక్క.

"నిజమే కాని చలి మమ్మల్ని బయటకు రానివ్వడం లేదు!"
అని సమాధానమిచ్చాడు కుందేళ్ల నాయకుడు.

 "చలిని చూసి మీరు భయపడటమా? ఆ చలే మిమ్మల్ని చూసి భయపడి పారిపోయే మంత్రం నా దగ్గర ఉంది. నిండా మునిగిన వాడికి చలే ఉండదంటారు. వేకువనే ఈ నీటిలో మునగండి, హాయిగా ఉండండి"
అంది నక్క.
ఇవి కుతంత్రపు మాటల్లా ఉన్నాయని గ్రహించిన కుందేళ్లు
"రేపటి నుండి అలానే చేస్తాము"
 అని తప్పించుకుని పోయాయి.

"ఈ కుందేళ్లు నా మాటలు నమ్మినట్లున్నాయి. నిండా మునిగితే ఊపిరాకడ చస్తాయి. ఇక ఒడ్డున కాచుకుని ఉంటే చాలు నా తిండి సమస్య తీరిపోయినట్లే"
అని పైకే అంది నక్క.
ఈ మాటలు కొలనులో ఉన్న మొసలి విని
"నక్క బావా, నీ మాటలు యథార్థం కాదు. చలిని భరించలేక ఈ కొలనులోని చేపలన్నీ నన్ను బయటపడేయమని కోరుతున్నాయి. అది నా ఒక్కడి వల్లా సాధ్యం కావడం లేదు. నువ్వు తోడుంటే వాటిని తోడి బయటపడేద్దాము"
 బతిమాలింది మొసలి.
 దాని మాటలు నిజమని నమ్మిన నక్క
"ఓస్, అంతేనా, అయితే పద పోదామ"
అంటూ చెంగున ఎగిరి మొసలి వీపుపై కూర్చుంది.
కొద్దిదూరం పోయాక మొసలి నీటిలో బుడుంగున మునిగింది.
 ఈత రాని నక్క ఊపిరాకడ చచ్చి చివరకు మొసలికి ఆహారమైపోయింది.

🍀నీతి:
ఇతరులను మోసం చేసేవారు చివరకు వారు కూడా ఎవరో ఒకరి చేతిలో మోసపోక తప్పదు.
 అందుకే అంటారు ఎవరు తీసిన గోతిలో వారే పడతారని

No comments:

Post a Comment

.