చమత్కారచంద్రికలు
గణిత సార్వభౌమం
‘ఇంతకూ చివరికేమైంది..?’
‘ఏదీ.. ఆ చదరంగపు
లెక్కేనా..?’
‘అదే.. ఆ బ్రాహ్మణుడడిగాడు
కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు..
మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత 8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..’
‘ఆఁ.. ఆఁ.. అయితే..’
‘అయితే ఏముంది.. చదరంగంలో
ఉన్నదంతా 64 గళ్లేగా..
ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి బ్రాహ్మణుడు.. గింజలకు గింజలు
రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..’
‘అలా తీసెయ్యకూ.. ఆ
బ్రాహ్మడేమీ వెర్రిబాగులవాడు కాదు.. అలా అనుకున్న వాళ్లు వెర్రిబాగుల వాళ్లు..’
‘ఎంచేత..?’
‘లెక్క కట్టి చూసుకో.. ఆ
బ్రాహ్మడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!’
‘ఎలా..? నాకు ఆ లెక్కలేమీ తెలియవు కానీ ఇంతకూ ఎవరైనా
ఎన్నిధాన్యపు గింజలో లెక్క కట్టి చెప్పారా..?’
‘లక్షణంగా..
మరేమనుకున్నావు మనవాళ్ల గణిత పరిజ్ఞానం.. చివరి గింజవరకూ లెక్క కట్టి మనం
మరచిపోతామేమో నని ఒక చంపకమాల పద్యంలో బిగించి ఉంచారు..’
‘అలాగా.. ఏదీ..?’
‘ఇదుగో.. విను’
శర శశి షట్క చంద్ర శర
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి
తర్క పయోనిధి పద్మజాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకు ని
జంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు
సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
‘దీన్లో తేలిన
లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ,
చంద్రులూ, ఆకాశం, అంబుధి, కొండలు తప్ప..’
‘అదే నోయ్ మనవాళ్ల మేధ..
సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..’
‘సరే… సరే.. విప్పి చెప్పవూ..’
‘ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి..
వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు
చేసుకున్నారు.. అలాగ, విమర్శించుకుని
వివరించుకుంటే,
శర, సాయక, - 5 మన్మథుని పంచసాయకములు తెలుసుగా.
గగన, వియత్ - 0 ఆకాశం గగనం శూన్యం
శశి, చంద్ర, తుహినాంశు - 1 చంద్రుడొకడేగా
భూమికి ఉపగ్రహం..
షట్కము - 6 స్పష్టమే కదా
రంధ్ర - 9
నవరంధ్రపురే దేహే.. తోలుతిత్తి యిద్ది తొమ్మిది తూటులు.. విన్నావుగా ఆ
పాట..
నగ, గిరి, భూధర - 7 సప్త
కులపర్వతాలు
అగ్ని - 3 మూడగ్నులు; గార్హపత్యాగ్ని(తండ్రికై), దక్షిణాగ్ని(తల్లి), ఆహవనీయాగ్ని(గురువు)
మనుస్మృతి వాక్యం ,
పితా వై గార్హపత్యాగ్ని
ర్మాతగ్ని ర్దక్షిణః స్మృతః
గురు రాహవనీయస్తు సాగ్ని
త్రేతా గరీయసీ (మనుస్మృతి 2-331)
అబ్ధి, పయోనిధి - 4 చతుస్సముద్రముద్రిత ధరావలయంబును..
చదువుకున్నావుగా
వేద -4 చతుర్వేదములు
తర్క - 6 తార్కికులు చెప్పిన షట్ ప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్థాపత్తి,
అనుపలబ్ధి’
పద్మజాస్య - 4 పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడేగా
కుంజర - 8 అష్ట దిగ్గజములు కదా భూమిని భరించేవి
ఇవీ ఇందులోని
అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూడు..’
శర శశి షట్క చంద్ర శర
5 1 6
1 5
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
5
9 0 7
3
ధర గగనాబ్ధి వేద గిరి
7 0
4 4 7
తర్క పయోనిధి పద్మజాస్య కుం
6 4 4
జర తుహినాంశు సంఖ్యకు ని
8 1
జంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు
సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
ఇంతా చేస్తే వచ్చిన సంఖ్య
ఎంతా..! చూడు..
అంకెలు లెక్కించెటప్పుడు
మనపూర్వీకుల సంప్రదాయ సూత్రం మరచిపోకూడదు సుమా.. ‘అంకానాం వామతో గతిః’ -
కుడినుంచి ఎడమకు చేర్చి
చదువుకోవాలి.. అలా చేస్తే తేలిన సంఖ్య..
1,84,46,74,40,73,70,95,51,615
ఒక కోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల
73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615
ఇంతోటి ధాన్యాన్ని
నిలవచేయాలి అంటే,
ఒక ఘనమీటరు విస్తృతిగల
గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,
4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..
విడమరచుకుంటే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి
సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు..
పోనీ లెక్కపెట్టడానికి
ఎంత సమయం పడుతుందో అంటే,
సెకనుకు ఒక్కగింజగా
లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి కేవలం 58,495 కోట్ల సంవత్సరాలు..
అదీ సంగతి… అదేమిటి.. నోరలా వెళ్లబెట్టావ్..
వేదపండితులతో వేళాకోళం
తగదు సుమా…
ఇంతకూ ఇంతపరిమాణాన్ని
పాదానికి 21 అక్షరాలు గల
నాలుగుపాదాల చంపకమాలలో అదీ రెండుపాదాలపైన రెండుగణాలలోపే.. అంటే కేవలం 48 అక్షరాలలో సంగ్రహించి చెప్పారు చూశావా.. ఈ పద్యం
నోటికి వస్తే చాలు.. చదరంగం లెక్క వచ్చినట్టే.. అదీ పద్యసౌందర్యం..!’
No comments:
Post a Comment