మతిమరుపు...మందు
మతిమరుపు...మందుమనలోనే!
గడియారంలో ముల్లు కదిలిపోతూ ఉంటుంది కానీ ఆన్సర్ షీట్ మీద పెన్ను కదలదు. జవాబులన్నీ తెలిసినట్టే ఉంటాయి. కానీ రాయబోతే ఒక్క అక్షరం ముక్క గుర్తుకురాదు. చదివిందంతా గుర్తున్నట్టే అనిపిస్తుంది. కానీ ఏ ఒక్కటీ జ్ఞాపకం ఉండదు. అసలేంటీ తిరకాసు? మెదడులోకి చేరిన మ్యాటరంతా ఏమవుతున్నట్టు? అసలీ మతిమరుపును జయించే మార్గమే లేదా? ఇవీ పరీక్షల టైమ్‌లో విద్యార్థులను వేధించే ప్రశ్నలు. వీటికి నిపుణులిస్తున్న సమాధానాలివే!
జ్ఞాపకశక్తిని మనం తేలికగా తీసుకుంటాం. కానీ అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్ర పోయేవరకూ చేసే ప్రతి చిన్న పనికీ మనం జ్ఞాపకాల మీదే ఆధారపడతాం. విషయాలకు సంబంధించిన సమాచారమంతా మెదడులో జ్ఞాపకంగా నిక్షిప్తమై ఉండబట్టే మన దైనందిన జీవితం సాఫీగా సాగిపోతోంది. మనం చూసే, చేసే, మన అనుభవంలోకి వచ్చే ఒక సమాచారం జ్ఞాపకంగా మారాలంటే ఎన్‌కోడింగ్, స్టోరేజ్, రిట్రీవల్ అనే మూడు దశలు దాటాలి. ఈ మూడు దశలూ దాటిన ప్రతి సమాచారం మనకు జీవితకాలం గుర్తుండిపోవాలనే రూలేం లేదు. కొన్ని క్షణం పాటు గుర్తుండొచ్చు. ఇంకొన్ని కొన్ని రోజులు, నెలలపాటు, మరికొన్ని జీవితకాలంపాటు జ్ఞాపకం ఉండొచ్చు. సమాచారం ప్రాధాన్యాన్ని బట్టి మెదడే ఈ తేడాలను పాటిస్తుంది. కాబట్టే మెదడుకు వెళ్లిన సమాచారం సెన్సరీ, షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్ మెమరీల రూపంలో నిక్షిప్తమై ఉంటోంది.
సెన్సరీ మెమరీ: దీని వ్యవధి ఒక సెకను. మన ముందు నుంచి ఓ కారు వెళ్లిపోయింది. ఆ విషయాన్ని ఆ క్షణం తర్వాత మర్చిపోతాం.
షార్ట్‌టర్మ్ మెమరీ: దీని వ్యవధి ఒక నిమిషం. పదే పదే పునరావృతమైతే ఎక్కువకాలం గుర్తుండవచ్చు. పాఠాలు చదవటం ఈ కోవకే చెందుతుంది.
లాంగ్ టర్మ్ మెమరీ: దీని వ్యవధి జీవిత కాలం. డ్రైవింగ్, ఆటలు ఆడటం లాంటివి. వీటిని సాధన చేయకపోయినా పూర్తిగా మర్చిపోం.
ఈ మూడింట్లో పాఠాలు చదివి గుర్తుపెట్టుకోవటం అనే షార్ట్‌టర్మ్ మెమరీకి పదును పెట్టగలిగితే దాని వ్యవధిని ఎక్కువ కాలం పొడిగించుకోవచ్చు. ఇందుకోసం మెదడులోకి చేరవేసే చదువు తాలూకు సమాచారాన్ని బలమైన జ్ఞాపకంగా మార్చాలి. దీనికి కొన్ని పద్ధతులు, మెలకువలు అనుసరించాలి.
పాఠాలు మెదడులో నాటుకోవాలంటే?
50% పాఠం వినటంతోనే నేర్చుకుంటాం. తిరిగి చదివితే 75% ఒంటబడుతుంది. అలా నేర్చుకున్న పాఠాన్ని చూడకుండా రాస్తే నూటికి నూరుశాతం గుర్తుండిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే! అయితే ఇలా నేర్చుకున్న పాఠం ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే మాత్రం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే...
నేర్చుకున్నది బోధించాలి: పాఠం నిజంగానే మనకు అర్థమైందో లేదో పరీక్షించుకోవాలంటే అదే పాఠాన్ని బోధించాలి. ఇలా చేస్తే ఆ పాఠం మనకెంత గుర్తుందో తెలుస్తుంది. ఇలా చెప్పేటప్పుడు బ్రేక్ పడితే మళ్లీ పుస్తకం తిరగేయాల్సిందేనని అర్థం. ఈ టెక్నిక్‌ని స్నేహితుల మీద ప్రయోగించొచ్చు లేదా ఎవరికి వారే ప్రయత్నించొచ్చు.
పాఠాలు కథల్లా!: కథల పుస్తకాలు చదివినంత ఇష్టంగా క్లాసు పుస్తకాలు చదవాలి. పాఠాన్నొక చేదు మాత్రలా మింగే ప్రయత్నం చేస్తే ఎంతకీ మింగుడుపడదు. ఓ కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్టు, ఆసక్తికరమైన అంశం దొరికినట్టు పాఠం చదివితే ఎంత కష్టమైనదైనా తేలిగ్గా తలకెక్కుతుంది.
బిగ్గరగా చదవటం మంచిదే!: ఇది కొంత చిత్రంగా అనిపించవచ్చు! కానీ మనసులో చదవటం మాని బిగ్గరగా చదవండి. మనసులోనే మళ్లీ మళ్లీ చదవటం కంటే పైకి చదవటం వల్ల గుర్తుండే అవకాశం 50% ఎక్కువ.
బొమ్మల రూపంలో: చదివినదానికి దృశ్యరూపమిస్తే గుర్తుండిపోయే అవకాశం పెరుగుతుంది. మెమరీ టెస్ట్‌లో వందల పేర్లు గుర్తు పెట్టుకుని రికార్డులకెక్కేవాళ్లు అనుసరించే పద్ధతి ఇదే! కాబట్టి చదివిన విషయాలను బొమ్మల రూపంలో గీసే ప్రయత్నం చేయండి. అదొక దృశ్య జ్ఞాపకంగా మీ మెదడులో నిక్షిప్తమైపోతుంది. పరీక్షల్లో ఈ బొమ్మను గుర్తుచేసుకుంటే చాలు! దాని ఆధారంగా సమాధానాన్ని రాసేయొచ్చు.
డాక్యుమెంటరీ చూడండి: పేజీలకొద్దీ విషయాన్ని చిన్న టైమ్‌ఫ్రేమ్‌లోకి మలిచి కాలక్షేపాన్ని అందించేవి డాక్యుమెంటరీలు. వీటిని చూడటం వల్ల పాయింట్లు తేలికగా గుర్తుంచుకోవచ్చు. కాబట్టి కన్‌ఫ్యూజ్ చేసి, ఇబ్బంది పెట్టే పాఠ్యాంశాలు డాక్యుమెంటరీలుగా దొరుకుతాయేమో చూడండి. ఇన్‌ఫోగ్రాఫిక్స్ కూడా ప్రయత్నించొచ్చు.
ఫ్లాష్ కార్డ్ టెక్నిక్: కొటేషన్లు, ఫార్ములాలు, కాన్సెప్ట్స్, డెఫినిషన్లు.. గుర్తుంచుకోగల్గితే పరీక్షల్లో సగం గట్టెక్కినట్టే! కాబట్టి వీటిని తేలికగా నేర్చుకోవటం కోసం ‘ఫ్లాష్ కార్డ్’ టెక్నిక్ ప్రయత్నించాలి. ఒక్కో కొటేషన్, ఫార్ములాకు ఒక్కో ఫొటోను జతచేస్తూ కొన్ని ఫ్లాష్ కార్డులు దగ్గర పెట్టుకోవాలి. ఆ ఫొటోలను చూస్తూ ఆ కొటేషన్లను నేర్చుకోవాలి. చివర్లో వరసగా ఫొటోలు తిప్పుతూ నేర్చుకున్నవి గుర్తు చేసుకోవాలి.
స్టడీ బ్రేక్స్: అదే పనిగా చదివినా మెదడు స్తంభిస్తుంది. ఏకాగ్రత కూడా సన్నగిల్లుతుంది. చదివే సమయంలో ప్రతి 45 - 50 నిమిషాలకు 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే మెదడు అలసిపోదు. అలాకాకుండా ఒకటిన్నర గంటలకు మించి ఏకధాటిగా చదివితే గుర్తుంచుకునే అంశాల్లో గందరగోళం నెలకొంటుంది.
మ్యూజిక్ వింటూ: పాటలు వింటూ చదివితే త్వరగా ఎక్కుతుందనేది నిజమే! అయితే అది మూడ్‌ను ఎలివేట్ చేసే ఇన్‌సు్ట్రమెంటల్ మ్యూజిక్ అయితే మేలు.
మననం చేస్తే మేలు: చదివింది ఖాళీ సమయాల్లో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. గుర్తు తెచ్చుకోవటానికి ఎంత ఎక్కువగా శ్రమపడితే ఆ విషయం అంత బాగా గుర్తుండిపోతుంది. సగం గుర్తొచ్చి ఆగిపోతే వెంటనే ఆ సమాధానాన్ని పుస్తకంలో వెతకాలి.
పరీక్ష ముందు నిద్ర: పరీక్ష ముందు రాత్రంతా మేలుకొని చదవటం వల్ల నష్టమే ఎక్కువ. నిద్రపోయే సమయంలో మెదడు సమాచారాన్ని భద్రపరుచుకుని అవసరమైన సమయంలో గుర్తుకు తెచ్చే శక్తిని పెంపొందించుకుంటుంది.
పాయింట్స్ టు రిమెంబర్
మరికొద్ది క్షణాల్లో పరీక్ష. పాఠాలు మొత్తం తిరగేసే సమయం లేదు. అలాంటప్పుడు ఆ కాస్త టైంలోనే పుస్తకం మొత్తాన్ని రివైజ్ చేయగలిగే టెక్నిక్ ఒకటుంది. అదే ‘పాయింట్స్ టు రిమెంబర్’. పరీక్ష ముందు రోజు పాఠాల్లోని ముఖ్యమైన అంశాలను పాయింట్ల రూపంలో చిన్న నోట్ ప్యాడ్‌లో రాసి పెట్టుకోవాలి. పరీక్ష హాల్లోకి వెళ్లేముందు వాటిని ఒకసారి చూసుకుంటే పాఠాల సారాంశమంతా గుర్తుకొస్తుంది.
మెమరీ ఫుడ్
జ్ఞాపకశక్తి పెరగాలంటే పోషకాహారం తీసుకోవాలి. మరిముఖ్యంగా పరీక్షల సమయంలో తప్పక తినవలసిన స్పెషల్ ఫుడ్ ఏంటంటే...
బీట్‌రూట్: దీన్లోని నైట్రేట్ మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా మెదడు పనితీరు మెరుగవుతుంది.
బోన్ సూప్: ఎముకల సూప్‌తో పెద్ద పేగులు శుభ్రమవుతాయి. ఈ సూప్‌లోని ప్రోలీన్, గ్లైసీన్ ఎమినో యాసిడ్లు రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
బ్రాకోలీ: దీన్లోని విటమిన్ కె, కోలీన్‌లు మెదడు పదును పెంచుతాయి.
గుడ్డులో పచ్చసొన: తల్లి తినే గుడ్లు.. గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదలకు తోడ్పడతాయి. గుడ్లు శరీరంలో ‘బీథేన్’ అనే హ్యాపీ హార్మోన్ విడుదలను పెంచుతాయి. కాబట్టి పరీక్షలు హ్యాపీగా రాయాలంటే గుడ్లు తినాల్సిందే!
ఆకుకూరలు: ఆకుకూరలు మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటిలో సమృద్ధిగా ఉండే ఎ, కె విటమిన్లు మెదడు కణాలైన న్యూరాన్ల మధ్య సమాచార ప్రసారాన్ని సరళం చేస్తాయి.
వాల్‌నట్స్: ప్రతిరోజూ మెదడు ఆకారంలో ఉండే గుప్పెడు వాల్‌నట్స్ తింటే మెంటల్ అలర్ట్‌నెస్ పెరుగుతుంది.
మెమరీ గేమ్స్ మెదడులోని హిప్పోక్యాంపస్ జ్ఞాపకశక్తి కేంద్రం. ప్రతి పదేళ్లకు ఐదు శాతం చొప్పున హిప్పోక్యాంపస్‌లోని న్యూరాన్లు నశిస్తూ ఉంటాయి. దీంతోపాటు జ్ఞాపకశక్తికి ఉపయోగపడే ‘అసిటైల్ కోలీన్’ అనే న్యూరోట్రాన్స్‌మీటర్ ఉత్పత్తి కూడా వయసుతోపాటు తగ్గుతుంది. ఫలితంగా మతిమరుపు వేధిస్తుంది. ఈ మార్పుల్ని నెమ్మదించాలంటే మెదడు యాక్టివిటీని పెంచే మెమరీ గేమ్స్ రెగ్యులర్‌గా ఆడుతుండాలి.
పజిల్స్, సుడోకు లాంటి గేమ్స్ ఆడాలి.
మెదడుకు పని పెంచే చదరంగం ఆడొచ్చు.
క్రాస్‌వర్డ్స్ మరీ తరచుగా ఆడకూడదు. చకచకా పూరించేసి పెన్ను పక్కన పెట్టేసే క్రాస్‌వర్డ్స్ ఆట వల్ల ఫలితం ఉండదు. అరుదుగా ఈ ఆట ఆడాలి.
షాపింగ్‌కి వెళ్లేటప్పుడు సరుకుల లిస్ట్ రాసుకున్నా, ఆ లిస్ట్ చూడకుండా వాటిని గుర్తుచేసుకునే ప్రయత్నం చేయాలి.
ఆకారాలు, రంగులు మ్యాచ్ అయ్యేలా చేయాల్సిన జిగ్‌సా పజిల్స్ వల్ల షార్ట్ టర్మ్ మెమరీ లాస్ మెరుగవుతుంది.
రెండు మూడు రకాల ‘కీ’స్ వాడే వీలున్న మల్టీటాస్కింగ్ వీడియో గేమ్స్ ఆడితే కాగ్నటివ్ ఫంక్షన్ పెరుగుతుంది.
యోగా, మెడిటేషన్, వ్యాయామం ఙ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే శారీరక పటుత్వం కూడా బాగుండాలి. వ్యాయామం వల్ల మెదడుకు రక్తప్రసారం పెరిగి చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకోసం ఎలాంటి వ్యాయామ్మానైనా ఎంచుకోవచ్చు. శారీరకంగా అలసటకు గురిచేసే సైక్లింగ్, స్కిప్పింగ్, ఏరోబిక్స్, పరుగు లాంటివి రోజుకి కనీసం 20 నిమిషాలపాటు చేయాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేసినా ఫలితం ఉంటుంది. ఏకాగ్రత పెరగటం కోసం యోగాను ఆశ్రయించవచ్చు.
శ్రద్ధ లేకపోతే ఏదీ గుర్తుండదు
చేసే పని మీద శ్రద్ధ లేకపోతే ఆ పని సక్రమంగా ఎలా పూర్తవదో దాని జ్ఞాపకం కూడా మెదడులో ముద్ర పడదు. ఇంట్లో నుంచి బయటకెళ్లే ప్రతిసారీ కారు తాళాల కోసం వెతుక్కునేవాళ్లు ఈ కోవలోకే వస్తారు. ఈ మతిమరుపు తిప్పలు తప్పాలంటే ఆ తాళాలు ఎక్కడ పెడుతున్నారో ఆ సమయంలో, ఆ చిన్న పని మీద శ్రద్ధ పెట్టాలి.తాళాలు ఏదైనా సొరుగులో ఉంచేటప్పుడు ‘తాళాలు సొరుగులో పెడుతున్నాను’ అని పైకి చెప్పాలి. మన మెదడులో ఒక సమాచారం జ్ఞాపకంగా నిక్షిప్తమవటానికి కనీసం 8 సెకన్ల సమయం పడుతుంది. ఆ సమయాన్ని మెదడుకు ఇవ్వాలి. కాబట్టి చేసే పని మీద అంత సమయం పాటు శ్రద్ధ పెడితే అది జ్ఞాపకముంటుంది. పైకి చెప్పటం వల్ల జ్ఞాపకం ఉంచుకునే శక్తి రెట్టింపవుతుంది. మతిమరుపుకు మరో శత్రువు ‘ఏమరుపాటు’. ఒకేసారి నాలుగైదు పనులు చేస్తే దాన్లో ఒకటి కచ్చితంగా మర్చిపోతాం. ఫోన్ మాట్లాడుతూ కారు దిగి ఇంట్లోకి వచ్చి, టివి ఆన్ చేసి రిమోట్‌తో ఛానల్స్ మారుస్తూ సోఫాలో కూర్చుండిపోతాం. తర్వాత మళ్లీ బయటికెళ్దామంటే కారు తాళాలు ఎక్కడ పెట్టామో గుర్తుకురాదు. ఏమరుపాటుతో వచ్చే తిప్పలివి.
సీరియస్‌గా తీసుకోవాలా..?
ప్రతి ఒక్కరికీ ఏదో ఓ సందర్భంలో మతిమరుపు అనుభవంలోకి రావటం సహజం. అయితే ఎలాంటి మతిమరుపును తేలికగా భావించాలి? దేన్ని సీరియ్‌సగా తీసుకోవాలంటే...
పేర్లు మర్చిపోవటం: రెండు, మూడు రోజుల కిందటే కలిసిన వ్యక్తి మళ్లీ ఎదురుపడి పలకరిస్తే అతని పేరు గుర్తుకురాక ఇబ్బంది పడతాం. 45 ఏళ్లు పైబడిన వాళ్లలో ఇది సహజమే! మెదడు నుంచి సమాచారాన్ని రాబట్టుకోగలిగే వేగం, సాంద్రత 45 ఏళ్లు పైబడితే తగ్గుతుంది. అయితే కుటుంబ సభ్యుల పేర్లు కూడా మర్చిపోతూ ఉంటే మాత్రం వైద్యుల్ని కలవాలి.
గదిలోకి దేనికోసం వెళ్లామో మర్చిపోతాం: దేని కోసమో గదిలోకి వెళ్తాం. తీరా అక్కడికెళ్లాక ఎందుకెళ్లామో గుర్తుకురాదు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా జరగటం సహజం. ఇలా మొదటిసారి తల్లయిన వాళ్లకి, కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లకి జరగొచ్చు. ఈ మతిమరుపుతోపాటు తరచుగా వస్తువులను పోగొట్టుకుంటూ, ఆ నెపాన్ని ఇతరుల మీద మోపుతుంటే జాగ్రత్త పడాల్సిన సమయమొచ్చిందని అర్థం.
చెప్పిందే చెప్పటం: ఒక్కోసారి చెప్పిన విషయాన్నే అదే వ్యక్తికి మళ్లీ చెప్తూ ఉంటాం. అయితే రెండోసారి చెప్పేటప్పుడు ఆ విషయాన్ని చెప్పినట్టు గుర్తొస్తుంది గానీ ఎవరితో చెప్పామో గుర్తుకురాదు. ఇది సహజం. అయితే ఒకే వ్యక్తితో ఒకే సంభాషణలో చెప్పిందే పదే పదే చెప్తూ, అలా చెప్తున్న విషయాన్ని గ్రహించలేకపోతే మాత్రం సమస్య ఉన్నట్టే.
Please Leave your Comment below / Ask doubts ?
Share this to your Friends