Pages

Friday, March 10, 2017

ఆధార్ పేమెంట్ యాప్‌తో లాభాలు- ఇబ్బందులు

ఆధార్ పేమెంట్ యాప్‌తో లాభాలు- ఇబ్బందులు ఇవే..


నోట్లరద్దు తర్వాత ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ‘ఆధార్ పేమెంట్ యాప్’ను లాంఛ్ చేసింది. ఇంతకు ముందు ‘భీమ్’ యాప్‌ను లాంఛ్ చేసినా దాని సేవలు పొందాలంటే ప్రతి ఒక్కరూ ఆ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి వద్ద ఆండ్రాయిడ్ ఫోన్స్ లేకపోవడంతో ‘భీమ్’ యాప్ అందరికీ చేరువకాలేకపోయింది.

💎అయితే ‘ఆధార్ పేమెంట్ యాప్’ అలా కాదు. కేవలం మర్చంట్స్ మాత్రమే యాప్ వాడుతారు. వినియోగదారులు యాప్ అవసరం లేకుండా కేవలం ఆధార్ నంబర్, వేలి ముద్రల ద్వారా నగదు చెల్లింపులు జరపొచ్చు. దీనికోసం దుకాణాదారుడు స్మార్ట్‌ఫోన్‌లో ‘ఆధార్ పేమెంట్ యాప్’, ‘బయోమెట్రిక్ స్కానర్’ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ రెండింటినీ అనుసంధానించి, మొబైల్‌కు బయోమెట్రిక్ స్కానింగ్ పరికరాన్ని కనెక్ట్ చేయాలి. అనంతరం ‘ఆధార్ పేమెంట్ యాప్’లో కొనుగోలుదారుడి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి వేలిముద్రను స్కాన్ చేసి, సంబంధింత బ్యాంకును ఎంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యాప్ పనిచేయాలంటే ఇంటర్నెట్ ఉండాల్సిందే. ముఖ్యంగా వినియోగదారుల బ్యాంక్ అంకౌంట్స్‌కు వాళ్ల ఆధార్ నంబర్‌లు లింక్ చేసి ఉంటేనే ఈ విధానం సాధ్యమవుతుంది.

యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి.



ఉపయోగాలివీ...:-
1. కొనుగోలుదారులు ఎలాంటి స్మార్ట్‌ఫోన్స్ కానీ, టెక్నాలజీ కానీ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

2. సర్వీస్ ట్యాక్స్ కానీ, ఇతర ఎక్స్‌ట్రా ఛార్జీలు కానీ ఉండవు.

3. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులను వెంట ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు.
4. పాస్‌వర్డ్స్, MPINs గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు.

ఇంత వరకు బాగానే ఉన్నా ఈ యాప్ ద్వారా చాలా లాభాలున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి.

ఈ యాప్ ద్వారా పేమెంట్ చెల్లించాలంటే ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు ఉన్నాయో.. వాళ్ల ఆధార్ నంబర్‌తో పాటు వాళ్లు కూడా అందుబాటులో ఉండాల్సిందే.

ఏదైనా అత్యవసర సమయంలో అకౌంట్ ఉన్న వాళ్లు ఒకచోట ఉండి, పేమెంట్ ఇంకో చోట చేయాల్సిన సమయంలో ఇది సాధ్యపడదు. ఎందుకంటే సంబంధిత వ్యక్తి వేలిముద్రలు ఉంటేనే అకౌంట్ యాక్సెస్ అవుతుంది.

ఇంకో విషయం ఏంటంటే మనం సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేటప్పుడు మన వేలి ముద్రలు కనిపించేలా ఉండి, వాటిని మన సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేస్తే.. వాటి ద్వారా మన వేలిముద్రలను తస్కరించే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు ఇది వరకే స్పష్టం చేశారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజలు ఎంతవరకు ఈ యాప్‌ను వాడుకలోకి తీసుకొస్తారో చూడాలి.  

No comments:

Post a Comment

.