Pages

Wednesday, March 22, 2017

పొగ కళ్లలోకి వెళ్లినపుడు కళ్లు మండుతాయి. ఎందుకని?

 ప్రశ్న: పొగ కళ్లలోకి వెళ్లినపుడు కళ్లు మండుతాయి. ఎందుకని?

జవాబు: పాక్షికంగా మండిన ఇంధనం వల్లనే పొగ వస్తుంది. 'నిప్పు లేనిదే పొగరాదు' అన్న సామెత సబబే అయినా నిప్పున్నంత మాత్రాన పొగ రావాల్సిన అగత్యం లేదు. నిప్పులకు సరిపడినంత ఆక్సిజన్‌ దొరికితే పొగ లేకుండానే నిప్పులు మండగలవు.
పచ్చిగా ఉన్న వంట చెరకు, తడిగా ఉండే బొగ్గులు, మలినగ్రస్తమైన తారు తదితర పెట్రోలియం ఇంధనాలు, ప్లాస్టిక్కులు, రబ్బరులు, కిరోసిన్‌ దీపాలు, గాలి సరిగా సరఫరా కాని కిరోసిన్‌ పొయ్యిలు, సిగరెట్లు, బీడీలు పొగల్ని బాగా ఇస్తాయి. ఆయా మండే పదార్థాల్లో ఉన్న రసాయనిక సంఘటనాన్ని బట్టి వచ్చే పొగలో ఉన్న పదార్థాల సైజు ఆధారపడుతుంది. మండే పదార్థాలు ఏమైనా వాటిలో పొగలో సాధారణంగా తేలికపాటి కర్బన రేణువులు, నత్రికామ్ల బిందువులు ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్‌ సరిపడా అందకపోతే ఇంధనంలో ఉన్న కర్బన పరమాణువులన్నీ కార్బన్‌డయాక్సైడుగా మారవు.
పొగ తెల్లగా ఉండటానికి ప్రధాన కారణం కర్బనరేణువులే.కర్ర, సిగరెట్టు వంటి ఇంధనాలలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ ఉంటుంది. ఇందులో ఉన్న నత్రజని సమ్మేళనాలు మండినపుడు వెలువడే నైట్రిక్‌ ఆక్సైడ్‌, హైడ్రోజన్‌ భాగం మండగా ఏర్పడే నీటి బిందువులతో కలిసి నత్రికామ్లము, నైట్రస్‌ ఆమ్లం ఏర్పడుతాయి. కర్బన రేణువుల మీద పాక్షికంగా జతకూడని ఎలక్ట్రాన్లు ఉంటాయి. వీటికి చర్యాశీలత చాలా ఎక్కువ. ఇటువంటి చర్యాశీలత అధికంగా ఉన్న కర్బన రేణువులు, సహజంగానే అవాంఛనీయమైన ఆమ్ల బిందువులు ఉన్న పొగ మన కళ్లను చేరినపుడు కంటి పొరల్లో ఉన్న జీవ కణాల్ని వాటి కార్యకలాపాల్ని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ అవాంఛనీయమైన రసాయనిక ప్రేరణలే నొప్పిగా, మంటగా మన మెదడు భావించి వెంటనే కన్నీటి గ్రంథుల్ని ప్రేరేపించి కన్నీళ్ల ధారలో మలినాల్ని, పొగలోని రసాయనాల్ని కడిగేయడానికి ప్రయత్నించడం వల్లే మనకు ఆ సమయంలో నీళ్లు కూడా కారుతుంటాయి. అవే ముక్కు ద్వారా కూడా వస్తాయి.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends

No comments:

Post a Comment

.