జై టెలుగు టళ్ళీ...!
తెలుగెక్కడుందిరా తెలుగోడా...!
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!
అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు
నాన్ననే డాడీకి డమ్మీని చేసావు
నీ బిడ్డ అఆలు దిద్దనే లేదు
తన భాష చదవడం రాయడం రాదు
తెలుగునే వెలి వేసె మన బడులు కూడా
తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడ
తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!
లేత మనసుల్లోన నీతులే ముద్రించు
శతకాలు అటకెక్కి చెద పట్టినాయి
బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమొనరించు
మన తెలుగు సామెతలు మంట గలిసాయి
రామాయణం లేదు...భారతం లేదు
భాగవత పద్యాల్లొ ఒకటైన రాదు
కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి?
కదలరే టీవీల చుట్టూత చేరి...!
మమ్మీకి ఎల్ కే జి ర్యాంకులే ముఖ్యం
డాడీకి లైఫులో విజయమే లక్ష్యం
తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!
మువ్వన్నె జెండాను తెగ ఊపుతున్నావు
దాన్ని చేసిన తెలుగువాడెవడొ తెలుసా?
వెండి తెర హీరోలు వీరులంటున్నావు
నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా?
గుడి గుడీ గుంచాలు...కోతి కొమ్మచ్చి
ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి
పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి
పెంచావు వీడియో గేమ్సుపై పిచ్చి
పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ
ఉనికినే మరచింది అది అసలు బాధ
తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!
కూడు పెట్టని భాష 'భాష ' కాదన్నావు
డాలర్లు తెచ్చేదె అసలు చదువన్నావు
తెలుగు పండగలన్ని మొక్కుబడి చేసావు
కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు
గ్లోబునే గెలిచాము చూడమన్నావు
తల్లి వేరును మటుకు తెగ నరికినావు
తెలుగు మొనగాణ్ణి అని తొడ చరిచినావు
తల్లి పేరడిగితే తెల్లబోయావు
నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా?
సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొందా!
తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!
ఓ మంచిమాట
*👉చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు అవాంతరాలు. మొదట విత్తనం మట్టిలో ఉండగానే చీమలూ, పురుగులూ తినేసేయాలని చూస్తాయి.అది వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేయాలని చూస్తాయి.ఆ తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులూ దాని పని పట్టబోతాయి. అయినా అది ఎదిగి పెద్ద వృక్షంగా మారిందంటే, ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాల్చుకుంటాయి.మనిషి ఎదుగుదలా సరిగ్గా ఇలాంటిదే..
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
No comments:
Post a Comment