Pages

Tuesday, July 11, 2017

కరెంటు తీగను తాకితే మనిషికి షాక్‌ కొడుతుంది. కానీ పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు. ఎందుకు?

ప్రశ్న: కరెంటు తీగను తాకితే మనిషికి షాక్‌ కొడుతుంది. కానీ పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు. ఎందుకు?

జవాబు: ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే స్తంభాలకు సాధారణంగా నాలుగు తీగలు ఉంటాయి. అందులో మూడు తీగల్ని ఫేజులు అని, ఒకదాన్ని న్యూట్రల్‌ అనీ అంటారు. ఒక ఫేజు తీగకు, మరో ఫేజు తీగకు మధ్య, ఒక ఫేజు తీగకు, న్యూట్రల్‌ తీగకు మధ్య విద్యుత్‌ పొటన్షియల్‌ ఉంటుంది. ఒక వ్యక్తిలోగానీ, వస్తువులో కానీ, జంతువులోగానీ విద్యుత్‌ ప్రవహించాలంటే దానికి అటూ ఇటూ విద్యుత్‌ పొటెన్షియల్‌ తేడా ఉండాలి. అంటే ఒక వ్యక్తికి షాక్‌ కొట్టాలంటే ఏకకాలంలో కనీసం రెండు తీగలతో అనుసంధానం ఉండాలి. అప్పుడు అధిక పొటెన్షియల్‌ ఉన్న తీగలోకి, అల్ప పొటెన్షియల్‌ ఉన్న తీగ నుంచి ఎలక్ట్రాన్లు ఆ వ్యక్తి ద్వారా ప్రయాణిస్తాయి. ఇలా ఎలక్ట్రాన్లు శరీరంలో ప్రవహిస్తేనే ప్రమాదం. మనుషులు కూడా కేవలం ఒకే తీగను పట్టుకుని వేలాడితే ఏమీ కాదు. నేలను చెప్పుల్లేకుండా తాకితేనో, లేదా రెండు వైర్లను ఏకకాలంలో తగిలితేనో ప్రమాదం. పక్షుల విషయానికి వస్తే అవి ఒకే సమయంలో రెండు తీగలపై వాలవు. కాబట్టి వాటి దేహం ద్వారా విద్యుత్‌ ప్రవహించదు. పొరపాటున అది అటొక కాలు, ఇటొక కాలు ఒకేసారి పెడితే షాకుకి గురవుతుంది. ఇలాంటి సంఘటనలు కూడా అడపాదడపా జరుగుతూ ఉంటాయి.


గురుత్వాక‌ర్ష‌ణ ఒకే బిందువు నుంచి ఎలా ప‌ని చేస్తుంది?*

*ప్రశ్న: వస్తువులు సౌష్టవాకారంలో వున్నా అసౌష్టవంగా వంకరటింకరగా వున్నా వాటి గురుత్వాకర్షణ ఒకే బిందువు (గరిమనాభి) నుంచి మాత్రమే పని చేయడమంటే ఎలా?*
*జవాబు :* 16వ శతాబ్దంలో గెలీలియో ప్రాయోగికంగా ఋజువు చేసేంతవరకూ పెద్ద వస్తువు (పెద్ద బరువు)ను, చిన్న వస్తువు (చిన్నబరువు)ను పైనుంచి ఒకేసారి వదిలితే పెద్ద వస్తువు ముందు కిందపడుతుందనీ, ఆ తరువాతే చిన్న వస్తువు పడుతుందని అందరూ నమ్మేవారు. నిజానికి వస్తువు రూపురేఖలు, సౌష్టవాసౌష్టవాలతో సంబంధం లేకుండా ఏ గ్రహం మీద కైనా వస్తువుల్ని పైనుంచి ఒకేసారి వదిలితే అన్నీ ఏకకాలంలోనే నేలమీద పడతాయి. ఇందుకు కారణం వస్తువుల ద్రవ్యరాశి (mass) తో పోల్చుకుంటే గ్రహాల ద్రవ్యరాశి చాలా కోట్ల రెట్లు ఎక్కువగా వుండటమే! తద్వారా వస్తువులు పడేపుడు వాటి వేగంలో కలిగే మార్పు (త్వరణం లేదా acceleration) ఒకే విధంగా వుంటుంది. అంటే ఓ వస్తువును భూమి మీద కొంత ఎత్తునుంచి వదిలితే మొదట దాని వేగం శూన్యమే అయినా ఒక సెకను తర్వాత అది తన వేగాన్ని సెకనుకు సుమారు 10 మీటర్ల మేరకు పెంచుకొంటుంది. అది అలా పెరుగుతూ రెండు సెకన్లు గడిపేటప్పటికి తన వేగాన్ని సెకనుకు సుమారుగా 20 మీటర్లకు పెంచుకొంటుంది. మూడు సెకన్ల తర్వాత (వదిలాక) దాని వేగం సెకనుకు సుమారు 30 మీటర్లు అవుతుంది. అంటే ప్రతి సెకనుకు సుమారు 10 మీటర్ల మేర వేగం పెరుగుతుందన్నమాట. ఈ 10 మీటర్లు/ సెకను2 ను భూమికున్న గురుత్వత్వరణం (acceleration due to gravity) అంటాము. దీనిని స్త్ర అనే అక్షరంతో చూపుతారు. వస్తువు ఏ రూపంలో వున్నా, ఏ ఆకారంలో వున్నా ఆ వస్తువులోని ప్రతి కణం, ప్రతి అణువు, ప్రతి పరమాణువు మీద భూమ్యాకర్షణత్వరణం ఇదే విలువతో ఒకే విధంగా వుంటుంది. కాబట్టి అన్ని బిందువులు ఒకే వేగంతో భూమి వైపు వెళతాయి (పడతాయి).
ఇలాకాకుండా ఒక బిందువు మీద ఎక్కువ త్వరణం, మరో బిందువు మీద తక్కువ త్వరణం వుండినట్లయితే ఆ వస్తువు తిరుగుతూ (ఎక్కువ వేగంతో పడుతున్న బిందువు వైపునకు) పడాలి. అదే నిజమయితే ఆ వస్తువును వేలాడదీసినపుడు అది పడకపోవడం వల్ల వేర్వేరు ప్రాంతాలలోని ద్రవ్యరాశి (m) వేర్వేరుగా వుండడం వల్ల ఆయా ప్రాంతాల ద్రవ్యరాశి మీద పనిచేసే బలం న్యూటన్‌ రెండవ సూత్రం ప్రకారం ఎస్త్ర అవుతుంది. అంటే వస్తువు తిరుగుతుంది. దీనినే బలభ్రమకం (moment of force)  అంటారు. వేలాడదీసిన దారాన్ని వస్తువులోని ఏ బిందువు దగ్గర తగిలించి వేలాడదీస్తే వస్తువు బలభ్రమకానికి లోనవదో (తిరగదో) ఆ బిందువునే ఆ వస్తువుకున్న గరిమనాభి (centre of gravity) అంటారు. ఆ బిందువు దగ్గర ఉన్న బలాలు సమతులనం (balance) చేసుకొని తటస్థ బలభ్రమకాన్ని శూన్యం చేస్తాయి. ఆకారంతో నిమిత్తం లేదు. ఇలాంటి తటస్థ బలభ్రమకాలకు ఓ బిందువు ప్రతి వస్తువుకు వుంటుంది. ఆ బిందువును ఆ వస్తువుకున్న గురుత్వ తత్వానికి మౌలిక ప్రతినిధిగా గరిమనాభి అంటారు.
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య
       సంపాదకులు,
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.








ప్రశ్న: *ఇసుకపై నడక అంత సులభంగా సాగదు. ఎందువల్ల?

జవాబు:* నిల్చున్న వ్యక్తి ముందుకు కదలాలంటే అతని ఒక కాలును వంచి గట్టిగా నేలను కొంత బలంతో తన్నాలి. అలా కాలితో నేలపై బలాన్ని ప్రయోగించడాన్ని చర్య అంటారు. న్యూటన్‌ మూడో గమన సూత్రం ప్రకారం *చర్యకు సమానమైన ప్రతి చర్య* ఉంటుంది. ఆ సూత్ర ప్రకారం వ్యక్తి తన కాలితో నేలపై ఎంత బలం ప్రయోగిస్తాడో, అంతే బలాన్ని నేల అతని కాలిపై ప్రయోగిస్తుంది. ఈ ప్రతి చర్య వల్ల ఆ వ్యక్తి ముందుకు కదులుతాడు.

ఇసుక నేలలో ఇసుక పొరలుపొరలుగా ఉంటుంది. దీనిపై నడుస్తున్న వ్యక్తి తన పాదంతో కలిగించే బలం ముందుగా ఇసుకలో పైనున్న పొరపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ పొర ఆ బలాన్ని తన కింద పొరపై చూపిస్తుంది. ఆ విధంగా వ్యక్తి ప్రయోగించే బలం ఇసుకలో ఉన్న అట్టడుగున ఉన్న పొరకు చేరడానికి కొంత సమయం పడుతుంది. ఆ బలంతో కొంత బలాన్ని ఇసుక పొరలు శోషించుకుంటాయి. అందువల్ల ఇసుకపై వ్యక్తి పాదం కలిగించే బలం కన్నా ప్రతి చర్యగా ఇసుక పొరలు అతడి పాదంపై కలిగించే బలం తక్కువగా ఉంటుంది. పైగా ఆలస్యం కూడా జరుగుతుంది. అదే గట్టిగా ఉండే నేలపై కాలితో చర్య కలిగించిన తక్షణమే దానికి సమానమైన ప్రతిచర్య కాలిపై కలుగుతుంది. ఆ విధంగా ఇసుకపై నడక అంత సులభంగా సాగదు.


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.