Pages

Wednesday, July 12, 2017

మహాకాళి బోనాలు

మహాకాళి బోనాలు


ప్రకృతి అంతా శక్తి సమన్వితం. పరమాత్మను జగన్నాథుడిగా, ప్రకృతిని జగన్మాతగా ఆరాధిం} సంప్రదాయం అనాదిగా ఉంది. మానవ జీవ వికాసం ప్రకృతి కరుణ వల్ల క్రమానుగతంగా కొనసాగుతోందని పలువురి ప్రగాఢ విశ్వాసం. అందుకే జగజ్జననిగా, మూల బ్రహ్మాత్మికగా, ఆద్యశక్తిగా ప్రకృతిని దర్శిస్తారు. సృష్టి, స్థితి, లయ కారకమైన ప్రకృతేశ్వరిని వివిధ రీతుల్లో ఆరాధిస్తూ సమాజం తన కృతజ్ఞతా భావం చాటుకుంటుంది.*_

జ్ఞానం, సంపద, శక్తి- ఈ మూడింటినీ ప్రకృతికి అధినాయకురాలైన అఖిలాండేశ్వరి అనుగ్రహిస్తోందని భక్తుల నమ్మకం. ఆ అమేయశక్తి పట్ల ఆదరాన్ని, ప్రేమాస్పద భక్తితత్పరతను వెల్లడించుకొనేందుకే వారు అమ్మతల్లికి ఉత్సవాలు, జాతరలు, కొలుపులు నిర్వహిస్తారు.*_

ప్రకృతి ఆకృతులైన విభిన్న కళలే గ్రామదేవతలు. ఈ మాతృశక్తి రూపాల్ని ఆషాఢ మాసంలో శ్రామికులు, కర్షకులు తమదైన సంప్రదాయ సంవిధానంలో సేవించుకుంటారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పచ్చదనం సర్వత్రా వెల్లివిరియాలని, ఆరోగ్య సౌభాగ్యాలు కొనసాగాలని కోరుతూ బోనాల్ని శక్తిరూపాలకు సమర్పిస్తారు. భక్తిచైతన్యం, సామాజిక సమైక్యత ప్రస్ఫుటమవుతాయి. జంటనగరాల్లో ఆషాఢ బోనాల సంబరం అంబరాన్ని తాకుతుంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి జాతరతో ఈ వైభవం పతాక స్థాయికి చేరుకుంటుంది.*_

సురిటి అప్పయ్య అనే భక్తుడు 1815లో ఉజ్జయినీ మహాకాళి విగ్రహాన్ని స్థాపించి, ఆలయం నిర్మింపజేశాడు. ఆ ప్రాంగణంలోని ఓ బావికి 1864లో మరమ్మతు చేస్తున్నప్పుడు, తవ్వకాల్లో మాణిక్యాలదేవి విగ్రహం లభించింది. ఆ విగ్రహంతో పాటు, అప్పటివరకు కొయ్య విగ్రహంగా ఉన్న మహాకాళి స్థానంలో ఒక రాతి విగ్రహాన్నీ ప్రతిష్ఠాపన చేశారు. అప్పటినుంచి మహాకాళి, మాణిక్యాలదేవి ‘జంట దేవతలు’గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆశ్రిత కల్పవల్లిగా భావించే మహాకాళి భక్తులు ఏటా బోనాలు సమర్పిస్తున్నారు. ‘నీ కృప వల్ల మేం సుభిక్షంగా ఉన్నాం. మమ్మల్ని ఇలాగే సర్వదా అనుగ్రహించు తల్లీ!’ అనే భావాన్ని వ్యక్తీకరించడమే బోనాలు, ఉపహారాల సమర్పణలోని ఆంతర్యం!

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి ఆషాఢ జాతర- ఘటోత్సవంతో ప్రారంభమవుతుంది. ‘ఎదుర్కోలు’గా వ్యవహరించే ఈ ప్రక్రియలో, ఓ కలశంలోకి అమ్మవార్ని ఆవాహన చేసి, పురవీధుల్లో మేళతాళాలతో వూరేగిస్తారు. ఘటోత్సవం తరవాత బోనాలు(అన్న పదార్థాలు) సిద్ధం చేస్తారు. ప్రత్యేక పాత్రలో బోనాల్ని నింపి, పసుపు కలిపిన జలపాత్రనూ తలపై ధరించి మహిళలు ఆలయానికి తరలి వెళతారు. జగదంబకు ఆ పదార్థాల్ని నివేదించి, ‘సాక బెట్టుట’ అనే వేడుక ద్వారా, తమ లోగిళ్లను చల్లగా చూడాలని తల్లిని వేడుకుంటారు. శాఖ- అంటే ఓ వేప కొమ్మను పసుపు కలిపిన నీటిలో ఉంచి, మహాకాళికి అభిషేకించడమే- ‘సాక బెట్టుట’. ఫలహారపు బండ్లు, గావు పట్టు, సాగనంపు రంగం వంటి ఘట్టాలతో, పోతురాజుల నృత్య విన్యాసాలతో మహాకాళి జాతర మహా భక్తితరంగితమవుతుంది.*_

‘కాకతి’మాతను ఇలవేల్పుగా పూజించిన కాకతీయులు, అమ్మతల్లికి ఆషాఢ ఉత్సవాలు నిర్వహించేవారు. గోల్కొండ కోటలోని జగదంబిక ఆలయాన్ని కాకతీయులు నిర్మించినట్లు చెబుతారు. బోనాల వేడుకలు ఏటా ఈ ఆలయం నుంచే ప్రారంభమవుతాయి.

ప్రకృతి శక్తి అనుగ్రహించిన అన్నం లేదా భోజనాన్ని తిరిగి భక్తిపూర్వకంగా ఆ అమ్మకు నివేదన చేయడమే ‘బోన సమర్పణం’. భోజనానికి రూపాంతరమే బోనం. భోజనం ద్వారా శక్తిని కలిగించే ఆ ‘దివ్య శక్తి’కి ధన్యవాదాలు తెలియజేసే జానపదుల ఆధ్యాత్మిక కార్యక్రమమే బోనాల సంబరం. దుర్గతి, దుఃఖం, దుస్సాధ్యం, దుష్టత్వం వంటి దుర్వికారాల్ని దూరంచేసే మాతృశక్తిని ఆషాఢ ఉత్సవ నేపథ్యంగా ఆరాధిస్తారు. ఈ జాతరలో జగదీశ్వరి అవతార తత్వం ప్రస్ఫుటమవుతుంది. ఘటోత్సవం- సృష్టి నిర్మాణానికి సంకేతం, వూరేగింపు- స్థితి కారకత్వానికి సూచిక. చివరలో సాగనంపు- లయానికి ప్రతిబింబంగా నిలుస్తుంది.
 డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.