Pages

Friday, July 29, 2016

నా పేరు మొగుడు.!



బడి పిలగాల్ల కత!

నా పేరు మొగుడు.!


ఒక ఊళ్లె ఒక ముసలమ్మ ఉండేటిది. ఆమెకో మనవడుండేటోడు. ఆడు మస్తు తెలివిగల్లోడు. మాటలతోని యెదుటోల్లని బోల్తాగొట్టిచ్చేటోడు!
ఒకనాడు ఆడు ముసలమ్మని చారానా అడుక్కొని మిటాయి దుకానానికివొయ్యిండు. దుకానపాయ్నె అప్పుడే లడ్డూలు జేసి అమ్ముతందుకు వెట్టిండు. పిలగాడు పైసలిచ్చి ఒక లడ్డూ గొన్కోని తిన్నడు. తిన్నంక దుకాన్ల ఉన్న అన్ని లడ్డూల్ని పొట్లంగట్టమన్నడు. పెద్ద గిరాకే వొచ్చిందని దుకానపాయ్నె సంబూరవడ్డడు.
నీ పేరేందిర పిలగా అని అడిగిండు పొట్లంగట్టుకుంట.
నా పేరు అప్పులోడు అనిజెప్పి పొట్లం దీస్కొని ఉర్కిండు ఆడు!
అయ్యో.. అయ్యో ఆడు నా లడ్డూలెత్కపోతుండు అంటూ దుకానపాయ్నె ఒక్కతీర్గ మొత్తుకుండు. జనమంత వొచ్చిండ్రు.
ఎవలెత్కపోయిండ్రని అడిగితే అప్పులోడని చెప్పిండు బుడ్డోడు!!
నువ్వు బాకీ ఉన్నవ్ గావట్టె ఆడు ఎత్కపోయిండు. దానికి ఎవలేంజేస్తరు? అన్కుంటా అందరూ ఆడికెల్లి పోయిండ్రు. పాపం దుకానపాయ్న నొత్తినోరు కొట్టుకుండు!

ఆ పోరడు పక్కూరికి పోయిండిగ.  శెరువుకాడ ఓ శెట్టుకింద గూసొని లడ్డూలు తినుడు మొదల్వెట్టిండు. శెరువుల బట్టలుతికేటోల్లు ఆన్నిజూసి.. గిన్ని లడ్డూలెక్కడివిరా బుడ్డోడా అని అడిగిండ్రు.
పక్కూల్లె మిటాయి దుకానపాయ్న పంచిపెడ్తుండు అని చెప్పిండు ఆడు!
ఇంతకూ నీ పేరేందిరా అని అడిగిండ్రు ఆ బట్టలుతికేటోల్లు.
నా పేరు గాలిదేవుడు అని చెప్పిండు ఆడు.!
జెర మా బట్టలు జూస్తుండు. మేంవొయ్యి ఆ లడ్డూలు దెచ్చుకుంటం అన్కుంట ఆల్లంతా పక్కూరికి ఉర్కిర్రు!
ఆల్లువోంగనే ఆ పోరడు ఉతికేసిన బట్టలన్నీ మూటగట్టుకొని అక్కడ్నుంచి ఉడాయించిండు!
ఎంతో ఆశతో పక్కూరికిపోయిన ఆల్లు అంత వట్టిదే అని అర్థంగాంగనే పిలగాని మీద కోపంతోని యెన్కకు మల్లిండ్రు!
తీరా వొచ్చి సూస్కుంటే యేవుందిగ?
అయ్యో అయ్యో మా బట్టలెత్కపోయిండ్రా దేవుడా అని యేడ్సుకుంట గూసుండ్రు!
ఆల్లీల్లు వొచ్చి ఎవలెత్కపోయిండ్రు అని అడిగితే గాలిదేవుడు అని చెప్పిండ్రు!
గాలొచ్చి బట్టలెగిరిపోతే ఎవలేంజేస్తరు? అన్కుంట వొచ్చినోల్లంతా పోయిండ్రు.
బట్టలుపోయినోల్లకు మొత్కునుడు తప్ప ఇంకేం మిలగలే!

ఆ పోరడు ఇంకో ఊరికి పోతుంటే నడ్మ కాల్వ అడ్డమొచ్చింది. అప్పట్కే ఆడ ఒక ముసలమ్మ ఆమె మన్మరాలు నిలవడి ఉన్నరు.
జెర నన్నూ.. నా మన్మరాలిని కాల్వ దాటియ్యవా పిలగా అని బతిలాడింది ముసలమ్మ.
ముందు మీ మన్మరాలిని దాటిస్త. ఆటెన్క నిన్ను దాటిస్త అని పల్కిండు ఆ బుడ్డోడు!
సరేలే యెట్లయితేంది? అన్కుంది ముసలామె!
ఇంతకూ నీ పేరేంది పిలగా అని అడిగింది ఆ పోరన్ని.!
నా పేరు మొగడు అని చెప్పి పిల్లని దీస్కొని కాల్వదాటి అట్లనే పొయ్యిండు ఆడు!
ఒడ్డుకాడ ఉన్న ముసలమ్మ జరిగింది అర్థం చేస్కొని.. నా పిల్లనెత్తుకపోయిండ్రో దేవుడా అని యేడ్సుకుంట గూసుంది.
జెనాలొచ్చి ఎవలెత్కపోయిండ్రని అడిగితే మొగుడు అని చెప్పింది.
ఆ పిల్లని ఆమె మొగుడేగా తీస్కపొయ్యింది. ఇంకెవడో ఎత్కపోయినట్టు ఏడుస్తవేంది? అన్కుంట ఆడికెల్లి పోయిండ్రు అందరూ!
ముసల్దానికి ఏంజెయ్యాల్నో తోయలేదు!
పిలగాడు ఆ పిల్లని యింటికి తీస్కపోయి పెండ్లిచేస్కొని సంతోషంగా ఉండవట్టిండు!!

No comments:

Post a Comment

.