Pages

Monday, December 26, 2016

చక్కని కధ

చక్కని ఎద్దు... కధ.. 


అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.

గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు.

ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, "పందెం అంటే పందెం" అన్నారు.

పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది.

గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- ఆ చికాకులో 'తను దానికి లాగమని చెప్పనేలేదు' అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను.

గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను.

"గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు. అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది!

దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: 'ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!'

గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది.

తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది!

గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం‌ ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు' అని.

చక్కని ఈ కథని మళ్ళీ ఓసారి చదవగలరని కోరుతూ...

జాగ్రత్తగా చూస్తే, పసి పిల్లలలో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది.

ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకొని సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి

ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.. సమాజంలో మార్పుకోసం కృషి చేయండి..





ధర్మం చేయండి బాబు


ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకొనేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని వాడు ఇల్లిల్లూ తిరిగి, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో చదువుకొనేవాడు.

ఒకరోజున, అలా అమ్మకానికి పోయినప్పుడు, అతనికి బాగా ఆకలి వేసింది. ఎండ విపరీతంగా ఉన్నది; నీరసంగా ఉంది; ఇక తిరగలేని పరిస్థితి. చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది. ఏంచేయాలి?

'అక్కడున్న ఇంటి తలుపుతట్టి, కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం' అనుకున్నాడు అతను. వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు- అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి, వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు- "ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా?" అని మాత్రం అడగ గల్గాడు.అయితే, పిల్లవాడి ముఖం‌ చూస్తే, 'వాడికి ఆకలిగా ఉంది' అని ఎవరైనా కనుక్కోగలరు. అందుకని ఆమె మంచినీళ్లకు బదులు, వాడికి ఒక పెద్ద గ్లాసెడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లవాడికి ప్రాణం లేచివచ్చినట్లైంది. సంతోషంగా గ్లాసెడు పాలూ త్రాగేశాడు- త్రాగేశాక మళ్ళీ గుర్తుకొచ్చింది- 'తన దగ్గర ఉన్నది ఒక్క రూపాయే!' అని.

పిల్లవాడికి చాలా సిగ్గు వేసింది. అయినా అడిగాడు, జేబులో‌చెయ్యి పెడుతూ- "మీకు ఎంత చెల్లించాలి?" అని.

"నువ్వు ఏమీ చెల్లించనవసరం లేదులే!"అన్నది ఆ యువతి నవ్వుతూ. "దయతో చేసిన పనికి ప్రతిఫలం తీసుకోకూడదట- మా అమ్మ చెప్పింది!" అన్నది.

పిల్లవాడి కళ్ళు చెమర్చాయి. "అయితే మీరు కనీసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వీకరించాలి" అని చెప్పి, వాడు అక్కడినుండి ముందుకు సాగాడు.

ఆ గ్లాసెడు పాలతో పిల్లవాడి ఆకలి అప్పటికి ఎలాగూ తీరింది- శారీరకంగా సత్తువ వచ్చింది. అయితే దానితోబాటు వాడి మనస్సూ మార్పుకు లోనైంది. మనిషిలోని మంచితనం పట్లా, దేవుని కరుణ పట్లా ఆ పసి హృదయంలో నమ్మకం ఒకటి, చిన్న విత్తనం మొలకెత్తినట్లు, మొలకెత్తింది. రాను రాను అది బలపడింది-
ఆ పిల్లవాడు పెద్దయ్యేసరికి, ఆ నమ్మకం అతనిలో వ్రేళ్ళూనుకున్నది.

చాలా సంవత్సరాలు గడిచాయి. రోజులు ఒకేలాగా ఉండవు. అప్పటి ఆ యువతి ఇప్పుడు పెద్దదైంది. ఏదో ప్రమాదకరమైన జబ్బుకు లోనై, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. స్థానికంగా ఉన్న వైద్యులకు లొంగలేదు ఆ జబ్బు. వాళ్ళు ఆమెను పట్టణానికి వెళ్ళి ప్రత్యేక వైద్యులకు చూపించమన్నారు. ఆమెను చేర్చుకున్న ఆసుపత్రి వాళ్ళు ఆమె సమస్యను పెద్ద డాక్టరు గారికి అప్పగించ దలచారు. ఆమె వివరాలున్న ఫైలును డాక్టరుగారి దగ్గరికి పంపించారు. ఆమె ఊరి పేరు చూసిన డాక్టరుగారు వెంటనే లేచి, ఆమెను చూసేందుకు బయలుదేరి వచ్చారు.

ఆమెను చూడగానే పెద్ద డాక్టరుగారికి కళ్ళు చెమర్చాయి. 'ఎలాగైనా ఆమెను రక్షించాలి' అని నిశ్చయించుకొని, ఆయన ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది- చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తర్వాత, చివరికి ఆమె తన జబ్బు నుండి బయటపడింది!

ఇక ఆమె ఇంటికి వెళ్ళవచ్చు- వెళ్ళేముందు ఆసుపత్రికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించటమే తరువాయి: ఎంత ఖర్చు అయ్యిందో‌మరి! ఆమెకు బిల్లు పంపించేముందు దాన్ని తనకోసారి చూపించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు పెద్ద డాక్టరుగారు. దాన్ని చూసిన తరువాత, ఆయన ఆ బిల్లు చివరలో ఏదో రాసి, ఆమెకు అందజేసారు.
ఆమె ఆ బిల్లును చూసేందుకు కూడా భయపడింది- ఎందుకంటే, ఆమెకు తెలుసు- అంత పెద్ద మొత్తాన్ని తను జీవితాంతం కష్టపడినా చెల్లించలేదు! అయినా చేసేదేమీ లేదు- ఆసుపత్రికి డబ్బు కట్టాల్సిందే! వణికే చేతులతో కవరును తెరిచిందామె... బిల్లు చివర్లో‌ రంగు ఇంకుతో వ్రాసిన అక్షరాలు ఆమెను ఆకర్షించాయి:

ఒక పెద్ద గ్లాసెడు పాలద్వారా ఈ బిల్లు మొత్తం పూర్తిగా చెల్లించబడింది.
సం/-

దయ కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలి. మన కరుణ, సహాయం చేసే గుణం తిరిగి మనకెలా అక్కరకు వస్తాయో ఎవ్వరమూ చెప్పలేము!

మనం ఏపంట వేస్తే అదే పంట కోస్తాం మనం పుణ్యంచేస్తే ఆ పుణ్యమే మనల్ని కాపాడు తుంది అదే పాపం చేస్తే అదే పాపం మనల్ని భక్షిస్తూంది అందుకే మనం ధర్మం చెస్తూ మన పిల్లల చేత కూడా ఈ ధర్మం చేయుస్తూ ఉండాలి అప్పుడు వారు ఎంత పెద్దవారైనా ధర్మం చేయుటం మర్చి పోకుండా ఉంటారు ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది.







అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలా సేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని, ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే ఆ ఆవును పైకి తీయడం అనవసరం ముసలిది అయినది అనుకున్నాడు.
అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు ఆ వ్యక్తి.
ఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.ఆతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది, తరువాత అరవకుండా ఉండిపోయింది. అమ్మయ్య ఆనుకున్నాడు.
కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నలబడి పైకి రాసాగింది.అతనికి,ఆతని పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది. ఆవు తెలివికి మెచ్చిన అతను,తన తప్పు తెలసుకొని, అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.

నీతి : ఈ ఆవులాగే మనమీద కుడా ఎంతో మంది దుమ్ము, మట్టి వేస్తుంటారు. కాని ఆ దుమ్మును, మట్టిని దులుపుకొని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు.







గొప్ప గుణం💦💭
💦💭రవి చంచల 💭💦

💦💥  కొడంగల్ పట్టణం లోని కోస్గి లో సుదర్శన్ ,మాదవరెడ్డి  ,  అనే ఇద్దరు వడ్డీ వ్యాపారం చేస్తూ జీవించేవారు. వారిలో సుదర్శన్ తక్కువ వడ్డీ తీసుకొని అడిగిన వారికి లేదనక అప్పులిచ్చి అవసరాలలో ఆదుకొంటుండేవాడు. ఎవరైనా ఇచ్చిన అప్పును సకాలంలో తీర్చకపోతే పీడించేవాడుకాదు. అందువల్ల ఆ ఊరి ప్రజలకు సుదర్శన్  అంటే చాలా ఇష్టం. కాని  మాదవరెడ్డి మాత్రం పరమలోభి. అధిక వడ్డీలు గుంజి లక్షలకు లక్షలు సంపాదించాలని కలలు కనేవాడు. అప్పులు తీర్చకపోతే వారు తాకట్టు పెట్టిన భూములు, నగలను, ఇండ్లను తిరిగి ఇవ్వక వారికి నిలువ నీడ లేకుండా చేస్తాడు. ఆ ఊరి ప్రజలు అతనిని లోభి అని, చండాలుడని చెప్పుకొనేవారు. ప్రజల్లో సుదర్శన్ కున్న  గొప్ప పేరును చూసి  అసూయపడేవాడు. ఎలాగైనా సుదర్శన్ ను  దెబ్బ తీయాలని అనుకున్నాడు. ఆ ఊరివారందరూ కలిసి ఒక రామాలయం కట్టించారు. ఆ ఊరి జమిందారు నారయణ ఇచ్చిన విరాళంతో నగలను చేయించారు. ఆ గుడి తాళాలను నిజాయితీ పరుడైన  సుదర్శన్కు  అప్పగించారు. అది చూసి ఓర్వలేని మాదవరెడ్డి మండిపడ్డాడు. అతను బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు.  సుదర్శన్ ఇంట్లో పనిచేసే రాజయ్యను రహస్యంగా కలిసాడు. ఎలాగైనా గుడి తాళాలను తెచ్చి ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆశ చూపాడు. మొదట్లో రాజయ్య దానికి ఒప్పుకోలేదు. కాని కుటుంబ అవసరాల వల్ల అతను ఆ పనికి ఒప్పుకున్నాడు.  గుడి తాళాలను పెట్టెలో పెట్టి సుదర్శన్ భద్రంగా వుంచాడు. రాజయ్య మాత్రం దానిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు.

ఒక రోజు  సుదర్శన్ భార్య నగల కోసం పెట్టె తెరచి మరలా దానికి తాళం వేయడం మరచి లోనికి వెళ్ళిపోయింది. అదే అదనుగా భావించి చాటున ఉన్న రాజయ్య ఆ పెట్టెను తెరచి గుడి తాళాలను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ గుడి తాళాలను  మాదవరెడ్డి చేతికిచ్చాడు. ఒకరోజు రాత్రి  మాదవరెడ్డి ఊరంతా గాఢ నిద్రలో ఉండగ గుడి తలుపులు తెరచి గర్భ గుడిలోనికి వెళ్ళాడు. అక్కడ దేవతలకు అలంకరించిన నగలను తీసి ఒక సంచిలో వేసుకొని అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. మరుసటి రోజు దేవుని నగలు దొంగిలించారన్న వార్త ఊరంతా పాకిపోయింది. గుడి తాళాలు సుదర్శన్ వద్ద ఉండగా దొంగతనం ఎలా జరిగిందోనని కొందరి మాటల్లో వినిపిస్తుంది. గ్రామ పెద్దవీరేశము  ఈ విషయాన్ని గూర్చి రచ్చబండ దగ్గర పంచాయితీ నిర్వహించారు. ఊరివారందరితో పాటు , సుదర్శన్ , మాదవరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు గ్రామ పెద్ద వీరేశము , సుదర్శన్ తో  తాళాలు నీవద్ద ఉన్నాయి. మరీ దొంగతనం ఎలా జరిగింది? దీనికి నీ సంజాయిషీ ఏమిటీ? అని ప్రశ్నించాడు. సుదర్శన్  గ్రామ పెద్ద వంక చూసి "అయ్యా! గుడి తాళాలను పెట్టెలో భద్రంగా ఉంచాను. రెండు రోజులుగా అవి కనిపించలేదు. ఎంత వెతికినా వాటి ఆచూకీ తెలియలేదు" అని బదులిచ్చాడు. "ఈ  మోసకారి, తానే నగలు కాజేసి ఏమి తెలియదన్నట్లు నటిస్తునాడు. తగిన శిక్ష వేసి చెరసాలలో వేయించండని  మాదవరెడ్డి చెప్పాడు.

గ్రామ పెద్ద  వీరేశముకు  , మాదవరెడ్డి మాటలపై నమ్మకం కలుగలేదు.  సుదర్శన్ నిజాయితీ పరుడని నమ్ముతున్నాడు. ఇందులో ఏదో మోసం జరిగింది. అది తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు గ్రామ పెద్ద -సుదర్శన్  ఇంట్లో పని వారందరిని పిలిపించాడు. వారికి తలోక ఉంగరాన్ని ఇచ్చి ఇవి మహిమ కలవని, ఒక మునీశ్వరుని వద్ద నుండి సంపాదించానని చెప్పాడు. దొంగతనం చేయని వారి ఉంగరం ధగ ధగ మెరుస్తుందని నమ్మబలికాడు. వాటిని మరుసటి రోజు తిరిగి ఇవ్వమని చెప్పి వారిని పంపించాడు. రాజయ్య తాను తాళాలు దొంగిలించిన విషయం బయటకు తెలియకుండా తనకు తెలిసిన కంసాలి వద్ద ఉంగరాన్ని మెరుగు పట్టించాడు. మరుసటి రోజు వారు ఆ ఉంగరాలను వీరేశము కు   అందజేసారు.  ఆ ఉంగరాలను పరిశీలించి రాజయ్య ఉంగరం మెరుస్తుండడం గమనించాడు. అయనకు దొంగ ఎవరో తెలిసిపోయింది. వెంటనే "రాజయ్య నిజం చెప్పు? నగలను ఎక్కడ దాచావ్? అంటూ వీరేశము గద్దించాడు. అది విని రాజయ్య గజగజ వణికిపోయాడు. అయ్యా! నగలను గూర్చి నాకేం తెలియదు. బుద్ది గడ్డి తిని గుడి తాళాలను మాదవ రెడ్డి చేతికిచ్చాను. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదని గ్రామ పెద్దను వేడుకొన్నాడు. రంగయ్య మాదవరెడ్డి తను చేసిన నేరం అందరికి తెలిసిపోయిందన్న విషయం గ్రహించి సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు గ్రామపెద్ద - " మాదవరెడ్డి నీవు స్వార్థంతో అతి పవిత్రమైన దేవుని నగలను దొంగిలించావు! నిజాయతీ పరుడైన సుదర్శన్ పై  నేరాన్ని మోపి దోషిగా అందరి ముందు నిలబెట్టావు! అందువల్ల నీకు కఠిన శిక్ష విధించి చెరసాలలో వేయించాలని తీర్పు ఇస్తున్నాను" అన్నాడు. అప్పుడు   మాదవరెడ్డిని  క్షమించి వదిలివేయమని సుదర్శన్ గ్రామపెద్దను వేడుకున్నాడు.  సుదర్శన్  మాట కాదనలేక వీరేశము  మాదవరెడ్డి ను మందలించి వదిలివేశాడు. అపకారికి కూడా ఉపకారం చేసే  గొప్ప గుణానికి అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు. , మాదవరెడ్డి, సుదర్శన్  చేతులుపట్టుకొని "అసూయతో చేసిన నేరానికి క్షమించమని" అడిగాడు.  "ఇప్పుడైనా నీలో మార్పు వచ్చింది! అంతే చాలు అన్నాడ సుదర్శన్. తర్వాత ఇద్దరు ఎన్నో గొప్ప పనులు చేసి ఆ ఊరిని బాగు చేసారు. 💥💦ఈ కథ రాసినవారికి వందనాలు 💦పోస్ట్ ::రవి చంచల










No comments:

Post a Comment

.