Pages

Monday, December 26, 2016

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఆన్‌లైన్ ప్రశ్నాపత్రం

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఆన్‌లైన్ ప్రశ్నాపత్రం

      
 పరీక్షలకు అరగంట ముందే ప్రశ్నాపత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేస్తారు. పరీక్ష పూర్తయిన గంటలోనే మూల్యాంకనం జరిగిపోతుంది. వెంటనే ఇంటర్‌బోర్డుకు మార్కులు అప్‌లోడ్ అయిపోతాయి. ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్ పరీక్షల నుంచే ఈ కొత్త విధానం అమలులోకి తేవాలని ఇంటర్‌బోర్డు యోచిస్తున్నది.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

ఇంటర్మీడియట్‌లో సైన్స్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలలో అక్రమాలకు చెక్ పెట్టాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రాక్టికల్ పరీక్షల విధానంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పరీక్షా కేంద్రాలకు ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నాపత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే.. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన గంటలోనే మూల్యాంకనం చేస్తారు. విద్యార్థులు సాధించిన మార్కులను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.

ఈ మేరకు టైం షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. బోర్డు నిర్దేశించిన సమయం ప్రకారం ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్ చేసుకోవడం, తిరిగి విద్యార్థులు పొందిన మార్కులను బోర్డుసైట్‌కు ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయనున్నారు. ఈ విధానాన్ని ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నుంచే అమలుచేయనున్నట్టు తెలంగాణ ఇం టర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్ లో నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలలో ఒక సబ్జెక్టు కోసం ఈ విధానాన్ని అమలుచేశామని, అది విజయవంతమైందని బోర్డు అధికారులు
ధృవీకరించారు. అదే స్ఫూర్తితో రెగ్యులర్ పరీక్షలలో కూడా అమలు చేయాలని బోర్డు నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

నేరుగా ఎగ్జామినర్‌కే ప్రశ్నాపత్రం

రాష్ట్రంలో ప్రాక్టికల్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు ఒక ఎగ్జామినర్‌ను నియమిస్తారు. వారికి ప్రాక్టికల్ ప్రశ్నాపత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా పంపిస్తారు. అందుకోసం ఎగ్జామినర్‌కు వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) ఇస్తారు. ఓటీపీ నంబర్ అప్‌లోడ్ చేసినవారికి మాత్రమే ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించిన గంటలోపే మూల్యాంకనం పూర్తిచేయాలి. విద్యార్థులు సాధించిన మార్కులు వెంటనే తిరిగి ఇంటర్‌బోర్డుకు ఆన్‌లైన్ ద్వారా పంపించాలి.

ఈ మేరకు బోర్డు నిర్దేశించిన సమయంలోనే మార్కుల వివరాలు అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత సర్వర్ పనిచేయదు. విద్యార్థుల మార్కులు అప్‌లోడ్ కావు. ఈ క్రమంలో విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఎగ్జామినర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ప్రిన్సిపాళ్లకు ఈ విధానంపై ఇప్పటికే అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. పరీక్షల ముందు మరోసారి ఎగ్జామినర్లకు అవగాహన కల్పించాలని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

ప్రతిభకు న్యాయం ```

దీనివల్ల దాదాపు 2.50 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రతిభావంతులు నిజాయితీగా మార్కులు పొందడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. డబ్బులకు మార్కులు అమ్ముకునే విధానం ఇకనుంచి ఉండదని అంటున్నారు. ఈ క్రమంలో మార్కుల విధానంలో గందరగోళం సృష్టించడంతో పాటు ప్రతిభ గల విద్యార్థులకు ఇకనుంచి అన్యాయం జరుగదన్న భావన వ్యక్తమవుతున్నది. అక్రమాలకు చెక్ పెట్టడం, విద్యార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా అన్‌లైన్ ప్రశ్నాపత్రం పంపిణీ ప్రక్రియను తాము స్వాగతిస్తున్నామని ప్రభుత్వ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ మధుసూధన్‌రెడ్డి అన్నారు.

ఈ మేరకు ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని జంట కార్పొరేట్ విద్యాసంస్థల తీరు వల్ల ప్రాక్టికల్ పరీక్షలు చాలా గందరగోళంగా తయారయ్యాయి. ఎగ్జామినర్లను మభ్యపెడుతూ.. తమ విద్యార్థులకు కావాల్సిన మార్కులు వచ్చేలా కొందరు తెరవెనుక కుతంత్రాలు చేసేవారు. ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నాపత్రం పంపిణీ, ఆన్‌లైన్‌లో మార్కుల అప్‌లోడ్ వల్ల ఇక జంట కార్పొరేట్ సంస్థల అరాచకాలకు తెరపడినట్టేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.  

No comments:

Post a Comment

.