Pages

Sunday, May 28, 2017

పుస్తకాలు లేకపోతే అది ఇల్లే కాదు

పుస్తకాలు లేకపోతే అది ఇల్లే కాదు


పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదు. మొబైలే సర్వస్వం కాదు. ఇంటర్నెట్‌ సకలం అందించదు. సరికొత్త చూపు కోసం చదువు మాత్రమే ఉపకరణం. నూతన ఆలోచనలకు అధ్యయనమే మార్గం. అందుకే ప్రతి నెల మనం ఏం చదివామో ఒకసారి బేరీజు వేసుకోవాలి. ఇది నెలాఖరు సమయం. ఈ నెలలో ఇప్పటివరకు ఏం పుస్తకాలు చదివారో పరిశీలించుకోవాలి. ఒక జాబితా తయారు చేసుకోండి. 'పుస్తకాలు లేని ఇల్లు దయ్యాల కొంప వంటిది' అన్నారో సిసిరో అనే తత్వవేత్త. అందుకే పుస్తకాలు లేకపోతే అది ఇల్లే కాదు. కనుక మీకు ఇష్టమైన పుస్తకాలేవో మీ ఇంట్లో ఉండాలి. ఏ రంగానికి సంబంధించిన వారయినా, తమ అభిరుచులకు అనుగుణమైన పుస్తకాలు మీ ఇంట ఉండాలి. ప్రతి ఆదివారం ఓ స్పెషల్‌ వంటకాన్ని తిన్నట్టుగానే ప్రతివారం ఓ కొత్త పుస్తకం చదవాలి.
పాత పుస్తకమైనా బాగా ఇష్టమైన పుస్తకాన్ని మరల మరల చదవాలి. బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవల వడ్డెర చండీదాస్‌కు నిత్య పారాయణ గ్రంథం. చాలామంది శ్రీశ్రీ, తిలక్‌, బైరాగి, వజీర్‌ రెహమన్‌, శివసాగర్‌ వంటి కవుల పుస్తకాల్ని అప్పుడప్పుడు చదువుతుంటారు. విన్న పాటనే పదే పదే ఇష్టంగా విన్నట్టు, చదివిన పుస్తకాన్నే మరల చదవడం ఓ వినూత్న అనుభవం. ఇలా మీకు ఇష్టమైన పుస్తకాలు మీ ఇంట ఉండాలి. చలం 'మ్యూజింగ్స్‌' కూడా ఇలాంటి పుస్తకమే. చదివిన ప్రతి పర్యాయం ఓ కొత్త అనుభూతినీ, కొత్త ఆలోచననీ ప్రోది చేస్తుంటుంది.
జీవితచరిత్రలు గొప్ప స్ఫూర్తినిస్తాయి. ఉత్తేజాన్ని అందిస్తాయి. మన పూర్వులు జీవించిన కాలాన్ని, జీవితాన్ని మన ముందు దర్శింపజేస్తాయి. ఒకనాటి మనుషుల అనుభవాల పరంపరని రూపు గట్టిస్తాయి. ఆ వెలుగులో మన జీవితాల్ని మరింత మెరుగు పరుచుకోడానికి తోడ్పడతాయి. మనుషుల్ని మరింత మానవీయంగా మార్చే క్రమానికి దోహదం చేస్తాయి. అందువల్ల పుస్తకాల్ని చదవాలి. అరుదైన మంచి పుస్తకాల్ని వెదుక్కొని మరీ చదవాలి.
తెలుగులో, ఇంగ్లీషులో క్లాసిక్స్‌ అన్నీ చదవాలి. ఎవరి వృత్తి వ్యాపకాలు ఎలా వున్నా తెలుగులో 100 గొప్ప పుస్తకాలు చదవాలి. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలు చదవడమే కాదు, వాటిని ప్రశ్నించే పుస్తకాల్ని సైతం అధ్యయనం చేయాలి. మన ప్రాపంచిక దృక్పథం విస్తృతం కావడానికి చదువే ఆధారం. అందుకని ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్‌ చేసుకోవాలి. పుస్తకాలు చదవకుండానే వారాలు, నెలలు గడిచిపోతే కాలాన్ని వృధా చేస్తున్నట్టే. 2017లో అయిదో నెల కూడా గడిచిపోతోంది. ఈ అయిదు నెలల కాలంలో ఏం చదివారో గుర్తు చేసుకోండి. కనీసం జూన్‌లో ఏం చదవాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాల జాబితా ఒక డైరీలోనో, మొబైల్‌ నోట్‌బుక్‌లోనే రాయండి. ఎందుకంటే చదవడానికి సైతం ప్లాన్‌ చేసుకోవాలి. లేదంటే కాలం మన మీంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. మనం మాత్రం నిలువనీరులా ఉండిపోతాం. ప్రవాహగుణాన్ని కోల్పోతాం. నిత్యం చదువుతున్న వారే ప్రవాహశీలతని సంతరించుకుంటారు. తద్వారా తమ జీవితాన్ని సృజనాత్మకంగా మలుచుకుంటారు. ప్రపంచ గమనాన్ని ఆకళింపు చేసుకుంటూ బతుకును సౌందర్యమయం చేసుకుంటారు. అందుకే పుస్తకాలు చదవడం దైనందిన జీవితంలో అంతర్భాగమై ఉండాలి.

No comments:

Post a Comment

.