Pages

Sunday, June 11, 2017

మేకపోతు గాంభీర్యం

మేకపోతు గాంభీర్యం

“అహమేకశత వ్యాఘ్రాన్/ పంచ వింశతి కుంజరాన్
ఏక సింహం నభక్ష్యామి/ గడ్డం వపనముత్యతే”

ఈ సంస్కృత చాటువు మనందరికి తెలిసిన “మేక పోతు గాంభీర్యం” అనే తెలుగు సామెతకు సంబంధించిన కథ. ఈ కథ తెలుగువారి ఇంటింటి సరస్వతి అయిన  “పెద్దబాలశిక్ష” లో  ఉంది.  లోపల బెరుకు,బైట కరుకు,కలిగి డాంబికంగా మాట్లాడేవారి విషయంలో ఈ సామెతని ఉపయోగిస్తారు. “వాడు చూడండి ఎలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడో” అని.
ఇదీ కథ :
ఒక కొండ పరిసరాలలో మేస్తున్న తెలుగు మేకల మందలోంచి ఒక మేకపోతు వేరుపడిపోతుంది. తెలుగు మేక  అని ఎందుకన్నానంటే ఆ శ్లోకంలో గడ్డమనే తెలుగు పదం ఉండుటవల్ల. అదే సమయంలో వాన వస్తుంది. వాన నుంచి తప్పించుకోవాలని అది ఒక గుహలోకి వెళ్తుంది. వెళ్ళిన తరువాత తెలిసింది అది సింహపు గుహ అని.బహుశా జంతు కళేబరాలనుచూసివూహించుకొనివుంటుంది . అదృష్టవశాత్తు అప్పుడు సింహం గుహలో లేదు. కొంత సమయం గడిచిన పిదప సింహం గుహలోనికి  వచ్చింది. లోపల వేరే జంతువు వున్నట్లు తెలుసుకొని ప్రాణభయం తో గుహ  బైటే నిలిచింది . లోపల ఉన్న మేకపోతు సింహాన్ని చూసి భయాన్ని దిగమ్రింగి  గడ్డం మాత్రం సింహానికి కనబడేటట్టు గుహ బైటికి పెట్టి ద్వారము వద్ద నున్న సింహంతో వచ్చీ రాని సంస్కృతం లో  పై శ్లోకం  చెప్పింది.  దాని అర్థం ఈ క్రిది విధంగా వుంది :(తాత్పర్యం వ్రాస్తున్నాను)
నేను ఇప్పటికి ఒక నూరు పెద్ద పులులను ఇరవైఐదు ఏనుగులను తిన్నాను ఇంకా ఒక సింహాన్ని తిని గాని ఈ గడ్డం గీయించుకోనని ప్రతిన బూనినాను. సమయానికి నీవు వచ్చినావు అని అన్నది.
ఆ మాటలు విన్న సింహం  భయపడి తోక ముడుచుకొని పారి పోయింది . “బ్రతుకుజీవుడా” అనుకొని మేకపోతు కూడా అక్కడి నుంచి పారిపోయింది .
కాబట్టి మేకపోతు గాంభీర్యము మనిషికి అవసరమే కానీ ఆచరణలో దానిని ఉంచేటపుడు తగిన ధైర్యము సమయస్పూర్తి ఎంటొ అవసరము. అందుకే భర్తృహరి (ఏనుగు లక్ష్మణ కవి తెలుగు సేత)
ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్
భూప సభాంతరాళమున బుష్కల వాక్చతురత్వ మాజి బా
హాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాం
ఛాపరివృత్తియున్ ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికిన్  

అన్నాడు. ఇది నేడు వ్యక్తిత్వ వికాసమునకు (personality Development) అన్నపేరుతో చెప్పే ఎన్నోసూత్రములు ఈ పద్యములో ఇమిడి వున్నాయి.
ఆపదలో ధైర్యము, అన్యసంపద మీద ఆశ, సభాగోష్ఠులలో వాక్చాతుర్యము, యుద్ధములైతే బాహుబలము  అంటే ఇక్కడ వాగ్యుద్ధాలే కాబట్టి తార్కిక వాదనాపటిమ, ఋజుమార్గములో కీర్తి గాంచవలెనను తపన, నిరంతర జ్ఞాన సముపార్జన సజ్జనుల లక్షణము .
ఇంతకన్నా స్పూర్తి దాయకమైన మాట ఏముంటుంది చెప్పండి.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.