Pages

Saturday, June 17, 2017

అన్నము .... ధాన్యాలు

అన్నము .... ధాన్యాలు


మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతిలో దేశం మొత్తం మీద ఒక్క తెలుగు వాళ్ళేఅన్నాన్ని తింటున్నారు. ఉత్తరాది వారికి రోటీలే అన్నం. దక్షిణాదిలో తమిళ, కన్నడ మళయాళీలు సాంబారు ప్రధానంగా ఉండే సాపాటు తీసుకుంటారు. వరి అన్నం తెలుగు వారికి ప్రధాన ఆహారం. వరి అన్నానికి కేలరీలు ఎక్కువ కాబట్టి, వరికి బదులుగా రాగి, జొన్న, సజ్జ, ఆరికెలు ఇలాంటి ఆహార ధాన్యాలతోనూ అన్నం వండుకోవచ్చు.

అన్నాన్ని తినాల్సిన పద్దతి ఆయుర్వేద గ్రంథాల్లో వివరంగా ఉంది. కఠినంగా అరిగే పదార్థాలను మొదటగానూ, మృదువైన పదార్థాలను మధ్యలోనూ, ద్రవ పదార్థాలను చివరగానూ తినాలని భావప్రకాశ వైద్యగ్ర౦థ౦లో పేర్కొన్నారు. తెలుగు వారి అన్నం తినే పద్ధతి ఇలానే ఉంటుంది. కూర, పప్పు, పచ్చడి, పులుసు, చారు, మజ్జిగ ఈ వరుసలోనే మనం భో౦చేస్తున్నాం. కాశీ మొదలైన ఉత్తరాది ప్రా౦తాల ప్రజలు నెయ్యీ, నూనెలు కలిగిన రొట్టెలు ము౦దు తిని, ఆ తరువాత అన్నంతో మృదువైన పప్పు, పచ్చడి, ద్రవరూపమైన ఆహార పదార్థాలు తింటారని కూడా ఈ వైద్య గ్రంథంలో ఒక వివరణ కనిపిస్తుంది. ఇటీవల కొన్ని హోటళ్ళవాళ్ళు భోజనానికి ము౦దు పూరీ లేదా పుల్కా ఇచ్చి ఆ౦ధ్రాభోజనం అని పిలవటం మొదలు పెట్టారు. ఇది అన్యాయ౦. తెలుగువాళ్ళకు పూరీ చపాతీలతో అన్నం తినే అలవాటు లేనే లేదు.
అన్నం విషం అనేది అబద్ధం. అన్నానికి బదులుగా ఇడ్లీ, అట్టు, పూరీ, బజ్జీ, పునుగుల్ని తేలికగా అరిగే అల్పాహారంగా అపోహపడి, అన్నం కంటే వాటినే అధికంగా తింటున్నాం. అన్నం విషయంలో మనం కొంత ఆలోచన చేయాల్సి ఉంది. బియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఆరికలు ఇంకా ఇతర తృణధాన్యాలను సద్వినియోగ పరచుకోవటం మీద మన తెలివి తేటలు ఆధారపడి ఉన్నాయి.

అన్నం వలన ఆయువు, వీర్యపుష్టీ, బలం, శరీరకాంతి, పెరుగుతాయి. దప్పిక, తాపం, బడలిక, అలసట తగ్గుతాయి. ఇంద్రియాలన్నీ శక్తిమంతం అవుతాయి. బియ్యాన్ని దోరగా వేయించి వండితే తేలికగా అరుగుతుంది. జ్వరంలో కూడా హోటల్ టీఫిన్లకన్నా జావ, లేదా మెత్తగా ఉడికించిన అన్నమే మంచిది. ఆయుర్వేద శాస్త్రంలో జ్వరం వస్తే అన్నానికి బదులు ఇడ్లీ పెట్టాలని చెప్పలేదు. ఉదయం పూట మెతుకు తగలకూడదంటూ రోజూ టిఫిన్లను తినటం జీర్ణకోశాన్ని దెబ్బ కొట్టుకోవటమే అవుతుంది.

రాత్రిపూట వండిన అన్నంలో పాలు పోసి తోడుపెట్టి ఉదయాన్నే తింటే, చిక్కి శల్యమైపోతున్న పిల్లలు ఒళ్ళు చేస్తారు. తిన్నది వంటబట్టని అమీబియాసిస్ వ్యాధి, గ్యాస్ట్రయిటిస్ అనే పేగుపూత వ్యాధి తగ్గుతాయి. వేయించిన బియ్యాన్ని వండిన అన్నంలో మజ్జిగ పోసుకుని తింటే, విరేచనాల వ్యాధిలో ఔషధంగా పని చేస్తుంది.వాము కలిపిన మజ్జిగ పోసుకొని అన్నం తింటే శరీరంలోని విషదోషాలకు విరుగుడుగా ఉ౦టు౦ది. ఆయా ధాన్యాలను బట్టి కొద్దిగా హెచ్చు తగ్గులున్నప్పటికీ రాగి, జొన్న సజ్జ, గోధుమలతో వండిన అన్నాలకు కూడా ఇవే లక్షణాలు ఉ౦టాయి.

అల్ల౦+ఉప్పు గానీ, మిరియాలు+ఉప్పుగానీ, ధనియాలు+జీలకర్ర+శొ౦ఠి గానీ మెత్తగా నూరిన పొడిని మొదటి ముద్దగా తినటం తెలుగు వారి సా౦ప్రదాయ౦. విందుభోజనాల్లో మొదట లడ్డూని వడ్డించినా దాన్ని మధ్యలో గానీ చివరికి గానీ తినడం మన పద్ధతి. వడ్డనంతా పూర్తయ్యాకే తినడం మానేసి, వడ్డించింది వడ్డించినట్టుగా తినే అలవాటు వలన స్వీటుతో భోజనం ప్రారంభించే అలవాటు కొత్తగా సంక్రమించింది మనకి! భోజనం చివరి భాగంలో కఫం పెరుగుతుంది కాబట్టి,కఫాన్ని తగ్గించే పచ్చకర్పూరం, లవంగం వగైరా వేసిన తాంబూల సేవనతో తెలుగువారి భోజన ప్రక్రియ ముగుస్తుంది. తమలపాకులకు ఔషధంలోని సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) శరీర ధాతువులకు అందించే గుణం ఉంది. దీన్ని సర గుణం (వ్యాపించటం) అంటారు.

DONT WASTE FOOD.
GOOD NIGHT FRIENDS.

No comments:

Post a Comment

.