చరణకింకిణులు-సినారె
సినారె పేరు తలవగానే గురుతొచ్చే మధుర సమాస బంధుర గేయం 'చెల్లెలి కాపురం' చిత్రంలోని 'చరణకింకిణులు' పాట.
ఈ చిత్రంలోని నాయకుడు ఓ అమాయకుడైన కవి. తన చెల్లెలి పెళ్ళి చేయడానికి తన కవితలను పబ్లిషర్లకిచ్చి ఆ వచ్చే డబ్బును ఉపయోగించుకుందామనే ఆశతో పట్నం వస్తాడు.పట్నం వచ్చాక గాని అసలు విషయం బోధపడదు. ఓ మోసగాడి చేతిలో కీలుబొమ్మవుతాడు. అదీ చెల్లెలి కోసం!
నాయిక అసలు విషయం పసిగట్టేస్తుంది.అసలు కవిని బయటపెట్టటానికి ఓ ఛాలెంజ్ విసురుతుంది.
ఆ సందర్భంలో పాట ఇది.
నాయిక నృత్యధర్మంగా కాళ్ళు కదిలిస్తుంది. గజ్జె ఘల్లుమనిపిస్తుంది. వెంటనే కవి వేగంగా స్పందిస్తాడు......
'చరణకింకిణులు ఘల్లుఘల్లుమన
కరకంకణములు గలగలలాడగా
అడుగులందు
కలహంసలాడగా
నడుములో తరంగమ్ములూగగా
వనీలకచభర విలాసబంధుర తనూలతిక చంచలించిపోగా
ఆడవే మయూరీ
నటనమాడవే మయూరీ'
నర్తకి పదవిన్యాసాలకు తగిన పదాలతో పాదాలల్లి
సంగీతనృత్యభారతి పాదాలకు సమర్పించాడు సినారె.
ఇక్కడ మనకు ఓ చిన్న సందేహం వస్తుంది. నృత్యం చేసేది మగ నెమలి ఆడ నెమలి కాదు. మరి కవి సమయాలు బాగ తెలిసిన సినారె ఎందుకిలా రాశారు. అప్పటికే 'నాట్యమయూరి' లాంటి పదప్రయోగాలుండడం, నాట్యానికి స్త్రీత్వానికి ఉన్న అవినాభావ సంబంధం దృష్ట్యా స్త్రీ వాచకంగానే ప్రయోగించానన్నారు సినారె.
'నీ కులుకును గని నా పలుకు విరియ
నీ నటనను గని నవకవిత వెలయగా
ఆడవే మయూరీ'
కథా సన్నివేశం నటనకు తగ్గ కవిత కాబట్టి నీ కులుకుకు తగ్గ కవితనే విరియజేస్తానన్నాడు నాయకుడు. సాత్వికంగానే ప్రారంభించి మెల్లమెల్లగా కరుణ రసం చిలికించి ఇక రౌద్రరసాన్ని పలికిస్తాడు. రౌద్రానికి అనువైన సంస్కృత సమాసాలను అలవోకగా అవలీలగా గుప్పించేశాడు సినారె.
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్
ప్రమధగణం కనిపించగా
ప్రమధనాథ కరపంకజ భాంకృత ఢమరుధ్వని వినిపించగా
ప్రళయకాల సంకలిత భయంకర
జలధరార్భటుల చలిత దిక్తటుల
చకిత ధిక్కరుల వికృతఘీంకృతుల
సహస్రఫణ సంజనిత ఫూత్క్రతుల----'
ఒక్కసారిగా సినారె లోని కవి సుడిగాలిలా బయటపడిపోయాడు. వినేవాళ్ళకు ఏమీ అర్ధం కాకపోయినా ఒక్క ముక్క పలకలేకపోయినా సరే మనలనందరినీ కైలాసశిఖరాన ప్రమదుల మధ్యన లయతాండవాన్ని చేస్తున్న పరమశివుని సన్నిధిని చేర్చేశాడు సినారె.
ఆయనే వేరే పాటలో చెప్పినట్టు 'ఏ కొండ కొమ్ముపైనో దైవమ్ము దాగెనంటూ తపియించనేల' చందాన మనందరికీ శ్రమ లేకుండానే కైలాసాన్ని చూపించేశాడు. కవి సమర్ధుడైతే ప్రేక్షకుడ్ని ఎక్కడికైనా తీసుకుపోగలుగుతాడు.
ఈ చరణంలో ప్రతీ సుదీర్ఘసమాసానికి మధ్యన కొంత విరామముంది. నర్తకి భావాన్ని అభినయించడానికి! మరి పందెం నెగ్గాలంటే నర్తకి తడబడాలి. అలా చెయ్యాలంటే నర్తకిని ఊపిరి సలుపనీయకూడదు.
అందుకే ఎలా విరుచుకు పడుతున్నాడో చూడండి ...
'కనులలోన కనుబొమలలోన
అధరమ్ములోన వదనమ్ములోన
గళసీమలోన కటిసీమలోన
కరయుగములోన పదయుగములోన
నీ తనువులోని అణువణువులోన
అభినయించి ఇక
ఆడవే..ఆడవే..ఆడవే..'
చివరివరకూ పదాలకు సరిసమానంగా అభినయించిన నర్తకి ఈ పదాల ఉప్పెనకు తట్టుకోలేక పోయింది. గజ్జెలొదిలేసింది...దాసోహమంది.
సినిమాపరంగా ఎలాగున్నా సినారె పదచాలనానికి లోకం దాసోహమంది. సినిమా ప్రజాహృదయాలలో హత్తకు పోయింది.
ఇక్కడ ఇంకొన్ని ముచ్చట్లు:
ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయన కెరీర్ కు మైలురాయి. సంస్క్రత సమాసాలను ఘంటసాల తప్ప వేరెవరూ పలకలేరు అనుకుంటున్న ఆ తరుణంలో బాలుగారు ఈ పాటతో అటువంటి ఆలోచనలను పటాపంచలు చేశారు. ఈ సంస్కృత సమాసాలను ముందుగా సినారె చేత అనిపించి రికార్డ్ చేసి తరువాత బాలుగారి చేత పాడించారట! సినారె గారి కంఠం పలుకులు ప్రముఖ నటుడు ఈ చిత్రనిర్మాత
అయిన బాలయ్య గారి దగ్గర ఉన్నాయట!
వాటిని శ్రోతలకు అందిస్తే బాగుణ్ణు!!!
జయహో సినారె!
జయజయహో సినారె!!!
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
No comments:
Post a Comment