Pages

Wednesday, June 7, 2017

ప్రేమ్‌చంద్ కథ "కఫన్" - ఒక విశ్లేషణ

ప్రేమ్‌చంద్ కథ "కఫన్" - ఒక విశ్లేషణ

ప్రేమ్‌చంద్ పేరు భారతదేశంలో చాలా మందికి తెలుసు. ఆయన సాహిత్యం తెలుగులోకి కూడా విరివిగా అనువాదమయింది. 1880లో పుట్టిన ప్రేమ్‌చంద్ 1936లో తన 56 ఏళ్ల వయసులోనే మరణించారు.ప్రేమ్‌చంద్ 1936లో రాసిన కఫన్ కథ.
- కథకుడిగా నెమ్మదిగా ఎదుగుతూ వచ్చి పరిణతి సాధించిన మేధావి ప్రేమ్‌చంద్. దేశమంతా ఉన్నట్టు గానే ప్రేమ్‌చంద్ కాలం నాటి హిందీ సాహిత్యం కూడా మబ్బుల్లోనే విహారం చేస్తుండేది. ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా కథను కిందకి దించి నేలమీద నడిపించిన రచయిత ప్రేమ్‌చంద్. పేద రైతులూ కూలీలూ గ్రామీణ జీవితం… వీటి మీద ప్రేమ్‌చంద్ దృష్టి పెట్టారు. దేశానికి స్వాతంత్యం రావాలంటే గాంధీ నాయకత్వం అవసరమని నమ్మి, తను గాంధీ శిష్యుడినని చెప్పుకున్నారు. కానీ గాంధీ చెప్పిన ధర్మకర్తృత్వం – ధనికుడు తన డబ్బుకి సొంతదారుడిగా కాదు ధర్మకర్తగా వ్యవహరించాలి – అనే కీలకమైన చిక్కుముడి దగ్గర గాంధీని ఒప్పుకోలేదు ప్రేమ్‌చంద్. అలాగే మతం, ఆచారాలు గ్రామీణుల అమాయకత్వం మీద ఆడుకుంటున్నాయని కూడా గ్రహించారు. ఉత్తర భారతదేశంలో భూమి, డబ్బు, చేతుల్లో ఉన్నవాళ్ళు వడ్డీ వ్యాపారం లోకి దిగి పేదలను పీడించడం, మతాచారాల పేరుతో అజమాయిషీ, వాటి ప్రకారం నడచుకోకపోతే నరకానికి పోతామనే నమ్మకంతో ఉండే అమాయకమైన రైతులూ… ఇలాటివాళ్ళంతా ఉన్న గ్రామీణ సమాజాన్ని చూశారు ప్రేమ్‌చంద్. జమీందార్లూ దోచుకునేవాళ్ళూ లేని గ్రామీణ భారతం కావాలని ఆశించారు. రైతులు పటిష్టంగా ఉండే భారతదేశం కావాలని కోరుకున్నారు.
- కఫన్ కథను ప్రేమ్‌చంద్ 1936లో రాశారు. కథ క్లుప్తంగా గుర్తు చేస్తాను. ఒక ఊర్లో ఇద్దరు తండ్రీ కొడుకులు. చమార్ అనే దళిత కులానికి చెందిన వాళ్ళ పేర్లు ఘీసూ, మాధవ్. సోమరిపోతులు. పనిదొంగలు. మాధవ్‌కు పెళ్లవుతుంది. భార్య పేరు బుధియా. బుధియా పురుటినొప్పులు పడుతుండగా కథ మొదలౌతుంది. కాన్పు కష్టమై ఆమె చచ్చిపోతోందని తెలిసి కూడా వీళ్ళిద్దరూ ఏమీ పట్టించుకోకుండా, గొప్పవాళ్ళ ఇళ్ళలో జరిగే పెళ్లి విందుల గురించి మాట్లాడుకుంటూ, బంగాళాదుంపలు కాల్చుకు తింటూ, ఇలా గుడిసె బయటే కాలం గడిపేస్తారు. రాత్రంతా బాధపడి, కనలేక, తెల్లారేసరికి ఆమె చచ్చిపోతుంది. దహనసంస్కారం కోసం అందర్నీ అడిగి ఒక అయిదు రూపాయలు సంపాదిస్తారు తండ్రీకొడుకులు. శవానికి కొత్తబట్ట కప్పి దహనం చెయ్యాలి. (ఆ బట్టను కఫన్ అంటారు.) ఆ కఫన్ కోసం దుకాణాలు తిరుగుతూ మద్యం దుకాణం దగ్గరికి వస్తారు. ఇంకేముంది, ఇద్దరూ ఆ డబ్బుతో శుభ్రంగా తిని తాగి పడిపోతారు.
--  బుధియా చావుని తప్పించే ప్రయత్నమైనా కనీసం జరగదు. ఘీసూ మాధవ్‌లు నలుగురినీ కేకెయ్యటం, డబ్బుకోసం ప్రయత్నించటం లాంటివేవీ చెయ్యరు. ఆమె ఎప్పుడు చచ్చిపోతుందా అని ఎదురు చూస్తూ కూచుంటారు.
-- ఈ కథ చదివితే ‘అమ్మో ఇంత మానవత్వం లేకుండా మనుషులు బతుకుతారా!’ అని సగటు మధ్యతరగతి మనుషులకు వెగటు పుట్టొచ్చు. కానీ, మనుషుల్లో అమానుష లక్షణాలని వేటిని అనుకుంటామో అవి చావు సందర్భాల్లో బాగా బైటపడతాయి. ఎకనామిక్ ఈక్వేషన్స్ అంతో కొంతో లేకుండా ఒట్టి దుఃఖమయంగా ఏ చావూ వెళ్ళదు. మనిషి బతుకులాగే మనిషి చావు కూడా లాభనష్టాల లెక్కే.
 ('ఈమాట ' జాలపత్రిక  మార్చ్, 2017 సంచికలొ ప్రచురించిన
   ల.లి.త.గారి వ్యాసం "ఇద్దరు కథకులు – రెండు చెదిరిన బ్రతుకుల కథలు" నుండి సంగ్రహణ)


No comments:

Post a Comment

.