ప్రశ్న : టన్నుల కొద్దీ బరువుండే విమానం ఆకాశంలో ఎలా ఎగరగలదు?
జవాబు : ప్రయాణికులు లేని సమయంలో సాధారణ బోయింగ్ 787 తరహా విమానం దాదాపు 130 టన్నుల బరువుంటుంది. అందులో ఇక ప్రయాణికులు, సిబ్బంది, బ్యాగేజీ ఇతర వస్తు రవాణాను కలుపుకుంటే ఇలాంటి విమానాలు సుమారు 250 టన్నుల బరువుంటాయి. ఇంత వరకు తయారైన ప్రయాణికుల లేదా రవాణా సంబంధ విమానాల్లో యాంటనవ్ మ్రియా అన్నింటికంటే బరువైంది. దీని బరువు సుమారు 650 టన్నులు. ఇలాంటి విమానాలయినా, ఇంతకంటే ఎక్కువ బరువుండే సాటర్న్-వి లాంటి అత్యంత బరువైన విమానాలు, ఇంకా పైకి దూసుకెళ్లే రాకెట్లు... అన్నీ భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా గాల్లోకి వెళ్లేందుకు ఇంధనంలో ఉన్న రసాయనిక శక్తిని, యాంత్రిక శక్తిగా మార్చుకోవడమే కారణం. ఇందుకు తగిన విధంగా విమానాల్లో రెక్కలు, టర్బోజెట్ ఇంజన్లు, విమాన రూపు రేఖలు సహకరిస్తాయి. బెర్నౌలీ సూత్రాలు, న్యూటన్ మూడో సూత్రపు సర్దుబాట్లు విమానాల గగన విహారాలకు తోడ్పడతాయి. అలాగే రాకెట్ విషయంలో కూడా రాకెట్ ఇంధనం మండటం ద్వారా విడుదలైన వాయువులు కిందున్న గొట్టం ద్వారా విపరీతమైన ద్రవ్య వేగంతో రావడం ద్వారా రాకెట్ పైకెగురుతుంది. ఇందులో కూడా న్యూటన్ గమన సూత్రాలు ఇమిడి ఉన్నాయి. భూమ్యాకర్షణను అధిగమించేందుకు శక్తి కావాలి. ఆ శక్తి విమానాల్లో, రాకెట్లలో వాడే ఇంధనాల్లో ఉంటుంది.
ప్రశ్న: విశ్వం ఉష్ణోగ్రత పెరుగుతూ ఉందా?
జవాబు: విశ్వంలోని నక్షత్రాలన్నీ వెలుగుతోపాటు అంతరిక్షంలోకి కోట్లాది సంవత్సరాల నుంచీ వెలువరిస్తున్న ఉష్ణశక్తి వల్ల విశ్వం యొక్క ఉష్ణోగ్రత తప్పకుండా కొంతమేర పెరిగిందని అనుకోవడం సహజం. కానీ ఈ విషయంలో విశ్వం వ్యాపనం చెందుతుందనే సత్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నక్షత్రాలు విడుదల చేస్తున్న ఉష్ణశక్తి విశ్వమంతా వ్యాపిస్తూ ఉంది. 14 బిలియన్ల సంవత్సరాల క్రితం విశ్వం ఏర్పడడానికి కారణమైన బిగ్‌బ్యాంగ్ వల్ల ఏర్పడిన ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతూ ఉన్నాయి. 2008వ సంవత్సరంలో నక్షత్ర శాస్త్రజ్ఞులు ప్రపంచంలో కెల్లా అతి పెద్దవి, సమర్ధవంతమైనవి అయిన టెలిస్కోపుల ద్వారా పదకొండు బిలియన్ (బిలియన్ = ఒకటి తర్వాత 9సున్నాలు) కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కార్బన్‌మోనాక్సైడ్ అణువుల ప్రవర్తనను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ఆ అణువుల పరిసరాల ఉష్ణోగ్రత మైనస్ 264 డిగ్రీల సెంటిగ్రేడ్ అని తెలిసింది. అంటే ప్రస్తుతం విశ్వం ఉన్న ఉష్ణోగ్రత కన్నా 72 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువ అని. అంటే విశ్వం వ్యాపనం చెందే కొలదీ దాని ఉష్ణోగ్రత తగ్గుతుందనే కదా!
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
No comments:
Post a Comment