Pages

Wednesday, June 7, 2017

మనషులలాగే జంతువులు, మొక్కలు కూడా నవ్వుతాయా? ఏడుస్తాయా?

ప్రశ్న: గడియారంలో మూడుముళ్లు వేర్వేరు వేగాలలో ఎలా తిరుగుతాయి?

జవాబు: ఒకప్పుడు 'కీ' ఇవ్వడం ద్వారా ఒక సర్పిలాకార స్ప్రింగ్‌లోకి శక్తిని నింపినపుడు, అది తిరిగి యధాస్థితికి చేరే క్రమంలో విడుదల చేసే యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని గడియారపు ముళ్లు తిరగేవి. నేడు ఎలక్ట్రానిక్స్‌ పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ద్వారా ప్రత్యేకమైన విద్యుత్‌ సర్క్యూట్‌ ద్వారా క్వార్ట్‌ ్జ(Quartz) స్ఫటికానికి విద్యుత్‌ను పంపినప్పుడు అది జరిపే సంకోచ వ్యాకోచాల యాంత్రిక శక్తితో గడియారపు ముళ్లను నడిపిస్తున్నారు.
ఈ సర్క్యూట్‌కు కావలసిన శక్తిని చిన్న బొత్తాము ఘటం(button cell) ద్వారా సమకూరుస్తారు. కాబట్టి పాత 'కీ' గడియారమైనా కొత్త క్వార్ట్‌ ్జ గడియారమైనా మొదట తన శక్తిని ఓ చక్రానికి బదలాయిస్తుంది. ఇది ఓ పళ్ల చక్రం (toothwheel). దీనికి వివిధ వ్యాసార్థాలు ఉన్న మూడు వేర్వేరు పళ్ల చక్రాలను అనుసంధానిస్తారు. ప్రధాన చక్రానికి ఉండే పళ్లకు అనుగుణంగా అనుసంధాన చక్రాలకు ఉన్న పళ్ల సంఖ్యను మార్చడం ద్వారా అవి వేర్వేరు వేగాలతో తిరిగేలా చేస్తారు. ఆ చక్రాలకే గడియారం డయల్‌పై తిరిగే ముళ్లను కలుపుతారు. ఆయా చక్రాల వేగాన్ని బట్టి గడియారంలో ఒక ముల్లు గంటలను, ఒక ముల్లు నిమిషాలను, మరో ముల్లు సెకన్లను సూచించేలా వేర్వేరు వేగాలతో తిరుగుతాయి. ఇలా అవసరాన్ని బట్టి మరిన్ని చక్రాలను, ముళ్లను కూడా అనుసంధానించుకోవచ్చును.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, -వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక






ప్రశ్న: ఫిట్స్‌ వచ్చిన వారి చేతుల్లో ఇనుప వస్తువులు, తాళపు గుత్తి పెట్టగానే తగ్గిపోతాయంటారు. నిజమేనా?*
జవాబు: ఫిట్స్‌ రావడం ఓ మానసిక రుగ్మతకు, నరాల బలహీనతకు చిహ్నం. ఇలాంటి వారికి చాలా జాగ్రత్తగా ప్రథమ చికిత్స చేయాలి. తాళపు గుత్తి పెట్టితేనో, ఇనుప వస్తువులు చేతుల్లో పెడితేనో ఫిట్స్‌ తగ్గిపోతాయనుకోవడం కేవలం అపోహ మాత్రమే! ఇలా చేయడం వల్ల ఏవిధమైన ప్రయోజనం లేదు. కేవలం కాలయాపన వల్ల రోగికి అందవలసిన చికిత్స మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఫిట్స్‌ వల్ల రోగి నోటిలో వచ్చే నురగను వెను వెంటనే తీసెయ్యాలి. అది గొంతు ద్వారా శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఉండేందుకు, నాలుక అపస్మారకంగా వెనక్కి మడుచుకుని గొంతులోకి అడ్డుగా పడకుండా ఉండేందుకు, రోగిని బోర్లా పడుకోబెట్టాలి. వూపిరితిత్తుల మీద ఒత్తిడి రాకుండా ఉండేలా ఎడమ భుజం కింద మెత్తటి దిండు అమర్చాలి. ఫిట్స్‌ వచ్చిన వ్యక్తి తాత్కాలికంగా మానసిక విచక్షణ కోల్పోవడం వల్ల విపరీతమైన గందరగోళానికి లోనై పళ్లను గట్టిగా బిగపడతాడు. ఎంతగానంటే చాలాసార్లు పళ్లు కూడా పగిలిపోయి గొంతులోకి వెళ్లవచ్చు. ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మెత్తటి గుడ్డ చుట్టిన కర్ర చివరను రెండు దవడల మధ్య ఉంచాలి. ఆహారం, నీరు ఏ మాత్రం ఇవ్వకూడదు. ఆయా పదార్థాలు సరాసరి పొట్టలోకి కాకుండా శ్వాసనాళంలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. తక్షణమే డాక్టరును సంప్రదించి త్వరగా చికిత్స చేయించాలి.






ప్రశ్న: మనషులలాగే జంతువులు, మొక్కలు కూడా నవ్వుతాయా? ఏడుస్తాయా?

జవాబు: భావాలను వ్యక్తీకరించడం చాలా జంతువుల్లో ఉంది. ఇది ఏకకణజీవులు, మెదడు లేని జీవులకు సాధ్యం కాదు. ఎందుకంటే భావం అంటేనే పరిసర పరిజ్ఞానాన్ని పొందడం, దాన్ని జ్ఞాపకంగా పదిల పరుచుకోవడం, ఆ సమాచారం ఆధారంగా తోటి జీవితో తన ప్రవర్తనను నిర్ణయించుకోవడం అన్నమాట. మెదడున్న జీవులన్నీ వివిధ పద్ధతుల్లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. మనుషుల్లో కన్నీరు, ఏడుపు, దిగులు మొహాన్ని చాటే కండరాల ప్రవృత్తిలాంటి రూపాల్లో దుఃఖం ప్రదర్శితమైతే, నవ్వు, మెరిసే కళ్లు లాంటి ప్రవృత్తుల ద్వారా ఆనందం ప్రకటితమవుతూ ఉంటుంది. కొన్ని జంతువుల్లో భావాలను రసాయనిక పదార్థాలను స్రవించడం ద్వారా కూడా వ్యక్తపరుస్తాయి. హార్మోను వ్యవస్థ ఉన్న జంతువుల్లో భావ వ్యక్తీకరణ ప్రస్ఫుటంగా ఉంటుంది. అయితే మొక్కలకు మెదడు, వినాళగ్రంథి (endochrine system) ఉండకపోవడం వల్ల ఏడుపులు, నవ్వులు ఉన్నట్టు ఆధారాలేమీ లేవు. అయితే కొన్ని రసాయనాలను వెదజల్లడం ద్వారా సమాచార మార్పిడి జరుగుతుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక


మొక్కలు నాటే పద్ధతి ఇలా

రాళ్లు,చెట్లు లేని ప్రాంతంలో నాటాలి.

ఒక్కో మొక్క మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలి.

నాలుగు వైపులా కనీసం 60 సెంటీమీటర్ల వెడల్పు ఉండేలా గుంత తవ్వాలి.

ఫాలిడాల్‌ డస్ట్‌, నీమ్‌ కేక్‌ గుంతలో వేయాలి.

పెరటి ఎరువును ఎర్రమట్టితో కలిపి అర అంగుళం మేర వేయాలి.

మొక్క వేర్లకు ఉన్న మట్టి విడిపోకుండా అడుగు భాగంలో జాగ్రత్తగా పట్టుకొని గుంతలో ఉంచాలి.

వేర్లు మునిగేలా మట్టి వేయాలి.

అనంతరం తుంపర్లుగా నీళ్లు చల్లాలి.


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.